సంగీతం... సముద్రం లాంటిది! ఆకాశం లాంటిది!! భూమి లాంటిది!!!
ఇళయరాజా
నేను విన్న తొలి పాట... నా మనసుపై ప్రగాఢమైన ముద్ర వేసిన పాట అంటే మా అమ్మ పాడిన లాలి పాట. ‘ఆరారో ఆరిరారో...’ అంటూ అమ్మ పాడుతూ ఉంటే ఓ కొత్త ప్రపంచంలో తేలియాడుతున్న అనుభూతి. మా పెద్దన్నయ్య పావలర్ వరదరాజన్ జానపద గీతాలు అద్భుతంగా పాడేవాడు. అవే నాలో సంగీతం పట్ల మమకారాన్ని పెంచాయి.
మద్రాసు వెళ్లిన కొత్తల్లో... రోజూ ఉదయం ఏడు గంటలు కొట్టేసరికి మద్రాసులో మైలాపూర్ లజ్ కార్నర్ దగ్గర ఓ కారు కోసం ఎదురు చూసేవాణ్ణి. ఎమ్‌ఎస్‌వి 5052 నంబర్ కల నల్ల అంబాసిడర్ కారు అది. అందులో ఓ పెద్దాయన కూర్చుండేవారు. ఆయనను చూడగానే నాలో ఏదో పారవశ్యం. ఆయనెవరో కాదు... టాప్ మ్యూజిక్ డెరైక్టర్ ఎమ్మెస్ విశ్వనాథన్. నేను తొలిసారిగా స్వరకల్పన చేసింది సినిమా పాట కాదు. ఓ కవిత. జవహర్‌లాల్ నెహ్రూ చనిపోవడంతో మద్రాసు మెరీనా బీచ్‌లో సంస్మరణ సభ పెట్టారు.
నెహ్రూపై ప్రముఖ గాయకుడు శీర్గాళి గోవింద రాజన్ ఓ కవిత రాసి వినిపించారు. ఆ కవిత నాకు బాగా నచ్చేసింది. రాత్రంతా మేలుకుని, ఆ కవితకు ట్యూన్ కట్టా. అదే నా ఫస్ట్ కంపోజిషన్. నాకు అరగంట టైమిస్తే ఓ సినిమాకు సంగీతం సమకూర్చేయగలను. వాస్తవానికి కంపోజింగ్‌కు 45 నిమిషాలు పడుతుంది. ఆర్కెస్ట్రేషన్‌కు ఇంకో 45 నిమిషాలు. మిగతా సమయం అంతా రిహార్సల్స్‌కు, రికార్డింగ్‌కు సరిపోతుంది. ఒకే సిట్టింగ్‌లో ఆరు పాటలు సునాయాసంగా కంపోజ్ చేయగలను. ఒక్క రోజులో 20 నుంచి 25 పాటల వరకూ కంపోజ్ చేయడం నాకు పెద్ద విషయమేమీ కాదు.
ఏ సంగీతమైనా ప్రేక్షకుణ్ణి మరో ప్రపంచానికి తీసుకువెళ్లాలి. శ్రోత మనసంతా ఆ సంగీత మధురిమలతో నిండిపోవాలి. ‘ఈ సంగీతానికి, నాకూ ఏదైనా సంబంధం ఉందా? ఇది నా మనసుకు ఎందుకంతగా దగ్గరవుతోంది?’ అని శ్రోత అనుకోవాలి. ఒకరి భావాన్ని ఎదుటి వ్యక్తి దగ్గర వ్యక్తీకరించడానికి చాలా మార్గాలున్నాయి. అందులో సంగీతం ఒకటి. మాటల్లో చెప్పలేని భావాన్ని సంగీతం ద్వారా ఆవిష్కరించొచ్చు. అందుకే సంగీతానికి ట్రెండ్ లేదని చెబుతాను.
నాకు ప్రత్యేకంగా అభిమాన సంగీత దర్శకులు ఒక్కరని లేరు. అందరినీ అభిమానిస్తాను. ఖేమ్‌చంద్ ప్రకాశ్, నౌషాద్... ఇలా అందరి సంగీతాల్నీ ఇష్టపడతాను. వాళ్లు ప్రయాణించిన బాటలోనే నేనూ ప్రయాణిస్తున్నాను. భాషతో సంబంధం లేకుండా చెవులకింపైన సంగీతాన్నిచ్చే ఏ సంగీత దర్శకుడైనా నాకు ఇష్టమే.
కె. రాఘవేంద్రరావు వల్లనో, మణిరత్నం వల్లనో, భారతీరాజా వల్లనో... నేను మంచి పాటలు ఇస్తానంటే ఎలా నమ్ముతాను? సినిమాతో నాకున్న కనెక్షన్ దర్శకుడు కాదు. ఆ సన్నివేశం గానీ, క్యారెక్టర్ గానీ కనెక్ట్ అవ్వాలి. కథలోని ఎమోషన్స్ ప్రధానం. నాకు సప్త స్వరాలే ప్రాణం.
‘నాకు సంగీతం తెలియదు. సంగీతానికి నిర్వచనం చెప్పమంటే... ఓ పెద్ద సెమినార్ పెట్టి చెప్పినా సరిపోదు. అయినా సంగీతం కానిదేంటి చెప్పండి. మనం పలికే మాటలోనూ నాకు మ్యూజిక్ వినిపిస్తుంటుంది. ప్రతి మాటకూ, శబ్దానికీ ఒక లయ ఉంటుంది. వాటికీ సప్త స్వరాలుంటాయి. ఒక నిర్దిష్టమైన కాలప్రమాణం కనిపిస్తుంది. పక్షి స్వేచ్ఛగా విహరిస్తుంది. దాన్ని ఫొటోగా తీసుకుని కంప్యూటర్‌లో ఉంచి... కొన్ని డాట్స్ పెట్టి పక్షి రెక్కలు విప్పినట్టు, వాటిని ఊపుతూ ఎగిరినట్లు చేయచ్చు. సంగీతం మాత్రం కంప్యూటర్ పక్షి లాంటిది కాదు.
సంగీతం అనేది ఒక సముద్రం లాంటిది. ఒక ఆకాశం లాంటిది. ఒక భూమి లాంటిది. ఎంతో విస్తారమైనది సంగీత ప్రపంచం. సముద్రపుటొడ్డున కూర్చుని అక్కడ కనిపించే ఆల్చిప్పల్ని ఏరుకుని వాటిని మాలగా కూర్చి, దానికి మెరుగుపెట్టి అమ్మే పని చేస్తున్నాను నేను. అయితే సంగీత సాగరంలో ఎక్కడెక్కడ ముత్యాలు దొరకుతాయో, సంగీతాకాశంలో వీణ శ్రుతులెక్కడ ఆడుకుంటాయో, ఈ సంగీతం భూమిపై ఎక్కడెక్కడికి వ్యాపించి కళ్లకు కనిపించే దృశ్యాల రూపంలో ప్రభవిస్తుందో నాకు తెలుసు. కానీ దీని గురించి ప్రజలకు వివరించే సందర్భాన్ని భగవంతుడు నాకు ప్రసాదించలేదు.