Son of Satyamurthy
-
నార్త్ లోనూ బన్నీ రికార్డ్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో మల్లు అర్జున్‌గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న బన్నీ నార్త్ ఇండస్ట్రీలోనూ అదే ఫాంతో దూసుకుపోతున్నాడు. అయితే బన్నీ సినిమాలు థియేటర్లలో భారీగా సందడి చేయకపోయినా.., తాజాగా బన్నీ రికార్డ్స్ స్టైలిష్ స్టార్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సన్నాఫ్ సత్యమూర్తి. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ నార్త్‌లో ఒకేసారి రెండు రికార్డ్స్‌ను సృష్టించింది. హిందీలోనూ సన్నాఫ్ సత్యమూర్తి పేరుతో యూట్యూబ్‌లో పెట్టిన ఈ సినిమాకు.., ఇప్పటి వరకు 69 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో గతవారం ఓ టీవీ చానల్లో ప్రసారం అయిన ఈ సినిమా అత్యధిక టీఆర్పీలు సాధించి బుల్లితెర మీద కూడా సత్తా చాటింది. ప్రస్తుతానికి ఆన్లైన్లో స్మాల్ స్క్రీన్‌లో మాత్రమే కనిపిస్తున్న బన్నీ ఉత్తరాది హవా త్వరలో థియేటర్లలోనూ కనిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్. -
బన్నీ సినిమా అతడితోనే..!
వరుస సూపర్ హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ సరైనోడుతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయిన ఈ సినిమా ఈ నెల 22న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు బన్నీ చేయబోయే నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. తమిళ దర్శకులతో బన్నీ సినిమా ఉంటుందన్న టాక్ వినిపించినా అఫీషియల్‌గా మాత్రం కన్ఫామ్ కాలేదు. సరైనోడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తమిళ దర్శకుడు లింగుసామి డైరెక్షన్లో బన్నీ సినిమా ఉంటుందన్న ప్రచారం జరిగింది. అంతేకాదు బన్నీ సినిమా కోసం లింగుసామి, విశాల్ సినిమాను కూడా పక్కన పెట్టేశాడన్న వార్త అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ తరువాత మనం, 24 సినిమాల దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడన్న వార్త వినిపించింది. అయితే ఈ ప్రాజెక్ట్స్ ఏవీ సెట్స్ మీదకు రాలేదు. తాజాగా బన్నీ పుట్టిన రోజు సందర్భంగా హారికా హాసిని క్రియేషన్స్ విడుదల చేసిన ఓ పోస్టర్, అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇచ్చేసింది. బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు, ఈ పోస్టర్లో తమ బ్యానర్లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమాను నిర్మిస్తున్నట్టుగా హింట్ ఇచ్చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సక్సెస్‌లు అందించిన ఈ కాంబినేషన్లో త్వరలో హ్యాట్రిక్ మూవీ వస్తుందన్న ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్. -
'సన్నాఫ్ సత్యమూర్తి'కి యాపిల్ కాంప్లిమెంట్
ఈ ఏడాది బిగెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాకు మరో గౌరవం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ రంగంలో సంచలనాలు నమోదు చేస్తున్న యాపిల్ సంస్థ, ఈ ఏడాది అత్యుత్తమ తెలుగు ఆల్బమ్‌గా 'సన్నాఫ్ సత్యమూర్తి'ని ఎంపిక చేసింది. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ప్రతి ఏడాది యాపిల్ సంస్థ ఐట్యూన్స్ స్టోర్ ద్వారా రిలీజ్ అయిన మ్యూజిక్ ఆల్బమ్స్‌లో బెస్ట్ ఆల్బమ్స్‌ను, ఆ ఏడాది చివరలోఎంపిక చేస్తోంది. కేవలం సేల్స్ పరంగానే కాకుండా, మ్యూజిక్ క్వాలిటీ, జనరంజకమైనవి లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ సెలక్షన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది గాను తెలుగులో దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అదించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాను సెలెక్ట్ చేసింది. యాపిల్ అందిస్తున్న ఈ గౌరవంతో దేవీ సంగీతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుంది. -
రియాలిటీ షో
‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘ఓకే బంగారం’, ‘గంగ’ చిత్రాల్లో నటించి మురిపించిన నిత్యామీనన్ కథానాయికగా మరో చిత్రం రానుంది. నిత్యామీనన్, ఉన్ని ముకుందం, శ్వేతా మీనన్, సిద్దిక్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రాన్ని ‘ఈ వేళలో’ పేరుతో మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. టి.కె రాజీవ్ కుమార్ దర్శకుడు. ఈ నెల మూడో వారంలో ఈ సినిమా విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘టీవీ రియాలిటీ షో, రేటింగ్స్ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ప్రేమకథ ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శరత్, మాటలు- పాటలు: అంజలి గెర్రి, కెమెరా: వినోద్ ఇల్లంపల్లి. -
సినిమా రివ్యూ - సన్ ఆఫ్ సత్యమూర్తి
మానవ సంబంధాలే... త్రివిక్రమ్ బాక్సాఫీస్ ఆస్తి .......................................... చిత్రం - సన్ ఆఫ్ సత్యమూర్తి, తారాగణం - అల్లు అర్జున్, సమంత, నిత్యా మీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, సంపత్‌రాజ్, ‘వెన్నెల’ కిశోర్, పాటలు - ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్, సంగీతం - దేవిశ్రీ ప్రసాద్, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్- సాయిగోపాల్ ఆర్., కెమేరా - ప్రసాద్ మురెళ్ళ, ప్రొడక్షన్ డిజైనర్ - ఎస్. రవీందర్, యాక్షన్ - పీటర్ హెయిన్, కూర్పు - ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.వి. ప్రసాద్, నిర్మాత - సూర్యదేవర రాధాకృష్ణ, రచన - దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్ ......................................... ఒకే కథను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతారు. చెప్పేవాడు గనక చేయితిరిగిన కథకుడైతే, మామూలు కథ కూడా వెండితెరపై కళ్ళకు కొత్తగా కనిపిస్తుంది. హఠాత్తుగా నాన్న చనిపోవడంతో వీధిన పడ్డ కుటుంబాన్ని కాపాడే ఒక కథానాయకుడి కథ మనకు కొత్త కాకపోవచ్చు. కానీ, దానికి నాన్న బోధించిన విలువలే అతి పెద్ద ఆస్తి అనే పాయింట్‌నూ, ఆయన గౌరవాన్ని కాపాడేందుకు హీరో ఎంత దూరమైనా వెళ్ళడాన్నీ జోడించి తీస్తే? త్రివిక్రమ్ - అల్లు అర్జున్‌ల కాంబినేషన్లో వచ్చిన తాజా సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (‘...విలువలే ఆస్తి’ అనేది ఉపశీర్షిక) అలాంటి కథే. ఆస్తికీ, ఆనందానికీ లింక్ లేదని ప్రతిపాదిస్తుంది. కథ ఏమిటంటే... విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) ఒక పెద్ద కోటీశ్వరుడైన సత్యమూర్తి (అతిథి పాత్రలో ప్రకాశ్‌రాజ్) కుమారుడు. మనుషులు, అనుబంధాల కన్నా ఆస్తులు, డబ్బులు విలువైనవి కావనే మంచి మనిషి. అనుకోని ఒక దుర్ఘటనలో ఆయన చనిపోతాడు. తండ్రి చెప్పిన విలువల్ని కాపాడడం కోసం రూ. 300 కోట్ల ఆస్తిని అప్పులవాళ్ళకు వదిలేసి హీరో తన కుటుంబంతో వీధిన పడతాడు. అప్పటికే పల్లవి (అదాశర్మ)తో కుదిరిన పెళ్ళిని మామ (రావు రమేశ్) క్యాన్సిల్ చేస్తాడు. అమ్మ (పవిత్రా లోకేశ్), మతి చెడిన అన్నయ్య (‘వెన్నెల’ కిశోర్), వదిన, వాళ్ళ చిన్నారి పాప సంరక్షణభారం హీరో మీద పడుతుంది. ఆర్థిక సంపాదన కోసం హీరో చివరకు వెడ్డింగ్ ప్లానర్ అవతారమెత్తుతాడు. తీరా ఆ పెళ్ళి తనను కాదన్న పల్లవిదే! అక్కడ జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో సమీరా అలియాస్ సుబ్బలక్ష్మి (సమంత)తో హీరో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికీ, చనిపోయిన తన నాన్న మీద ఆమె తండ్రి సాంబశివరావు (రాజేంద్రప్రసాద్) వేసిన అభాండాన్ని చెరిపివేయడానికీ హీరో ఏకంగా తమిళనాడులోని రెడ్డియార్‌పట్టి వద్ద స్థిరపడ్డ ఓ తెలుగు కుటుంబం దగ్గరకు వెళతాడు. అక్కడికి ఫస్టాఫ్. తమిళనాట కొన్ని గ్రామాలకు నియంతగా వ్యవహరించే దేవరాజు నాయుడు (ఉపేంద్ర), అతని భార్య (స్నేహ)ల కుటుంబంలోకి హీరో, అతని మిత్రుడు పరంధామయ్య (అలీ) చేరతారు. అక్కడ జరిగిన అనేక సంఘటనల మధ్య 600 మంది ప్రైవేటు సైన్యమున్న దేవరాజు తన చెల్లెలు వల్లి (నిత్యామీనన్)ని హీరోకు ఇచ్చి పెళ్ళిచేయాలనుకుంటాడు. ఇష్టం లేని ఆ పెళ్ళిని హీరో ఎలా తప్పించుకున్నాడు, 8 వేల గజాల స్థలం అమ్మకం విషయంలో తన తండ్రి మీద పడ్డ అభాండాన్ని ఎలా చెరిపేసుకున్నాడన్నది మిగతా కథ. ఎలా చేశారంటే... క్యారెక్టర్ ఆర్టిస్టు ఎమ్మెస్ నారాయణ ఆకస్మికంగా మరణించడానికి ముందు నటించిన చివరి సినిమాల్లో ఒకటి ఇది. షూటింగ్ అయిపోయాక ఆయన మరణించడంతో, వేరొకరి మిమిక్రీతో డబ్బింగ్‌ను తెలివిగా మేనేజ్ చేసిన ఈ చిత్రబృందం ఈ సినిమాను గౌరవంగా ఎమ్మెస్కే అంకితం చేసింది. నిజానికి, ఈ సినిమా నిండా బోలెడంతమంది నటీనటులు. కాబట్టి, ఏ ఫ్రేమ్‌లో చూసినా తెర నిండుగా నటీనటులు కనిపిస్తూనే ఉంటారు. ఇన్ని పాత్రల మధ్యనా అల్లు అర్జున్ విపరీతమైన ఎనర్జీతో, విచిత్రమైన ఒక డైలాగ్ డెలివరీ శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. బాధ్యతాయుతమైన కొడుకుగా, చలాకీ ప్రేమికుడిగా రకరకాల షేడ్స్ ఉన్న పాత్రను బాగా పోషించారు. కొన్ని పాటలకు చులాగ్గా అతను వేసిన స్టెప్పులు బాగున్నాయి. మెయిన్‌స్ట్రీమ్ సినిమాల హీరోయిన్ సమంత డయాబెటిక్ పేషెంట్ లాంటి పాత్ర పోషించడం విశేషమే. అందం, అభినయం కలగలిసిన పాత్రపోషణ ఆమెది. నిత్యా మీనన్ కనిపించేది కాసేపే అయినా, బాగున్నారు. అదాశర్మది చాలా కొద్దిసేపు కనిపించే పాత్ర. ఫస్టాఫ్‌లో అలీ, సెకండాఫ్ చివరలో బ్రహ్మానందం కామెడీ పండించే పనిని భుజానికి ఎత్తుకున్నారు. ఉపేంద్ర, కోట శ్రీనివాసరావు, స్నేహ లాంటి వారు నిడివి రీత్యా చిన్నవే అయినా, ఆ యా పాత్రలు నిండుగా కనిపించడానికి తోడ్పడ్డారు. సాంకేతిక విభాగాల పనితీరేమిటంటే... ఫస్టాఫ్ సెంటిమెంట్ సన్నివేశాలతో కొంత నిదానంగా నడుస్తుంది. ఇక, సెకండాఫ్‌లో కొంత వేగంగానే నడిచినా, అనేక అంశాలను ఒక్కచోట గుదిగుచ్చడంతో ఏ పాత్ర మీదా, సంఘటన మీదా పూర్తి శ్రద్ధ పెట్టే అవకాశం లేకుండాపోయింది.అయితేనేం, ఈ సినిమాకున్న అనేక బలాల్లో పాటలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ముఖ్యమైనవి. ఇప్పటికే ఈ పాటలు రేడియోలో, టీవీల్లో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా, ‘చల్ చలో చలో....’ (రచన - రామజోగయ్య శాస్త్రి, గానం - రఘు దీక్షిత్) అనే పాట జీవన తాత్త్వికతను బోధిస్తూ, ఆలోచింపజేసేలా సాగుతుంది. దేవిశ్రీ ప్రసాదే స్వయంగా రాసి, శ్రావణభార్గవితో కలసి పాడిన ‘సూపర్ మచ్చీ...’ పాట సినిమా చివరలో పక్కా మాస్ శైలిలో ఉర్రూతలూపుతుంది. అలాగే, ‘కమ్ టు ది పార్టీ...’ (గానం - విజయ్ ప్రకాశ్) అనే పార్టీ గీతం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కలానికి ఉన్న ఆధునిక పాళీని చూపుతుంది. రాగల కొద్దిరోజులు జనం నోట నానుతుంది. శ్రీమణి రాసిన ‘జారుకో...’ గీతం (గానం - దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్, ఎం.ఎం. మానసి) గమ్మత్తుగా ధ్వనిస్తుంది. ఇక, ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫీ, రవీందర్ కళా దర్శకత్వం కథానుగుణంగా సాగుతాయి. పీటర్ హెయిన్ చేసిన యాక్షన్ సన్నివేశాల్లో సూట్‌కేసు దొంగలపై హీరో చేసే ఫైటు లాంటివి బాగుంటాయి. ఎలా ఉందంటే... హీరో ప్రయాణం ఎక్కడో మొదలై మరెక్కడే తేలినట్లూ, బలమైన విలన్ సినిమాకు కరవైనట్లూ అనిపించే ప్రమాదం ఉన్న ఈ స్క్రిప్టు నిజానికి అంతకన్నా బలమైన మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మనం ఎదుటివాళ్ళకు ఏది చేస్తే, అదే మనకూ తిరిగి వస్తుంది. ఎదుటివాళ్ళకు మనం మంచి చేసినా, కోరుకున్నా... అదే మనకూ లభిస్తుందనే విషయాన్ని అంతర్లీనంగా చెప్పే వెండితెర కథ ఇది. త్రివిక్రమ్‌కు బాగా పేరు తెచ్చిన ‘అతడు’, ‘అత్తారింటికి దారేది’ లాంటి వాటి లాగానే ఈ చిత్రం కూడా మానవ సంబంధాలు, బంధాలు, బాంధవ్యాల చుట్టూ తిరిగే కథే. బహుశా అందుకే కావచ్చు... అక్కడక్కడా ఇది త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్‌ల ‘అత్తారింటికి దారేది’నీ, తమిళ నేపథ్యంతో వచ్చిన షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’నూ గుర్తుకుతెస్తుంది. ఇవన్నీ కుటుంబ కథలు కావడం, సకుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసినవి కావడం అనివార్యంగా పోలికలు తెస్తుంది. కాకపోతే, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా మనసుకు హత్తుకొనేలా, అదీ ప్రేక్షకుడు ఒక్కక్షణం ఆగి ఆలోచించేలాగా కూడా చెప్పడం రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్‌కు ఉన్న పెద్ద బలం. పైగా, కథలోని ఏ సంఘటననూ ఏకబిగిన ఒకేసారిగా పూర్తిగా వెల్లడించరు. దాన్ని విడతల వారీగా చెప్పుకుంటూ, ముడులు విప్పుకుంటూ వెళ్ళడంలో ఒక ప్రయోజనం ఉంది. ఆ సంఘటనలోని రకరకాల కోణాలు మెల్లగా వెల్లడవుతూ, ఒక సస్పెన్స్‌నూ, సర్‌ప్రైజ్‌నూ ఆఖరు వరకూ కొనసాగిస్తాయి. హీరో తండ్రి తాలూకు ప్రమాదమనే సంఘటనను హీరో దృష్టిలో ఒకసారి కొంత, హీరోకు ప్రత్యర్థి (విలన్ అనచ్చా?) దృష్టిలో మరికొంత, దానికి కొనసాగింపుగా నిత్యా మీనన్ దృష్టిలో మరికొంత వెల్లడించడం అలాంటిదే! ఇలాంటి సినీ కథన పద్ధతి ఆసక్తికరంగానూ, రొటీన్‌కు భిన్నంగానూ అనిపిస్తుంది. డైలాగ్ కామెడీ కన్నా దృశ్యాలు, భావప్రకటన ద్వారా విజువల్ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యమివ్వడం కూడా కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తాన్నీ ఆయన ఒక మంచి నవల తరహాలో నేరేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో పాత్రలు, సంఘటనలు, కొన్నిచోట్ల రచయితగా రాసిన డైలాగులు మామూలు కన్నా ఎక్కువే. హీరో మరీ ఎక్కువ మాట్లాడుతున్నాడేమో అనీ అనిపిస్తుంది. అయితే, రొటీన్ సినిమాలకు భిన్నమైన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. కొన్నిచోట్ల త్రివిక్రమ్ రాసిన డైలాగులు, పాత్రల ద్వారా వల్లించిన జీవన సూక్తులు చిరకాలం గుర్తుండిపోతాయి. హీరో మాటల్లో వచ్చే ‘‘ మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత. పిల్లలు మోయాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం’’..., ‘‘మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్’’..., ‘‘భార్యను గెలవాలంటే కప్పులు పగలగొట్టడం కాదు సార్! (మధ్యలో ఉన్న) ఆ గోడ బద్దలుకొట్టండి!’’ లాంటి డైలాగులు అందుకు ఉదాహరణ. తమిళనాట సన్నివేశాలకు ‘కూడు తిన్నారా?’ లాంటి అక్కడ మాట్లాడే తెలుగే వాడేందుకు శ్రమించారు. ఇవన్నీ సినిమాకు పాజిటివ్ అంశాలు. అయితే, ఏ సీన్‌కు ఆ సీన్‌గా బాగుందనిపించే ఈ రెండు గంటల 42 నిమిషాల సినిమాలో వచ్చే సవాలక్ష సబ్ప్లాట్లు, తండ్రి గౌరవాన్నీ - ఆయన చెప్పిన విలువలనూ కాపాడుకోవడం కోసం హీరో పడే పాట్లు చూశాక కొన్నింటికి సరైన వివరణలు, తార్కికమైన ముగింపులు కనపడవు. హీరో ప్రేమిస్తున్నది అదాశర్మ స్నేహితురాలైన సమంతను అని పెళ్ళి ఏర్పాట్ల మధ్య పదే పదే చెబుతూ వస్తారు కానీ, ఆ పక్కనే కనిపిస్తున్న రాజేంద్రప్రసాద్ కూతురే ఆ అమ్మాయన్న సంగతిని తరువాత సీన్ల ఎప్పుడో బయటపెట్టడం ఒక సినిమాటిక్ స్క్రీన్‌ప్లే కన్వీనియన్స్. ఇక, నిత్యామీనన్ నిజానికి ప్రేమిస్తున్నది తన మేనమామనే అయినా, హీరోతోనూ ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం తికమక కలిగిస్తుంది. అలాగే, ఉపేంద్ర ఇంటిపక్కనే అతని బావమరిది ఉన్నాడని చెబుతారు, చూపిస్తారు కానీ, సినిమాలో అతను మళ్ళీ కనిపించడు. తమిళనాడులోని ఉపేంద్ర ఇంటికి హీరో బృందం రావడానికే కారణమైన సదరు బావమరిది పాత్ర ఆ తరువాత వారి గురించి పట్టించుకోదెందుకో తెలియదు. ఇలాంటి లూజ్ ఎండ్స్‌ను పక్కనపెడితే, మొత్తం మీద ఈ సినిమా సగటు ప్రేక్షకులను నిరాశ పరచదు. అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది. మర్చిపోతున్న మానవ సంబంధాలు, మనం వదిలేసుకుంటున్న మంచి విలువలను మరోసారి గుర్తు చేస్తుంది. ఆ మేరకు ఈ దర్శక - రచయితనూ, తీసిన నిర్మాతనూ అభినందించాల్సిందే! కాకపోతే, పెళ్ళి భోజనానికని సిద్ధమై వచ్చిన ప్రేక్షకులు పూర్తిస్థాయిలో సంతృప్తి పొందుతారా అన్నదే కించిత్ అనుమానం. అయితే, అవేవీ ఈ సినిమా కమర్షియల్ విజయాన్ని అడ్డుకోలేవన్నది మాత్రం అనుమానం అక్కర్లేని నిజం. కొసమెరుపు - అన్నట్లు... ఈ సినిమాలో హీరో పాత్రను ఒకరు నందు అంటారు... మరొకరు ఆనంద్ అంటారు... ఇంకొందరు విరాజ్ అని పిలుస్తారు. వెరసి అతని పూర్తి పేరు - విరాజ్ ఆనంద్ అని ప్రేక్షకులే గ్రహించాలి. మొత్తానికి, సినిమాలో ఒక ప్రధానమైన కథకు బోలెడన్ని ఉపకథలు కలిపినట్లే, ఒక హీరో పాత్రకు ఇన్ని పేర్లు, ముద్దు పిలుపులూ ఉండడం అరుదైన విచిత్రమే! మొత్తానికి, త్రివిక్రమ్ మార్కు డైలాగులు, కథన విధానం, అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ బాణీల్లోని పాటలు లాంటి వాణిజ్య విలువలు ఈ ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి బాక్సాఫీస్ వద్దే కాక, రేపు పదే పదే టీవీ చానళ్లలో ప్రసారానికీ తరగని ఆస్తి. ‘త్రివిక్రమ్ సినిమా అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి’ అనుకొంటూ, గత చిత్రాల పోలికలతో ‘అంతకు మించి...’ కావాలని కోరుకోకపోతే, వేసవి సినీ కాలక్షేపానికి ఇంతకు మించి కావాల్సింది ఇంకేముంటుంది! - రెంటాల జయదేవ -
S/O సత్యమూర్తి ఆడియో రిలీజ్ హైలెట్స్
-
అల్లు అర్జున్ ట్విట్టర్లోకి వచ్చేశాడు..
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఓ బహుమతి ఇచ్చాడు. బహుమతి అంటే ఏంటో అనుకునేరు. అభిమానులకు మరింత దగ్గర అయ్యేందుకు బన్నీ ట్విట్టర్లో అందుబాటులోకి వచ్చాడు. తన పుట్టిన రోజైన ఏప్రిల్ 8వ తేదీన ఉదయం సరిగ్గా 8 గంటలకు తన ట్విట్టర్ అకౌంట్ యాక్టివేట్ అయ్యాడు. అంతకుముందు కూడా యువర్స్ ట్రూలీ బన్నీ అనే పేరుతో ఒక ట్విట్టర్ ఖాతా ఉన్నా.. అది అర్జున్ అసలైన అకౌంట్ కాదు. సనాఫ్ సత్యమూర్తి సినిమా విడుదల అవుతున్న సందర్భానికి దగ్గర్లోనే అల్లు అర్జున్ ట్విట్టర్ ఖాతాలో అభిమానులకు అందుబాటులో ఉండటం శుభవార్తే. Chal chalo chaloo...Life sey miloo...Idho kotha chapter...Just say HELLLOOOO ! — Allu Arjun (@alluarjun) April 8, 2015 -
ఇక ట్విట్టర్లోకి అల్లు అర్జున్!
బన్నీ అభిమానులకు శుభవార్త. ఎట్టకేలకు ట్విట్టర్లోకి రావాలని ఈ స్టైలిష్ స్టార్ నిర్ణయించుకున్నాడు. తన పుట్టినరోజైన ఏప్రిల్ 8వ తేదీ ఉదయం సరిగ్గా 8 గంటలకు తన ట్విట్టర్ అకౌంట్ యాక్టివేట్ కానుంది. ఈ విషయాన్ని బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు తెలిపాడు. ఇంతకుముందు కూడా యువర్స్ ట్రూలీ బన్నీ అనే పేరుతో ఒక ట్విట్టర్ ఖాతా ఉన్నా.. అది అర్జున్ అసలైన అకౌంట్ కాదు. ఇన్నాళ్లుగా తాను చాలాసార్లు అడిగినా.. అర్జున్ ఒప్పుకోలేదని, ఎట్టకేలకు ఇప్పుడు తనను కన్విన్స్ చేసి అకౌంట్ ఓపెన్ చేయిస్తున్నానని శిరీష్ తెలిపాడు. సనాఫ్ సత్యమూర్తి సినిమా విడుదల అవుతున్న సందర్భానికి దగ్గర్లోనే అర్జున్ ట్విట్టర్ ఖాతా కూడా వస్తుండటం అభిమానులకు శుభవార్తే అవుతుంది. Finally I convinced Bunny to join Twitter. So, #AlluArjunonTwitter : 8th April - 8am. Stay tuned! pic.twitter.com/SIgsqhXC7T — Allu Sirish (@AlluSirish) April 4, 2015 -
కూలెస్ట్ సిటీ
అదా శర్మ.. హార్ట్‌ఎటాక్‌లో ‘హయాతి’గా అబ్బాయిల గుండెలను కొల్లగొట్టిన అమ్మాయి. ఇప్పుడు అల్లు అర్జున్ పక్కన ‘సన్నాఫ్ సత్యమూర్తి సినిమా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ స్టన్నింగ్ బ్యూటీ శుక్రవారంనాడు సిటీలో సందడి చేసింది. ప్రగతి నగర్‌లోని ‘నేచురల్స్’ స్పా అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభించేందుకు వచ్చిన ఆమెతో సిటీప్లస్ చిట్‌చాట్... ..:: శిరీష చల్లపల్లి నేను పుట్టింది కేరళలోని పాలక్కాడ్‌లో. నాన్న మర్చెంట్ నేవీలో కెప్టెన్. స్కూలింగ్ కేరళలోనే. సైకాలజీలో డిగ్రీ మాత్రం ముంబైలో చేశాను. అమ్మ క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో... నాకు కథక్ డ్యాన్స్పట్ల ఆసక్తి అనిపించింది. దీంతో కథక్‌లోనూ డిగ్రీ చేశాను. నేను జిమ్నాస్టిస్ట్ను కావడంతో కథక్ సునాయాసంగా నేర్చుకోగలిగాను, చేయగలుగుతున్నాను. ప్రస్తుతం మేం ఉంటున్నది ముంబైలో. నాకు మొదటినుంచి కల్చరల్ యాక్టివిటీస్ అన్నా... పురాతన నాటకాలన్నా, డ్యాన్స్ అన్నా చాలా ఇష్టం. కళాకారులంటే గౌరవం కూడా. నిజజీవితంలోనూ నేను అల్లరి పిల్లని. బ్యూటీ సీక్రెట్స్ పెద్దగా ఏమీ లేవు. నా రూమ్‌లో కాస్మొటిక్స్ కూడా అంతగా ఉండవు. మోడలింగ్ చేస్తుండగా... నేను ఓ షోలో మోడలింగ్ చేస్తుండగా ‘1920’ సినిమాలో ఆఫర్ వచ్చింది. అందమైన హీరోయిన్ పాత్ర అనుకున్నా. కానీ భయంకరమైన ఘోస్ట్ క్యారెక్టర్ అని తెలిశాక కొంచెం కంగారు పడ్డాను. అయితే పూర్తి కథ విన్నాక ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ సినిమా పూర్తయి రిలీజయ్యాక నన్ను నేను స్క్రీన్‌పై చూసుకొని... నన్ను నేను అద్దంలో చూస్కోవడానికి భయపడ్డాను. అయితే పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ కావడంతో అందరూ గుర్తు పెట్టుకున్నారు. అలా మొదటి సినిమాకే ఫిలింఫేర్ అవార్డ్ రావడం ఆనందాన్నిచ్చింది. హార్ట్ ఎటాక్... కొన్ని బాలీవుడ్ సినిమాలు చేశాక పూరీ జగన్నాథ్‌గారు నాకు కాల్ చేసి... ‘ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తీస్తున్నా. అందులో హీరోయిన్గా నువ్వు చేయాలి’ అన్నారు. ‘నాకు తెలుగు అస్సలు రాదు!’ అని చెప్పినా... ‘నువ్వే హీరోయిన్‌వి’ అనడంతో నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. బై కో ఇన్సిడెన్స్ మూవీ పేరు కూడా హార్ట్ ఎటాక్. అలా ఆ సినిమాకోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. కూలెస్ట్ సిటీ... హైదరాబాద్‌లో నాకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. సాధారణంగా షూటింగ్‌కి అమ్మనో, గార్డియన్నో తోడుగా తీసుకెళ్తాను. కానీ హైదరాబాద్‌లో షూటింగ్ స్పాట్‌కి ఒక్కదాన్ని వెళ్లడానికి అస్సలు సంకోచించను. నాకు ది కూలెస్ట్ మెట్రో సిటీ హైదరాబాదే! ఒకే రోజు రెండు సినిమాలు... నేను నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఈనెల 9న రిలీజ్ కాబోతోంది. అదే రోజు నేను చేసిన కన్నడ సినిమా రిలీజింగ్ కూడా ఉండటంతో కాస్త ఎగ్జైటింగ్‌గా ఉంది. బన్నీ చాలా కేరింగ్ పర్సన్! ఫ్రెండ్లీ నేచర్ తనది. ఈ మూవీలో నేను ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేశాను. వన్ ఆఫ్ మై బెస్ట్ రోల్ అని చెప్పుకోవచ్చు. బాగా బబ్లీ అండ్ నాటీ క్యారెక్టర్. నాకు సమంతా అండ్ నిత్యామీనన్ అంటే చాలా ఇష్టం. వాళ్లిద్దరూ ఉన్న సినిమాలో యాక్ట్ చేయడం సంతోషంగా అనిపించింది! -
సనాఫ్ సత్యమూర్తి ఎంతసేపు ఉంటాడు?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, సమంత జంటగా వస్తున్న సనాఫ్ సత్యమూర్తి సినిమా మీద అంచనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. రేసుగుర్రం విజయంతో మంచి ఊపుమీదున్న బన్నీ.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనని అందరూ చూస్తున్నారు. మరి ఎడిటింగ్ అనంతరం సినిమా ఎంతసేపు ఉంటుందో తెలుసా.. సరిగ్గా 162 నిమిషాలట. సెన్సార్ కూడా ముగించుకున్న ఈ సినిమా ఏప్రిల్ 9వ తేదీన విడుదల కానుంది. సరిగ్గా ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యే తర్వాతిరోజే సినిమా వస్తుండటం గమనార్హం. బన్నీతో పాటు ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్, అదా శర్మ, స్నేహ, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర తదితరులు నటిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ విభిన్నంగా కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కఠిన శిక్షణ పొందాడట. పిల్లిమొగ్గల దగ్గరనుంచి జిమ్నాస్టిక్స్ వరకు చాలా నేర్చుకున్నాడని చెబుతున్నారు. ఈ పాత్ర కోసం బన్నీ 10 కిలోల బరువు కూడా తగ్గాడు. -
‘సన్నాఫ్ సత్యమూర్తి’పోస్టర్స్
-
సన్ ఆఫ్ సత్యమూర్తి ప్రమోషనల్ సాంగ్
-
‘సన్నాఫ్ సత్యమూర్తి’ వర్కింగ్ స్టిల్స్
-
ఆ స్పెషల్ ఏంటి?
గత ఏడాది సమ్మర్‌కి ‘రేసుగుర్రం’తో ఆకట్టుకున్న అల్లు అర్జున్, ఈ వేసవికి ‘సన్నాఫ్ సత్యమూర్తి’గా అలరించనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తనదైన శైలిలో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇండియాలోనే తొలిసారిగా ఈ సినిమా డిజిటల్ పోస్టర్‌ను త్రీడీలో విడుదల చేయడం విశేషం. ఈ సినిమాలో అల్లు అర్జున్ తనయుడు నటించాడనే వార్త ప్రచారంలో ఉంది. అయితే, చిత్ర యూనిట్ వర్గాలు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఆ వార్త నిజం కాదని తెలిపాయి. ఒక్క పాట మినహా ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఆ పాటను నేటి నుంచి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో సెట్స్ వేసి చిత్రీకరిస్తున్నారు. చిత్ర ప్రధాన తారాగణంపై చాలా స్పెషల్‌గా ఈ పాటను ప్లాన్ చేశారట. ఒక ప్రముఖ కథానాయిక ఈ పాటలో తళుక్కున మెరవనున్నట్టు సమాచారం. త్రిష, తాప్సీ, కొంతమంది హిందీ కథానాయికల్ని ఇందుకోసం ప్రయత్నించారని భోగట్టా. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 15న విడుదల చేస్తున్నారు.