ముంబై అత్యాచారం: నిందితుడి అరెస్టు
ముంబై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు. మిగిలిన నలుగురిని కూడా గుర్తించారు. ఆ నలుగురిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ తెలిపారు. స్థానిక పోలీసులతో పాటు క్రైం బ్రాంచి పోలీసులతో కూడిన 20 బృందాలను ఇందుకోసం ఏర్పాటు చేశామని, నిందితుల ఊహాచిత్రాలు కూడా విడుదల చేశామని ఆయన అన్నారు.
బాధితులు చెప్పిన వివరాలను సింగ్ వెల్లడించారు. తామిద్దరం రైల్వే ప్రాంగణంలోకి వస్తున్నామంటూ తమను అడ్డగించారని, తర్వాత ఫ్యాక్టరీ లోపల పాడుచేస్తున్నారంటూ వారికి మరో ఇద్దరు తోడయ్యారని చెప్పారు. వారిలో ఒకరు ఇద్దరిలో పురుషుడిని బెల్టుతో కట్టేసి మహిళను అక్కడకు 20 అడుగుల దూరానికి తీసుకెళ్లిపోయారు. అక్కడ ఒకరితర్వాత ఒకరిగా ఆమెపై అత్యాచారం చేశారు. తీవ్రంగా గాయాలపాలైన మహిళను జస్లోక్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘాతుకానికి పాల్పడినవారంతా కూడా 20 ఏళ్ల దరిదాపుల్లో ఉన్న యువకులే. బాధితురాలు ఆస్పత్రిలో చేరిన తర్వాత మాత్రమే పోలీసులకు ఈ విషయం తెలిసింది.