సినిమా రివ్యూ - సన్ ఆఫ్ సత్యమూర్తి
మానవ సంబంధాలే... త్రివిక్రమ్ బాక్సాఫీస్ ఆస్తి
..........................................
చిత్రం - సన్ ఆఫ్ సత్యమూర్తి, తారాగణం - అల్లు అర్జున్, సమంత, నిత్యా మీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, సంపత్‌రాజ్, ‘వెన్నెల’ కిశోర్, పాటలు - ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్, సంగీతం - దేవిశ్రీ ప్రసాద్, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్- సాయిగోపాల్ ఆర్., కెమేరా - ప్రసాద్ మురెళ్ళ, ప్రొడక్షన్ డిజైనర్ - ఎస్. రవీందర్, యాక్షన్ - పీటర్ హెయిన్, కూర్పు - ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.వి. ప్రసాద్, నిర్మాత - సూర్యదేవర రాధాకృష్ణ, రచన - దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్
.........................................
ఒకే కథను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతారు. చెప్పేవాడు గనక చేయితిరిగిన కథకుడైతే, మామూలు కథ కూడా వెండితెరపై కళ్ళకు కొత్తగా కనిపిస్తుంది. హఠాత్తుగా నాన్న చనిపోవడంతో వీధిన పడ్డ కుటుంబాన్ని కాపాడే ఒక కథానాయకుడి కథ మనకు కొత్త కాకపోవచ్చు. కానీ, దానికి నాన్న బోధించిన విలువలే అతి పెద్ద ఆస్తి అనే పాయింట్‌నూ, ఆయన గౌరవాన్ని కాపాడేందుకు హీరో ఎంత దూరమైనా వెళ్ళడాన్నీ జోడించి తీస్తే? త్రివిక్రమ్ - అల్లు అర్జున్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (‘...విలువలే ఆస్తి’ అనేది ఉపశీర్షిక) అలాంటి కథే. ఆస్తికీ, ఆనందానికీ లింక్ లేదని ప్రతిపాదిస్తుంది.
కథ ఏమిటంటే...
విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) ఒక పెద్ద కోటీశ్వరుడైన సత్యమూర్తి (అతిథి పాత్రలో ప్రకాశ్‌రాజ్) కుమారుడు. మనుషులు, అనుబంధాల కన్నా ఆస్తులు, డబ్బులు విలువైనవి కావనే మంచి మనిషి. అనుకోని ఒక దుర్ఘటనలో ఆయన చనిపోతాడు. తండ్రి చెప్పిన విలువల్ని కాపాడడం కోసం రూ. 300 కోట్ల ఆస్తిని అప్పులవాళ్ళకు వదిలేసి హీరో తన కుటుంబంతో వీధిన పడతాడు. అప్పటికే పల్లవి (అదాశర్మ)తో కుదిరిన పెళ్ళిని మామ (రావు రమేశ్) క్యాన్సిల్ చేస్తాడు. అమ్మ (పవిత్రా లోకేశ్), మతి చెడిన అన్నయ్య (‘వెన్నెల’ కిశోర్), వదిన, వాళ్ళ చిన్నారి పాప సంరక్షణభారం హీరో మీద పడుతుంది. ఆర్థిక సంపాదన కోసం హీరో చివరకు వెడ్డింగ్ ప్లానర్ అవతారమెత్తుతాడు. తీరా ఆ పెళ్ళి తనను కాదన్న పల్లవిదే! అక్కడ జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో సమీరా అలియాస్ సుబ్బలక్ష్మి (సమంత)తో హీరో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికీ, చనిపోయిన తన నాన్న మీద ఆమె తండ్రి సాంబశివరావు (రాజేంద్రప్రసాద్) వేసిన అభాండాన్ని చెరిపివేయడానికీ హీరో ఏకంగా తమిళనాడులోని రెడ్డియార్‌పట్టి వద్ద స్థిరపడ్డ ఓ తెలుగు కుటుంబం దగ్గరకు వెళతాడు. అక్కడికి ఫస్టాఫ్.
తమిళనాట కొన్ని గ్రామాలకు నియంతగా వ్యవహరించే దేవరాజు నాయుడు (ఉపేంద్ర), అతని భార్య (స్నేహ)ల కుటుంబంలోకి హీరో, అతని మిత్రుడు పరంధామయ్య (అలీ) చేరతారు. అక్కడ జరిగిన అనేక సంఘటనల మధ్య 600 మంది ప్రైవేటు సైన్యమున్న దేవరాజు తన చెల్లెలు వల్లి (నిత్యామీనన్)ని హీరోకు ఇచ్చి పెళ్ళిచేయాలనుకుంటాడు. ఇష్టం లేని ఆ పెళ్ళిని హీరో ఎలా తప్పించుకున్నాడు, 8 వేల గజాల స్థలం అమ్మకం విషయంలో తన తండ్రి మీద పడ్డ అభాండాన్ని ఎలా చెరిపేసుకున్నాడన్నది మిగతా కథ.
ఎలా చేశారంటే...
క్యారెక్టర్ ఆర్టిస్టు ఎమ్మెస్ నారాయణ ఆకస్మికంగా మరణించడానికి ముందు నటించిన చివరి సినిమాల్లో ఒకటి ఇది. షూటింగ్ అయిపోయాక ఆయన మరణించడంతో, వేరొకరి మిమిక్రీతో డబ్బింగ్‌ను తెలివిగా మేనేజ్ చేసిన ఈ చిత్రబృందం ఈ సినిమాను గౌరవంగా ఎమ్మెస్‌కే అంకితం చేసింది. నిజానికి, ఈ సినిమా నిండా బోలెడంతమంది నటీనటులు. కాబట్టి, ఏ ఫ్రేమ్‌లో చూసినా తెర నిండుగా నటీనటులు కనిపిస్తూనే ఉంటారు. ఇన్ని పాత్రల మధ్యనా అల్లు అర్జున్ విపరీతమైన ఎనర్జీతో, విచిత్రమైన ఒక డైలాగ్ డెలివరీ శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. బాధ్యతాయుతమైన కొడుకుగా, చలాకీ ప్రేమికుడిగా రకరకాల షేడ్స్ ఉన్న పాత్రను బాగా పోషించారు. కొన్ని పాటలకు చులాగ్గా అతను వేసిన స్టెప్పులు బాగున్నాయి. మెయిన్‌స్ట్రీమ్ సినిమాల హీరోయిన్ సమంత డయాబెటిక్ పేషెంట్ లాంటి పాత్ర పోషించడం విశేషమే. అందం, అభినయం కలగలిసిన పాత్రపోషణ ఆమెది. నిత్యా మీనన్ కనిపించేది కాసేపే అయినా, బాగున్నారు. అదాశర్మది చాలా కొద్దిసేపు కనిపించే పాత్ర. ఫస్టాఫ్‌లో అలీ, సెకండాఫ్ చివరలో బ్రహ్మానందం కామెడీ పండించే పనిని భుజానికి ఎత్తుకున్నారు. ఉపేంద్ర, కోట శ్రీనివాసరావు, స్నేహ లాంటి వారు నిడివి రీత్యా చిన్నవే అయినా, ఆ యా పాత్రలు నిండుగా కనిపించడానికి తోడ్పడ్డారు.
సాంకేతిక విభాగాల పనితీరేమిటంటే...
ఫస్టాఫ్ సెంటిమెంట్ సన్నివేశాలతో కొంత నిదానంగా నడుస్తుంది. ఇక, సెకండాఫ్‌లో కొంత వేగంగానే నడిచినా, అనేక అంశాలను ఒక్కచోట గుదిగుచ్చడంతో ఏ పాత్ర మీదా, సంఘటన మీదా పూర్తి శ్రద్ధ పెట్టే అవకాశం లేకుండాపోయింది.అయితేనేం, ఈ సినిమాకున్న అనేక బలాల్లో పాటలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ముఖ్యమైనవి. ఇప్పటికే ఈ పాటలు రేడియోలో, టీవీల్లో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా, ‘చల్ చలో చలో....’ (రచన - రామజోగయ్య శాస్త్రి, గానం - రఘు దీక్షిత్) అనే పాట జీవన తాత్త్వికతను బోధిస్తూ, ఆలోచింపజేసేలా సాగుతుంది. దేవిశ్రీ ప్రసాదే స్వయంగా రాసి, శ్రావణభార్గవితో కలసి పాడిన ‘సూపర్ మచ్చీ...’ పాట సినిమా చివరలో పక్కా మాస్ శైలిలో ఉర్రూతలూపుతుంది. అలాగే, ‘కమ్ టు ది పార్టీ...’ (గానం - విజయ్ ప్రకాశ్) అనే పార్టీ గీతం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కలానికి ఉన్న ఆధునిక పాళీని చూపుతుంది. రాగల కొద్దిరోజులు జనం నోట నానుతుంది. శ్రీమణి రాసిన ‘జారుకో...’ గీతం (గానం - దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్, ఎం.ఎం. మానసి) గమ్మత్తుగా ధ్వనిస్తుంది. ఇక, ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫీ, రవీందర్ కళా దర్శకత్వం కథానుగుణంగా సాగుతాయి. పీటర్ హెయిన్ చేసిన యాక్షన్ సన్నివేశాల్లో సూట్‌కేసు దొంగలపై హీరో చేసే ఫైటు లాంటివి బాగుంటాయి.
ఎలా ఉందంటే...
హీరో ప్రయాణం ఎక్కడో మొదలై మరెక్కడే తేలినట్లూ, బలమైన విలన్ సినిమాకు కరవైనట్లూ అనిపించే ప్రమాదం ఉన్న ఈ స్క్రిప్టు నిజానికి అంతకన్నా బలమైన మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మనం ఎదుటివాళ్ళకు ఏది చేస్తే, అదే మనకూ తిరిగి వస్తుంది. ఎదుటివాళ్ళకు మనం మంచి చేసినా, కోరుకున్నా... అదే మనకూ లభిస్తుందనే విషయాన్ని అంతర్లీనంగా చెప్పే వెండితెర కథ ఇది. త్రివిక్రమ్‌కు బాగా పేరు తెచ్చిన ‘అతడు’, ‘అత్తారింటికి దారేది’ లాంటి వాటి లాగానే ఈ చిత్రం కూడా మానవ సంబంధాలు, బంధాలు, బాంధవ్యాల చుట్టూ తిరిగే కథే. బహుశా అందుకే కావచ్చు... అక్కడక్కడా ఇది త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్‌ల ‘అత్తారింటికి దారేది’నీ, తమిళ నేపథ్యంతో వచ్చిన షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’నూ గుర్తుకుతెస్తుంది. ఇవన్నీ కుటుంబ కథలు కావడం, సకుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసినవి కావడం అనివార్యంగా పోలికలు తెస్తుంది.
కాకపోతే, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా మనసుకు హత్తుకొనేలా, అదీ ప్రేక్షకుడు ఒక్కక్షణం ఆగి ఆలోచించేలాగా కూడా చెప్పడం రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్‌కు ఉన్న పెద్ద బలం. పైగా, కథలోని ఏ సంఘటననూ ఏకబిగిన ఒకేసారిగా పూర్తిగా వెల్లడించరు. దాన్ని విడతల వారీగా చెప్పుకుంటూ, ముడులు విప్పుకుంటూ వెళ్ళడంలో ఒక ప్రయోజనం ఉంది. ఆ సంఘటనలోని రకరకాల కోణాలు మెల్లగా వెల్లడవుతూ, ఒక సస్పెన్స్‌నూ, సర్‌ప్రైజ్‌నూ ఆఖరు వరకూ కొనసాగిస్తాయి. హీరో తండ్రి తాలూకు ప్రమాదమనే సంఘటనను హీరో దృష్టిలో ఒకసారి కొంత, హీరోకు ప్రత్యర్థి (విలన్ అనచ్చా?) దృష్టిలో మరికొంత, దానికి కొనసాగింపుగా నిత్యా మీనన్ దృష్టిలో మరికొంత వెల్లడించడం అలాంటిదే! ఇలాంటి సినీ కథన పద్ధతి ఆసక్తికరంగానూ, రొటీన్‌కు భిన్నంగానూ అనిపిస్తుంది. డైలాగ్ కామెడీ కన్నా దృశ్యాలు, భావప్రకటన ద్వారా విజువల్ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యమివ్వడం కూడా కొత్తగా అనిపిస్తుంది.
ఈ సినిమా మొత్తాన్నీ ఆయన ఒక మంచి నవల తరహాలో నేరేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో పాత్రలు, సంఘటనలు, కొన్నిచోట్ల రచయితగా రాసిన డైలాగులు మామూలు కన్నా ఎక్కువే. హీరో మరీ ఎక్కువ మాట్లాడుతున్నాడేమో అనీ అనిపిస్తుంది. అయితే, రొటీన్ సినిమాలకు భిన్నమైన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. కొన్నిచోట్ల త్రివిక్రమ్ రాసిన డైలాగులు, పాత్రల ద్వారా వల్లించిన జీవన సూక్తులు చిరకాలం గుర్తుండిపోతాయి. హీరో మాటల్లో వచ్చే ‘‘ మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత. పిల్లలు మోయాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం’’..., ‘‘మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్’’..., ‘‘భార్యను గెలవాలంటే కప్పులు పగలగొట్టడం కాదు సార్! (మధ్యలో ఉన్న) ఆ గోడ బద్దలుకొట్టండి!’’ లాంటి డైలాగులు అందుకు ఉదాహరణ. తమిళనాట సన్నివేశాలకు ‘కూడు తిన్నారా?’ లాంటి అక్కడ మాట్లాడే తెలుగే వాడేందుకు శ్రమించారు. ఇవన్నీ సినిమాకు పాజిటివ్ అంశాలు.
అయితే, ఏ సీన్‌కు ఆ సీన్‌గా బాగుందనిపించే ఈ రెండు గంటల 42 నిమిషాల సినిమాలో వచ్చే సవాలక్ష సబ్‌ప్లాట్లు, తండ్రి గౌరవాన్నీ - ఆయన చెప్పిన విలువలనూ కాపాడుకోవడం కోసం హీరో పడే పాట్లు చూశాక కొన్నింటికి సరైన వివరణలు, తార్కికమైన ముగింపులు కనపడవు. హీరో ప్రేమిస్తున్నది అదాశర్మ స్నేహితురాలైన సమంతను అని పెళ్ళి ఏర్పాట్ల మధ్య పదే పదే చెబుతూ వస్తారు కానీ, ఆ పక్కనే కనిపిస్తున్న రాజేంద్రప్రసాద్ కూతురే ఆ అమ్మాయన్న సంగతిని తరువాత సీన్ల ఎప్పుడో బయటపెట్టడం ఒక సినిమాటిక్ స్క్రీన్‌ప్లే కన్వీనియన్స్. ఇక, నిత్యామీనన్ నిజానికి ప్రేమిస్తున్నది తన మేనమామనే అయినా, హీరోతోనూ ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం తికమక కలిగిస్తుంది. అలాగే, ఉపేంద్ర ఇంటిపక్కనే అతని బావమరిది ఉన్నాడని చెబుతారు, చూపిస్తారు కానీ, సినిమాలో అతను మళ్ళీ కనిపించడు. తమిళనాడులోని ఉపేంద్ర ఇంటికి హీరో బృందం రావడానికే కారణమైన సదరు బావమరిది పాత్ర ఆ తరువాత వారి గురించి పట్టించుకోదెందుకో తెలియదు.
ఇలాంటి లూజ్ ఎండ్స్‌ను పక్కనపెడితే, మొత్తం మీద ఈ సినిమా సగటు ప్రేక్షకులను నిరాశ పరచదు. అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది. మర్చిపోతున్న మానవ సంబంధాలు, మనం వదిలేసుకుంటున్న మంచి విలువలను మరోసారి గుర్తు చేస్తుంది. ఆ మేరకు ఈ దర్శక - రచయితనూ, తీసిన నిర్మాతనూ అభినందించాల్సిందే! కాకపోతే, పెళ్ళి భోజనానికని సిద్ధమై వచ్చిన ప్రేక్షకులు పూర్తిస్థాయిలో సంతృప్తి పొందుతారా అన్నదే కించిత్ అనుమానం. అయితే, అవేవీ ఈ సినిమా కమర్షియల్ విజయాన్ని అడ్డుకోలేవన్నది మాత్రం అనుమానం అక్కర్లేని నిజం.
కొసమెరుపు - అన్నట్లు... ఈ సినిమాలో హీరో పాత్రను ఒకరు నందు అంటారు... మరొకరు ఆనంద్ అంటారు... ఇంకొందరు విరాజ్ అని పిలుస్తారు. వెరసి అతని పూర్తి పేరు - విరాజ్ ఆనంద్ అని ప్రేక్షకులే గ్రహించాలి. మొత్తానికి, సినిమాలో ఒక ప్రధానమైన కథకు బోలెడన్ని ఉపకథలు కలిపినట్లే, ఒక హీరో పాత్రకు ఇన్ని పేర్లు, ముద్దు పిలుపులూ ఉండడం అరుదైన విచిత్రమే! మొత్తానికి, త్రివిక్రమ్ మార్కు డైలాగులు, కథన విధానం, అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ బాణీల్లోని పాటలు లాంటి వాణిజ్య విలువలు ఈ ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి బాక్సాఫీస్ వద్దే కాక, రేపు పదే పదే టీవీ చానళ్లలో ప్రసారానికీ తరగని ఆస్తి. ‘త్రివిక్రమ్ సినిమా అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి’ అనుకొంటూ, గత చిత్రాల పోలికలతో ‘అంతకు మించి...’ కావాలని కోరుకోకపోతే, వేసవి సినీ కాలక్షేపానికి ఇంతకు మించి కావాల్సింది ఇంకేముంటుంది!
- రెంటాల జయదేవ