ముంబై అత్యాచారం: మండిపడిన బాలీవుడ్
ఒకప్పుడు మహిళలకు స్వర్గధామంగా నిలిచిన ముంబై నగరం.. ఇప్పుడు వారి పాలిట నరక కూపంలా మారిపోయింది. ఈ పరిస్థితి పట్ల బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా సిగ్గుపడుతున్నారు. దేశ ఆర్థిక రాజధానిలో మహిళా ఫొటోగ్రాఫర్పై జరిగిన సామూహిక అత్యాచార సంఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలోని ఓ సబర్బన్ లోకల్ రైల్లో కొంతమంది దుండగులు ఓ అమెరికన్ మమిళపై దాడి చేసి ఆమెను దోచుకున్న ఐదు రోజులకే ఈ ఘోర సంఘటన సంభవించింది. దీంతో ముంబైలో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది.
దీనిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్లోను, ఇతర వేదికలపైన స్పందించారు. అత్యంత దారుణం, ఘోరమైన సంఘటన అని ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ రాశాడు. ఇంతకంటే నీచమైనది మరొకటి ఉండదన్నాడు. తన సొంత నగరంలో సామూహిక అత్యాచారం జరిగినందుకు సిగ్గుపడుతున్నానన్నాడు.
ముంబైలో పట్టపగలే జరిగిన సామూహిక అత్యాచారం గురించి వినడానికే చాలా దారుణంగా అనిపించిందని నటి, నిర్మాత పూజాభట్ రాసింది. ఇది తాను పెరిగిన నగరం కానే కాదంటూ వాపోయింది.
చట్టం అంటే ఎవరికీ భయం లేకుండా పోయిందని, అత్యాచార కేసులు ఇటీవలి కాలంలో బాగా ఎక్కువయ్యాయని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశాడు. అత్యాచార ఘటనలకు ఎవరినీ ఉరి తీయట్లేదని, రాజకీయ నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నారు తప్ప ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవట్లేదని మండిపడ్డాడు. 'ఇదీ నా భారతం. ఇదీ నా ముంబై... మరో అత్యాచారం, మరో బాధితురాలు. ఈ మహా దేశంలో మరో రోజు గడిచిపోయింది' అని శోభా డే ఆవేదన వ్యక్తం చేసింది.
పట్టపగలు జరిగిన సామూహిక అత్యాచార ఘటనపట్ల ముంబై సిగ్గుపడుతోందని, మనమంతా సిగ్గుతో తలలు తెంచుకోవాలని మనోజ్ బాజ్పేయి స్పందించాడు. ముంబై అత్యాచార సంఘటన విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు పూజా బేడీ తెలిపింది. ఈ దరిద్రాన్ని మన వీధుల నుంచి పంపేయాలని చెప్పింది. కఠినమైన శిక్షలు పడితేనే ఇది పోతుందని వ్యాఖ్యానించింది.