నాన్న తిరిగి వస్తారనుకున్నాం...
హైదరాబాద్ : 'ఇది నిజంగా మాకు షాకింగ్. నాన్న తిరిగి వస్తారనుకున్నాం. మలేరియానే కదా తగ్గిపోద్దనుకున్నాం...ఇలా మనిషిని తినేస్తుందనుకోలేదు' అని ఎంఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్ కన్నీటి పర్యంతమయ్యారు. అభిమానుల సందర్శనార్థం నాన్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్లో ఉంచుతామని, అనంతరం ఇంటికి తరలిస్తామన్నారు. అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎంఎస్ నారాయణ శుక్రవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే.
కాగా ఎంఎస్ నారాయణ ఆరోగ్యం విషమంగా ఉందంటూ గురువారమే వార్తలొచ్చాయి. అయితే ఆయన కోలుకుంటున్నారని కుటుంబసభ్యులు చెప్పడంతో... అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కానీ ఇంతలోనే చేదువార్త. గుండెపోటు కారణంగా వెంటిలేటర్ సాయంతో వైద్యం అందుకుంటున్న ఎంఎస్ తుదిశ్వాస విడిచారంటూ కొద్దిసేపటి క్రితమే కిమ్స్ వైద్యులు ధృవీకరించారు. ఈ వార్తతో సినీ అభిమానులు, హాస్య ప్రియులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
సంక్రాంతికి భీమవరం వెళ్లిన ఎంఎస్కు అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యిందనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత విషాహారం కారణంగానే ఆయన ఆస్పత్రి పాలయ్యారని కూడా చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌కి తీసుకొచ్చిన తర్వాత... ఆయనకు గుండెనొప్పి రావడంతో కిమ్స్ లో మూడు స్టంట్స్ వేసినట్టు కూడా చెప్పారు. దీంతో ఆయన అనారోగ్యానికి విషాహారం కారణం కాదని తేలింది. ఎంఎస్ నారాయణ మృతితో తెలుగు సినీ పరిశ్రమకు ఒక గొప్ప హాస్యనటుడు దూరమయ్యారు. దశాబ్దాలుగా నవ్వులు పంచిన ఎమ్మెస్ ఆ నవ్వుల్నే మిగిల్చి వెళ్లిపోయారు.