లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న ఫొటోగ్రాఫర్
ఖమ్మంక్రైం: ‘మానస నువ్వంటే చెప్పలేనంత ప్రేమ. అనారోగ్యంతో బాధపడుతున్న నీకు తోడగా ఉండాల్సింది పోయి వెళ్తున్నా.. మన కుమారుడు నమన్‌రెడ్డిని జాగ్రత్తగా చూసుకో.. నాన్నా(కుమారుడిని ఉద్దేశించి) నీ చెయ్యి పట్టుకుని ప్రపంచాన్ని చూపించాల్సి ఉన్నా చేయి విడిచిపెట్టి పోతున్నాను. నన్ను క్షమించండి. అమ్మ, అక్క, తమ్ముళ్లు, అత్తయ్య, మామయ్యలు, బాబాయిలు, పిన్నిలు మీరంతా నా కొడుకు, భార్యను జాగ్రత్త గా చూసుకోండి. నాపై కోపం ఉంటే వారిపై చూపకుండా చేరదీసి ఆదుకోండి’ అంటూ లేఖ రాసిన ఓ ఫొటోగ్రాఫర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంకు చెందిన ఎరసాని శ్రీనివాస్‌రెడ్డి(40) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ భార్య మానస, కుమారుడు నమన్‌రెడ్డితో కలిసి ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా ఆయన లోన్‌యాప్‌లు, క్రెడిట్‌కార్డుల ద్వారా తీసుకున్న అప్పులు పెరిగి తీర్చలేని పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈనేపథ్యాన కొన్నాళ్ల క్రితం ఖమ్మంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో శుక్రవారం సాయంత్రం ఇక్కడకు చేరుకుని లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఆయనకు టీ ఇవ్వడానికి వెళ్లిన సిబ్బంది ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో వారు వచ్చి తలుపులు పగులకొట్టి చూడగా శ్రీనివాస్‌రెడ్డి ఉరి వేసుకుని కనిపించాడు. ఆయన వద్ద లభించిన లేఖ, చిరునామా ఆధారంగా కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కాగా, అప్పులు పెరగడంతో తీర్చే మార్గం లేక బలవన్మరణానికి పాల్పడగా, శ్రీనివాసరెడ్డి తన భార్య, కుమారుడిని విడిచిపెట్టలేక సంఘర్షణకు గురైనట్లు లేఖ ద్వారా తెలియడంతో చదివిన వారంతా కంటతడి పెట్టారు. కాగా, ఆయన మృతదేహాన్ని అన్నం ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు, సిబ్బంది సాయంతో మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టుటౌన్ ఎస్‌ఐ రఫీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment