ఎంఎస్ విశ్వనాథన్ అస్తమయం
అనారోగ్యంతో ఆసుపత్రిలో తుదిశ్వాస
1,200 చిత్రాలతో సుదీర్ఘ ప్రస్థానం
చెన్నై, సాక్షి ప్రతినిధి: దక్షిణ భారత సినీసంగీత గురుకుల గురువు.. ద్రవిడభాషా చలనచిత్ర స్వర సామ్రాజ్యాన్ని నాలుగు దశాబ్దాల పాటు ఏలిన సంగీత దర్శక చక్రవర్తి ఎంఎస్ విశ్వనాథన్(87) అస్తమించారు. హార్మొనీ కాలం నుంచి అత్యాధునిక ఆర్కెస్ట్రా దాకా అన్ని పరికరాలతో 1,200కు పైగా చిత్రాలలో అలవోకగా స్వరాలను పలికించిన ఎంఎస్ హృద్రోగ సమస్యతో మంగళవారమిక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తెల్లవారుజామున 4.15 నిమిషాలకు కన్నుమూశారు. ఆయన సతీమణి జానకి 2012లో మరణించారు. ఆయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఎంఎస్ మరణవార్త వినగానే తమిళ సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తండోపతండాలుగా ఇంటికి తరలివచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. చెన్నై బీసెంట్ నగర్ శ్మశానవాటికలో బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుమారుడు గోపి తెలిపారు. తమిళనాడు గవర్నర్ కే రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత ఎంఎస్ మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం తెలిపారు.
వెండితెరపై చెరగని ముద్ర.. తమిళనాడులో ఒక సంగీత దర్శకుడిని అమితంగా ఆరాధించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత తొలుతగా ఎమ్‌ఎస్ విశ్వనాథన్‌కే దక్కింది. 1951 నుండి 1981 వరకు తన సినీ సంగీత ప్రవాహంలో తమిళులను ఓలలాడించిన ఆయన, 1928 జూన్ 24న కేరళలోని పాల్‌ఘాట్ సమీపంలోని ఎలపుల్లిలో జన్మించారు. 13 ఏళ్లకే వేదికపై కచ్చేరీలు నిర్వహించారు. టీకే రామమూర్తితో కలిసి విశ్వనాథన్-రామమూర్తి పేరుతో 700 చిత్రాలకు సంగీతం అందించారు. ఎంజీ రామచంద్రన్ నటించిన జెనోవా చిత్రం ఎంఎస్ వేరుగా సంగీతం అందించిన తొలిచిత్రం. తమిళంతోపాటూ తెలుగు, కన్నడ, హిందీ కలుపుకుని మరో 500 చిత్రాలకు సంగీతం అందించారు.
తెలుగువారికీ అభిమాన పాత్రుడు
ఎంఎస్ సంగీతఝరి తెలుగువారినీ అలరించింది. అక్కినేని నటించిన దేవదాసు చిత్రంలోని జగమేమాయ పాటకు స్వరకల్పన చేసింది ఆయనే.‘మరోచరిత్ర’, ‘అంతులేని కథ’ వంటి అనేక చిత్రాలు ఆయన స్వరప్రవాహం నుండి జాలువారినవే.
చంద్రబాబు, జగన్ సంతాపం..
ఎంఎస్ విశ్వనాథన్ మృతికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. వెయ్యి సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించిన ఆయన దేశం గర్వించదగ్గ కళాకారుడని పేర్కొన్నారు. ఎం.ఎస్ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతితో అత్యున్నత విలువలు గల ఒక సంగీత శకం ముగిసిందని వ్యాఖ్యానించారు.