పెళ్లి ఫొటోలంటే ఇప్పుడు పెళ్లి తర్వాతి ఫొటోలే. ఏడడుగులు వేసిన దంపతులు సినిమాటిక్‌గా ఉండటం కోసం మరో నాలుగడుగులు ముందుకు వేసి వైరల్ అయ్యేలా ఫొటోలు తీయించుకుంటున్నారు.కొచ్చి నుంచి గంట దూరంలో ఉంది చేర్తాళ గ్రామం. ప్రతాపన్, ఇందుల వివాహం అక్కడ ఘనంగా జరిగింది. ఫొటోగ్రాఫర్లు షైన్ సిద్ధార్థ్ తన ఆరుగురు బృందంతో కొత్త ఎక్విప్‌మెంట్‌తో చిన్న కొలను దగ్గరకు చేరారు. కొత్త దంపతులు ఊరులి (పడవ లాంటి బుట్ట) లో ఎదురెదురుగా పడుకున్నారు. వారి మీద ఒక చిన్న గొట్టం ద్వారా నీళ్లను వర్షంలా కురిపిస్తున్నారు. దంపతులు చక్కగా పోజ్ ఇస్తున్నారు. ఈ ఫొటోల షూటింగ్ నాలుగు గంటల్లో పూర్తి చేశారు షైన్.
ఈ దంపతులు ఊహించిన దానికంటే వారి ఫొటోలకు ఎక్కువ ప్రచారమే వచ్చింది. ‘‘మా పెళ్లి ఆల్బమ్‌కి మంచి సెట్టింగ్స్ కావాలని మేం అడగలేదు. మా స్నేహితులే పూనుకుని చేశారు ఇదంతా’’ అంటారు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ప్రొఫెషనల్ ప్రతాపన్ బిచ్చు. ఫొటోలు తీసిన ప్రతాపన్ స్నేహితులు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి బాగా వైరల్ అయ్యాయి. ‘మా బంధువుల దగ్గర నుంచి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. కొందరు కొత్తవారు, ఈ ఫొటోలు ఎలా తీశారు అని అడుగుతున్నారు’ అని చెప్పారు బిచ్చు.
నలుగురూ మెచ్చుకోవాలని
కొంతకాలంగా కేరళలో వివాహ వేడుకల ఫొటోలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంప్రదాయబద్ధంగా జరిగే పెళ్లి తంతులన్నిటినీ ఇప్పుడు సృజనాత్మకంగా షూట్ చేస్తున్నారు. ఇప్పుడు అది మరింత ముందుకు సాగి, సుదూర తీరాలకు వెళ్లి ఫొటోలు తీయించుకునే దశకు. అందరి లక్ష్యం ఒక్కటే, వారి ఫొటోలు వైరల్ కావాలి. అందుకోసం కేరళలోని బ్యాక్ వాటర్స్, బీచ్‌లు, హౌస్ బోట్లు... ఇలా అన్నిటినీ ఉపయోగించుకుంటున్నారు. బిచ్చు, ఇందులకు తీసిన ఫొటోల వెనుక ఫొటోగ్రాఫర్ షైన్ కష్టం చాలా ఉంది. అతని ఇంటి వెనకాలే చిన్న సరస్సు ఉంది. అక్కడ కృత్రిమంగా కురిపిస్తున్న వానలో వధూవరుల హావభావాలను జాగ్రత్తగా పట్టి కెమెరాలో బిగించాలి. ఇలా తీయడం సినిమా తీయడానికి ఏ మాత్రం తక్కువ కాదు.
ఔట్‌డోర్‌లో వధూవరులు
‘మేడ్ ఇన్ మోనో’ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు వసీమ్ అహ్మద్. ఈయన పెళ్లి ఫొటోలు, పెళ్లికి ముందు ఫొటోలు తీయడంలో అనుభవజ్ఞులు. చెన్నైకి చెందిన వసీమ్ తరచుగా కేరళ వెళ్తుంటారు. ‘‘మలయాళీ వివాహాలు మాకు చాలెంజింగ్. సాధారణంగా ఉంటూనే వారు స్పెషల్‌గా కనిపిస్తుంటారు’’ అంటారు అహ్మద్. ‘‘మలయాళీల పెళ్లిళ్లలో ఫొటోలు తీయడానికి సమయం ఎక్కువగా ఉండదు. ఒక్కసారి మిస్ అయ్యామంటే మళ్లీ ఆ సీన్ రాదు. అందువల్ల కేరళలో అవుట్‌డోర్ ఫొటో షూటింగ్ బాగా పాపులర్ అవుతోంది’’ అంటారు వసీమ్ అహ్మద్. దక్షిణాదిలో చాలామంది సినిమాలకు ప్రభావితులవుతున్నారు. సినిమాలలో చూపుతున్న పెళ్లి విధానాన్ని అనుసరిస్తున్నారు. వారి అభిరుచికి తగ్గట్లు షైన్, అహ్మద్ వంటి ఫొటోగ్రాఫర్‌లు ఎంతో శ్రద్ధ, సమయం తీసుకుని షూట్ చేస్తున్నారు.
బీచ్‌లు.. సరస్సులు.. చెట్లు..
కువైట్‌లో ఉంటున్న అశ్వతి ఎస్ కుమార్ అనే ఇంజనీర్ నాయర్‌ల విధానంలో వివాహం చేసుకున్నారు. సాధారణ ఫొటోలతో పాటు సాహసాలు చేస్తూ ఫొటోలు తీయించుకోవాలనుకుని, వివాహమయ్యాక అళప్పుఝాలోని కట్టాడి బీచ్‌లో పచ్చటి చెట్ల దగ్గర విలక్షణంగా ఫొటోలు తీయించుకున్నారు. ఫొటోలకు మాత్రం పెళ్లిరోజు వేసుకున్న వస్త్రాలనే ధరించారు. కొట్టాయంలో ఉంటున్న పెళ్లిఫొటోల ఎక్స్‌పర్ట్ వర్ఘీస్‌ను సంప్రదించి ఫొటోలు తీయించుకుంటున్నారు. వెంబనాడ్ సరస్సులో హౌస్‌బోట్‌లో అంచున నిలబడి పోజులిస్తున్నారు. వీరికి ఫొటోలు తీయడానికి మరో బోటు అద్దెకు తీసుకోవలసి వచ్చింది. అయితే ‘‘ఎనిమిది గంటల కష్టానికి మంచి ఫలితమే వచ్చింది’’ అంటారు వాళ్ల ఫొటోలు తీసిన సంజీవ్ అనే మరో ఫొటోగ్రాఫర్.
పర్మిషన్ తప్పనిసరి
ఫొటోలకు డ్రోను ఉపయోగిస్తున్నారు. ఒక రోజులోనే ఫొటో షూట్ పూర్తి చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తికావడానికి నెల రోజులు çపడుతోంది. ఒక్కోసారి ఫొటోగ్రాఫర్‌లు ఫీట్లు చేస్తున్నారు. త్రిసూర్‌కు చెందిన 23 సంవత్సరాల విష్ణు అనే ఫొటోగ్రాఫర్ చెట్టుకి తల్లకిందులుగా వేలాడి టాప్ యాంగిల్‌లో షూట్ చేయడం వైరల్ అయింది.
కేరళలో పైన పేర్కొన్న ప్రదేశాలలో ఫొటోలు తీయించుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
– జయంతి
Comments
Please login to add a commentAdd a comment