mumbai gangrape
-
కోర్టులో సృహతప్పిన ముంబై గ్యాంగ్ రేప్ బాధితురాలు!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ముంబై గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలు, ఫోటో జర్నలిస్ట్ కోర్టులోనే సృహ కోల్పోయింది. నిందితులను గుర్తించిన బాధితురాలు.. వాగ్మూలం ఇచ్చే సమయంలో కోర్టులో సొమ్మసిల్లి పడిపోయిందని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. ఫోటో జర్నలిస్ట్ సృహతప్పి పడిపోయిన వెంటనే వాదనలు ఆపివేసి ఆమెను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించామని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పీటీఐకి తెలిపారు. ఆగస్టు 22 తేదిన ముంబైలోని శక్తి మిల్స్ కాంపౌడ్ లో బాధితురాలిపై సామూహిక మానభంగం జరిగినట్టు కేసు నమోదైంది. గురువారం జరిగిన వాదనలకు తన తల్లితో బాధితురాలు కోర్టుకు హాజరయ్యారు. పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ కు కట్టుబడి కోర్టులో సంఘటన వివరించినట్టు తెలిపారు. లైంగికంగా దాడికి ముందు చూపించిన అశ్లీల క్లిప్పింగ్ ను కూడా బాధితురాలు గుర్తించినట్టు నికమ్ తెలిపారు. -
ముంబై అత్యాచారం: నలుగురు నిందితులకు 19 వరకు కస్టడీ
ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులను ఈనెల 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ముంబైలోని ఓ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. షిరాజ్ రెహ్మాన్ ఖాన్, విజయ్ జాదవ్, ఖాసిం బెంగాలీ, సలీమ్ అన్సారీలను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని మేజిస్ట్రేట్ యూఎం పద్వాడ్ ఆదేశించారు. వాళ్లతో ఐడెంటిఫికేషన్ పెరేడ్ నిర్వహించాలని క్రైం బ్రాంచి కోరడంతో కస్టడీకి పంపారు. అంతకుముందు విధించిన పోలీసు కస్టడీ గురువారంతో ముగిసింది. ఈ కేసులో మరో మైనర్ నిందితుడిని ఆగస్టు 30న జువెనైల్ కోర్టులో ప్రవేశపెట్టగా అక్కడినుంచి డోంగ్రిలోని జువెనైల్ రిమాండ్ హోంకు పంపారు. అతడిపై నేరం రుజువైతే గరిష్ఠంగా మూడు సంవత్సరాల శిక్ష మాత్రమే పడుతుంది. అదే ఇతర నిందితులకైతే కనీసం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు పడే అవకాశం ఉంది. నిందితులలో ఒకరి సోదరుడు అతడు చదివిన స్కూలు నుంచి టీసీ తీసుకొచ్చి, అతడు 1997 ఫిబ్రవరిలో పుట్టినట్లు నిరూపించడంతో ఆ నిందితుడిని మైనర్‌గా నిర్ధరించారు. -
ముంబై అత్యాచారం: విచారణకు మీడియా కవరేజి వద్దన్నపోలీసులు
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పట్టపగలే ఓ ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును కోర్టులో విచారించే సమయంలో ఆ విచారణ వివరాలను మీడియా కవర్ చేయకుండా చూడాలంటూ కోర్టును ముంబై పోలీసులు కోరారు. ఈ విషయం బాగా సున్నితమైనది కాబట్టి, విచారణ సమయంలో జరిగే వివరాలు మీడియాలో ప్రచారం అయితే ఇబ్బందికరంగా ఉంటుందని, అందువల్ల ఈ విచారణ ప్రక్రియ మీడియాలో కవర్ కాకుండా చూడాలని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే, అలాంటి ఉత్తర్వులేవీ తాను ఇవ్వలేనంటూ అదనపు మేజిస్ట్రేట్ యు. పడ్వాడ్ స్పష్టం చేశారు. కానీ, కోర్టు ఇంత స్పష్టంగా ఈ విషయంలో తన నిర్ణయం వెల్లడించినా, పోలీసులు మాత్రం కోర్టు హాల్లోకి ప్రవేశించకుండా విలేకరులను అడ్డుకున్నారు. ప్రాథమికంగా, కోర్టు ఉత్తర్వులు ఉండటం వల్లే లోనికి రానివ్వడం లేదని పోలీసులు విలేకరులకు చెప్పారు. కానీ తర్వాత అసలు విషయం చెబుతూ, ముంబై క్రైం బ్రాంచి పోలీసులు కోరడం వల్లనే అడ్డుకున్నట్లు తెలిపారు. పోలీసుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన తర్వాత విలేకరులను కోర్టు హాల్లోకి అనుమతించారు. -
ముంబై రేప్ నిందితుల్లో పోలీస్ ఇన్ఫార్మర్!
సాక్షి, ముంబై: నగరంలో ఇటీవల ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పట్టుబడ్డ ఐదుగురు నిందితుల్లో ఒకరు పోలీసులకు ఇన్ఫార్మర్గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ కాసిం షేక్ అలియాస్ కాసిం బెంగాలీ పోలీసులకు ఇన్ఫార్మర్గా ఉన్నాడని దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. గత నెల రోజుల్లో స్థానిక అగ్రిపాడ పోలీసుస్టేషన్‌లోని ఓ కానిస్టేబుల్‌కు కాసిం ఏకంగా 60 ఫోన్‌కాల్స్ చేసినట్లు తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. అత్యాచారం జరిగిన మర్నాడు కూడా ఆ కానిస్టేబుల్‌తో అతను ఫోన్లో మాట్లాడినట్లు తెలియవచ్చింది. కాగా, ఫొటో జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్పి తన కొడుకు బోరున విలపించాడని ఖాసిం తల్లి చాంద్బీబీ పేర్కొంది. అలా ఎందుకు చేశావని నిలదీస్తే తల దించుకున్నాడని చెప్పింది. రేప్ జరిగిన శక్తి మిల్స్ స్థలాన్ని గుజరాత్, ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. -
ముంబై గ్యాంగ్ రేప్ ఘటన హత్య లాంటిదే: కాజోల్
గత వారం ముంబైలో ఫోటో జర్నలిస్ట్ గ్యాంగ్ రేప్ పై బాలీవుడ్ నటి కాజోల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మానభంగాలకు, మహిళలపై దారుణాలకు పాల్పడే వారిపై కఠిన శిక్ష విధించే విధంగా చట్టాలను రూపొందించాలని కాజోల్ డిమాండ్ చేసింది. 'గ్యాంగ్ రేప్ ఘటన చాలా దారుణం. ఇలాంటి ఘటనపై మాట్లాడటానికి మాటలు రావడం లేదు. దాదాపు ఈ ఘటన హత్యతో సమానం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పౌరులంతా చర్యలు తీసుకోవాలి' అని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలను రూపొందించాలని ఆమె డిమాండ్ చేశారు. నిందితులు ఇలాంటి దారుణాలకు ప్రయత్నించడానికే భయపడేంతగా చట్టాలు తీసుకురావాలన్నారు. గురువారం సెంట్రల్ ముంబైలోని పారేల్ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఫోటో జర్నలిస్ట్ పై ఐదుగురు దుండగులు సామూహిక మానభంగం జరిపిన సంగతి తెలిసిందే. -
ముంబై గ్యాంగ్ రేప్ ఘటనపై షిండే ప్రకటన
న్యూఢిల్లీ : ముంబయిలో ఫోటో జర్నలిస్ట్‌పై అత్యాచార ఘటనకు సంబంధించి కేంద్ర హోమంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. ఈ సంఘటనకు సంబంధించి అయిదుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. 20 బృందాలతో గాలించి నిందితుల్ని ముంబయి పోలీసులు పట్టుకున్నారని షిండే తెలిపారు. అయిదుగురి నిందితుల్లో ఇద్దరు తప్పు ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. వీలైనంత త్వరలో నిందితులకి శిక్ష పడేలా చూస్తామని షిండే హామీ ఇచ్చారు. అంతకు ముందు ఈ సంఘటనపై బీజేపీ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ నిప్పులు చెరిగారు. -
ముంబై గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు మైనర్?
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నడిబొడ్డున ఓ మీడియా ప్రతినిధిపై జరిగిన సామూహిక హత్యాచారం కేసులో నిందితులుగా పేర్కొన్న ఐదుగురిలో ప్రధాన నిందితుడు మైనర్ అనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ విషయాన్ని నిందితుడి కుటుంబసభ్యులు మీడియా ముందు వెల్లడించారు. నిందితుడు `చాంద్ బాబు సత్తార్ షేక్ అలియాస్ మహ్మద్ అబ్దుల్` అమ్మమ్మ సర్నాబాయ్ అతడిని మైనర్ గా పేర్కొంటూ జనన ధృవీకరణ పత్రాన్ని మీడియాకు సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే జనన ధృవీకరణ పత్రంలో అతని వయసు 1997 ఫిబ్రవరి 26గా నమోదైంది. కానీ పోలీసులు మాత్రం చాంద్ వయసు 19 ఏళ్లుగా చెబుతున్నారు. కేవలం నిందితుడిని రక్షించడానికి కుటుంబసభ్యులు తప్పుడు ధృవపత్రం సమర్పించారని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఆమె తమ మనవుడు మంచివాడని, అతనికి 16ఏళ్లే ఉంటాయని చెబుతోంది. దీనికి సంబంధించి తాను ఈ ధృవీకరణ పత్రాన్ని కోర్టులోచూపిస్తానంటోంది. జనన ధృవీకరణ పత్రాన్ని దిద్దారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ముంబైలో ఓ ఇంగ్లిష్ మేగజైన్‌కు ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిపై మహాలక్ష్మి, లోయర్పరెల్ రైల్వేస్టేషన్ల మధ్యలో ఉన్న శక్తిమిల్లు కాంపౌండ్‌లో ఐదుగురు యువకులు గురువారం సాయంత్రం సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు చాంద్ మేజర్ అత్యాచారం చేసినట్టు రుజువైతే ఏడేళ్ళ నుంచి యావజ్జీవ శిక్ష వరకు పడవచ్చు. -
ముంబై అత్యాచారం: నిందితుడి అరెస్టు
ముంబై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు. మిగిలిన నలుగురిని కూడా గుర్తించారు. ఆ నలుగురిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ తెలిపారు. స్థానిక పోలీసులతో పాటు క్రైం బ్రాంచి పోలీసులతో కూడిన 20 బృందాలను ఇందుకోసం ఏర్పాటు చేశామని, నిందితుల ఊహాచిత్రాలు కూడా విడుదల చేశామని ఆయన అన్నారు. బాధితులు చెప్పిన వివరాలను సింగ్ వెల్లడించారు. తామిద్దరం రైల్వే ప్రాంగణంలోకి వస్తున్నామంటూ తమను అడ్డగించారని, తర్వాత ఫ్యాక్టరీ లోపల పాడుచేస్తున్నారంటూ వారికి మరో ఇద్దరు తోడయ్యారని చెప్పారు. వారిలో ఒకరు ఇద్దరిలో పురుషుడిని బెల్టుతో కట్టేసి మహిళను అక్కడకు 20 అడుగుల దూరానికి తీసుకెళ్లిపోయారు. అక్కడ ఒకరితర్వాత ఒకరిగా ఆమెపై అత్యాచారం చేశారు. తీవ్రంగా గాయాలపాలైన మహిళను జస్లోక్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘాతుకానికి పాల్పడినవారంతా కూడా 20 ఏళ్ల దరిదాపుల్లో ఉన్న యువకులే. బాధితురాలు ఆస్పత్రిలో చేరిన తర్వాత మాత్రమే పోలీసులకు ఈ విషయం తెలిసింది. -
ముంబై అత్యాచారం: మండిపడిన బాలీవుడ్
ఒకప్పుడు మహిళలకు స్వర్గధామంగా నిలిచిన ముంబై నగరం.. ఇప్పుడు వారి పాలిట నరక కూపంలా మారిపోయింది. ఈ పరిస్థితి పట్ల బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా సిగ్గుపడుతున్నారు. దేశ ఆర్థిక రాజధానిలో మహిళా ఫొటోగ్రాఫర్‌పై జరిగిన సామూహిక అత్యాచార సంఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలోని ఓ సబర్బన్ లోకల్ రైల్లో కొంతమంది దుండగులు ఓ అమెరికన్ మమిళపై దాడి చేసి ఆమెను దోచుకున్న ఐదు రోజులకే ఈ ఘోర సంఘటన సంభవించింది. దీంతో ముంబైలో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్లోను, ఇతర వేదికలపైన స్పందించారు. అత్యంత దారుణం, ఘోరమైన సంఘటన అని ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ రాశాడు. ఇంతకంటే నీచమైనది మరొకటి ఉండదన్నాడు. తన సొంత నగరంలో సామూహిక అత్యాచారం జరిగినందుకు సిగ్గుపడుతున్నానన్నాడు. ముంబైలో పట్టపగలే జరిగిన సామూహిక అత్యాచారం గురించి వినడానికే చాలా దారుణంగా అనిపించిందని నటి, నిర్మాత పూజాభట్ రాసింది. ఇది తాను పెరిగిన నగరం కానే కాదంటూ వాపోయింది. చట్టం అంటే ఎవరికీ భయం లేకుండా పోయిందని, అత్యాచార కేసులు ఇటీవలి కాలంలో బాగా ఎక్కువయ్యాయని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశాడు. అత్యాచార ఘటనలకు ఎవరినీ ఉరి తీయట్లేదని, రాజకీయ నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నారు తప్ప ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవట్లేదని మండిపడ్డాడు. 'ఇదీ నా భారతం. ఇదీ నా ముంబై... మరో అత్యాచారం, మరో బాధితురాలు. ఈ మహా దేశంలో మరో రోజు గడిచిపోయింది' అని శోభా డే ఆవేదన వ్యక్తం చేసింది. పట్టపగలు జరిగిన సామూహిక అత్యాచార ఘటనపట్ల ముంబై సిగ్గుపడుతోందని, మనమంతా సిగ్గుతో తలలు తెంచుకోవాలని మనోజ్ బాజ్‌పేయి స్పందించాడు. ముంబై అత్యాచార సంఘటన విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు పూజా బేడీ తెలిపింది. ఈ దరిద్రాన్ని మన వీధుల నుంచి పంపేయాలని చెప్పింది. కఠినమైన శిక్షలు పడితేనే ఇది పోతుందని వ్యాఖ్యానించింది. -
ముంబై గ్యాంగ్‌రేప్: ఏపీ ఫొటో జర్నలిస్టుల నిరసన
విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్టుపై ముంబైలోని శక్తి మిల్స్ ఆవరణలో సామూహిక అత్యచారం జరగడాన్ని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనకు నిరసనగా హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. విధినిర్వహణలో ఉన్న పాత్రికేయులకు.. అందునా ముఖ్యంగా మహిళా పాత్రికేయులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలదేనని ఏపీపీజేఏ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఫొటో జర్నలిస్టులతో పాటు పలువురు పాత్రికేయులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, మరోవైపు ముంబైలో ఫొటో జర్నలిస్టుల సంఘాలు మౌన నిరసన తెలిపాయి. మహారాష్ట్ర వ్యాప్తంగాను, ముంబై మహానగరంలోను శాంతిభద్రతల పరిస్థితి నానాటికీ క్షీణిస్తోందని ఈ సంఘాలు మండిపడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్‌లను కలిసి పాత్రికేయులకు రక్షణ కల్పించాలని వినతిపత్రం సమర్పించాయి. -
ముంబై అత్యాచారాన్ని ముక్తకంఠంతో ఖండించిన పార్టీలు
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముంబైలో పాత్రికేయురాలిపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ముక్త కంఠంతో ఖండించారు. ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ చెప్పగా, దీన్ని ఏమాత్రం సహించలేని సంఘటనగా బీజేపీ అభివర్ణించింది. ''ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. దుండగుల చేతుల్లో మన మహిళలు, పిల్లలు అభద్రతతో కొట్టుమిట్టాడటాన్ని మన దేశం ఏమాత్రం సహించలేదు'' అని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ పార్లమెంటు వెలుపల చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని, దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. ఢిల్లీలో డిసెంబర్ 23న సామూహిక అత్యాచారం జరిగినప్పుడు నిర్భయ చట్టాన్ని ప్రవేశపెట్టారని, కనీసం ఇప్పటికైనా దాన్ని అమలుచేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. కాగా, ఈ సంఘటనపై మహారాష్ట్ర సర్కారు సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. అత్యాచార ఘటన ఏమాత్రం భరించలేనిదని, ఫొటో జర్నలిస్టు విధి నిర్వహణ కోసం వెళ్లినా ఆమెకు భద్రత లేకపోతే ఇంక అసలు ఎవరికి భద్రత కల్పిస్తున్నారని, అసలు ప్రజాభద్రత అంశంపై ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో సమాధానం చెప్పి తీరాలని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలని బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ కూడా ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన చట్టం అత్యాచారం నిర్వచనాన్ని మార్చిందని, అయినా ఇప్పటికీ మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.