తన అందచందాలతో కట్టిపడేసే బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ "మిసెస్ సీరియల్ కిల్లర్". ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సిరీస్ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. హీరోయిన్ నటన, నటుడు మనోజ్ బాజ్‌పాయి మ్యాజిక్ ఏవీ సినిమాను ముందుకు తీసుకెళ్లలేకపోయాయి. మొదటి 80 నిమిషాలు ఎందుకు చూస్తున్నామా అన్న సందేహం తలెత్తక మానదు. కానీ చివరి 26 నిమిషాలు అప్పటివరకు చూపించిన ప్రశ్నల చిక్కుముడులను విప్పే ప్రయత్నం చేస్తాయి. కానీ అప్పటికే ఆలస్యం అవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అక్షయ్ కుమార్‌కు "జోకర్" సినిమాతో డిజాస్టర్ అందించిన శిరీష్ కుందర్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించి మరోసారి ఫెయిల్ అయ్యాడు.
కథా విశ్లేషణ: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన మహిళలు దారుణంగా హింసకు గురవుతూ చనిపోతుంటారు. దీనికి డా.మృత్యుంజయ్ ముఖర్జీ(మనోజ్ బాజ్‌పాయ్) కారణమని పోలీసులు భావిస్తారు. దీంతో మర్డర్ కేస్‌లో చిక్కుకున్న భర్త మృత్యుంజయ్‌ను కాపాడటం కోసం అతని భార్య సోనా ముఖర్జీ(జాక్వెలిన్ ఫెర్నాండేజ్) బయలు దేరుతుంది. సీరియల్ కిల్లర్ తరహాలో మరో హత్య చేసి భర్తను కాపాడుకుంటుంది. ఈక్రమంలో భర్త కోసం ఏదైనా చేసే భార్య పాత్రలో జాక్వెలిన్ అద్భుతంగానే రాణించింది. అయితే ఈ సిరీస్‌లో కొన్ని సంఘటనలు అర్థం పర్థం లేనివిగా ఉన్నాయి.
ఉదాహరణకు సోనా తన భర్త ఆఫీసుకు వెళ్లి కంప్యూటర్ పాస్‌వర్డ్ కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఆ పాస్‌వర్డ్ మరేంటో కాదు.. షోనా(Shona) అని ఈజీగా తెలిసిపోతుంది. ఇందులో ప్రేక్షకుడు పెద్దగా ఆశ్యర్యపోవడానికి ఏమీ ఉండదు. యాక్షన్ సన్నివేశాలు కూడా నిదానంగా సా..గుతాయి. కామెడీ గురించి చెప్పాలంటే కొన్ని డైలాగులు, సన్నివేశాలు నవ్విస్తాయి. మరికొన్ని చోట్ల సన్నివేశాలు పెద్ద లాజిక్‌గా అనిపించవు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో అంచనాలతో ఈ సిరీస్ చూడటానికి వచ్చిన అభిమానుల ఆశలను జాక్వెలిన్, మనోజ్ బాజ్‌పాయి అడియాశలు చేశారనడం కంటే హత్య చేశారనడమే కరెక్ట్. (‘గతంలో ఎప్పుడూ చూడని విధంగా జాక్వలిన్’)
ప్రేక్షకుడి వాయిస్: ఈ సిరీస్‌ను అందించినందుకు నెట్‌ఫ్లిక్స్‌పై బూతుల వర్షం కురిపిస్తున్నారు. చెత్త కంటెంట్ ఉన్న సినిమా అని తిట్టిన తిట్టు తిట్టకుండా బూతులు అందుకుంటున్నారు. దీనికన్నా హాలీవుడ్ బీ గ్రేడ్ సినిమాలు వంద రెట్లు నయమని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. జాక్వెలిన్ డైలాగ్ డెలివరీ, చెత్త కథనం పూర్తిగా నిరాశకు గురి చేశాయని పెదవి విరుస్తున్నారు. మొత్తంగా ఇది ఒక్కసారి చూడటమే ఎక్కువని వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. సిరీస్ ప్రారంభంలో జాక్వలిన్ నోట "టార్చర్ అంటే మీకిప్పటివరకు తెలియదు.. ఇకపై చూస్తారు" అని డైలాగ్ చెబుతుంది. నిజంగానే ఈ సిరీస్ చూడటం అంటే టార్చరే అని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా చూసిన వారికి భారీ నిరాశ తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment