పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముంబైలో పాత్రికేయురాలిపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ముక్త కంఠంతో ఖండించారు. ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ చెప్పగా, దీన్ని ఏమాత్రం సహించలేని సంఘటనగా బీజేపీ అభివర్ణించింది. ''ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. దుండగుల చేతుల్లో మన మహిళలు, పిల్లలు అభద్రతతో కొట్టుమిట్టాడటాన్ని మన దేశం ఏమాత్రం సహించలేదు'' అని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ పార్లమెంటు వెలుపల చెప్పారు.
ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని, దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనని లోక్సభ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. ఢిల్లీలో డిసెంబర్ 23న సామూహిక అత్యాచారం జరిగినప్పుడు నిర్భయ చట్టాన్ని ప్రవేశపెట్టారని, కనీసం ఇప్పటికైనా దాన్ని అమలుచేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు.
కాగా, ఈ సంఘటనపై మహారాష్ట్ర సర్కారు సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. అత్యాచార ఘటన ఏమాత్రం భరించలేనిదని, ఫొటో జర్నలిస్టు విధి నిర్వహణ కోసం వెళ్లినా ఆమెకు భద్రత లేకపోతే ఇంక అసలు ఎవరికి భద్రత కల్పిస్తున్నారని, అసలు ప్రజాభద్రత అంశంపై ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో సమాధానం చెప్పి తీరాలని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలని బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ కూడా ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన చట్టం అత్యాచారం నిర్వచనాన్ని మార్చిందని, అయినా ఇప్పటికీ మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.