సాక్షి, హైదరాబాద్: ఫేస్‌బుక్ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసి చివరకు హత్యచేయించింది. మీర్‌పేటలో ఫోటోగ్రాఫర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితురాలైన ఓ మహిళతో పాటు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.
మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డి ప్రకారం... నగరంలోని భాగ్ అంబర్‌పేటకు చెందిన మల్కాపురం యష్మాకుమార్ (32) వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. ఈయనకు 2018లో మీర్‌పేట నందిహిల్స్‌కు చెందిన వివాహిత బుచ్చమ్మగారి శ్వేతారెడ్డి (32)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఫోన్ సంభాషణలు కొనసాగడంతో సన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది.
కాగా యష్మాకుమార్ శ్వేతారెడ్డికి ఫోన్ చేసి న్యూడ్ కాల్స్ చేయమన్నాడు. వాటిని రికార్డ్ చేసుకున్న యష్మాకుమార్ నెల రోజుల నుంచి తనను పెళ్లి చేసుకోవాలని శ్వేతారెడ్డిపై ఒత్తిడి పెంచాడు. లేదంటే న్యూడ్ ఫొటోలు, వీడియో కాల్స్‌ను బంధువులకు పంపుతానని బెదిరించసాగాడు. ఆందోళనకు గురైన శ్వేతారెడ్డి యష్మాకుమార్‌ను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఇందుకు కృష్ణాజిల్లా తిరువూరు మండలం ఎరుకోపాడు గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కొంగల అశోక్ (28), ఎలక్ట్రీషియన్ కొత్తపల్లి కార్తీక్(30) సాయం కోరింది. పథకం ప్రకారం శ్వేతారెడ్డి ఈ నెల 3న యష్మాకుమార్‌కు ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరింది.
దీంతో అతను అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ప్రశాంతిహిల్స్ వద్దకు చేరుకోగానే అప్పటికే అక్కడ మాటువేసిన అశోక్, కార్తీక్ సుత్తితో యష్మాకుమార్ తలపై బలంగా దాడి చేశారు. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. హత్య చేసిన తరువాత యష్మాకుమార్‌వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకుని రావాలని శ్వేతారెడ్డి తెలుపగా సెల్‌ఫోన్ కనిపంచకపోవడంతో అక్కడి నుంచి వారు పారిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యష్మాకుమార్ ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి హత్య కేసులో ప్రధాన నిందితురాలైన శ్వేతారెడ్డి ఆమెకు సహకరించి హత్య చేసిన అశోక్, కార్తీక్‌లను బుధవారం రిమాండ్‌కు తరలించారు.
చదవండి: ప్రేమించి పెళ్లి.. సంతానం కలగకపోవడంతో.. సోదరుల సమాధుల వద్ద
Comments
Please login to add a commentAdd a comment