స్వరాలకు నేనే దాసోహమయ్యాను
మనిషిని కదిలించి, కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం... ఆవేశం... వినోదం... విషాదం... సమయం, సందర్భం ఏదైనా, దానికి గళమిచ్చేది సంగీతం. బలమిచ్చేది సంగీతం. అందుకే, పాట లేని ప్రపంచాన్ని ఊహించలేం. ఏడు రథాల తేరుపై పయనంలో మనిషి ఎలుగెత్తిన గొంతుకను శాశ్వతం చేసే సంగీతానికి ఇవాళ పండుగ రోజు. ఈ ‘ప్రపంచ సంగీత దినోత్సవం’ సందర్భంగా కొందరు స్వరసారథులు, గళ వారధుల మనసులోని మాటలు... పాటలు... ఇవాళ్టి ‘సాక్షి’ స్పెషల్
ఎమ్మెస్ విశ్వనాథన్
నచ్చిన రాగం: స.. రి.. గ.. మ.. ప.. ద.. ని.. స..
ఇష్టమైన వాద్యాలు: హార్మోనియం, పియానో
ఫేవరెట్ సింగర్స్: పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పీబీ శ్రీనివాస్, టీఎమ్ సౌందరరాజన్, కేజే ఏసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి
సంగీతం గురించి: ‘‘స్వరాలు నాకు ఎప్పుడూ లోబడలేదు. నేనే వాటికి దాసోహమయ్యాను. సంగీతం దేవుడి భాష. దానికి తెలుగు, తమిళం, మలయాళం అనే భేదాలుండవు. బాణీలు ఎక్కడైనా అవే. దానికి మనం రాసుకునే సాహిత్యం ఉంటుంది కదా. అప్పుడు కలుగుతుంది భాషా భేదం.’’
ఎప్పటికైనా కచ్చేరీ చేస్తాను
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
ఫేవరెట్ సింగర్స్: ఎస్. జానకి, ఏసుదాస్, మహమ్మద్ రఫీ, సోనూ నిగమ్
ఇష్టమైన రాగం: యమన్
ఆశయం: నేను కర్ణాటక సంగీత కచ్చేరీ చేస్తే వినాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డారు. ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారాయన. ఎప్పటికైనా కచ్చేరీ చేయాలనేది నా ఆశ, ఆశయం.
సంగీతమంటే?: దేవుడు ఏదైనా చేయగలడు. అలాగే సంగీతం ఏదైనా చేయగలదు.
ప్రతి రోజూ మ్యూజిక్ డేనే!
ఎల్.ఆర్. ఈశ్వరి
‘‘వరల్డ్ మ్యూజిక్ డేనా?... సంగీతానికి ఒక్కరోజు కేటాయించడమేంటి? అసలు ఈ ప్రపంచం, కాలం, మనం.. అంతా సంగీతంతోనే కదా మమేకమైపోయి ఉన్నాం. సంగీతం గురించి ఒక్కరోజు ఏంటి? ఎన్ని రోజులైనా మాట్లాడాలి. అసలు మన ప్రాణం, ప్రయాణం అంతా సంగీతంతోనే ముడిపడి ఉంది. అమ్మ పాడే లాలిపాటతో మొదలైన మన జీవితం చివరి క్షణం వరకూ సంగీతంతోనే ముడిపడి ఉంటుంది. అసలు సంగీతం లేని జీవితం ఉంటుందా? పాట పాడితేనే కాదు.. మన మాట కూడా సంగీతమే. మనం చేసే ఏ శబ్దంలోనైనా సంగీతాన్ని చూస్తాను. సంగీతంతో నా జీవితం అంతగా మమేకమైపోయింది. ఏ పాట పాడినా మధురానుభూతికి లోనవుతుంటా. మనం పాడే పాటలు ఇతరుల కోసం అని నేననుకోను. పాడటంలో ముందు నేను ఆనందం పొందుతాను. ఆ తర్వాత శ్రోతలు ఆనందపడతారు.’’
రఫీ కలెక్షన్ మొత్తం ఉంది
ఎస్.పి. శైలజ
ఫేవరెట్ సింగర్: మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ సింగర్ మహ్మద్ రఫీ. ఆ తర్వాత పి.సుశీల, ఎస్.జానకి అంటే ఇష్టం. నా దగ్గర రఫీ కలెక్షన్ మొత్తం ఉంది.
సంగీత దర్శకత్వం: సంగీతమే నాకు సరిగ్గా రాదు. ఇక సంగీత దర్శకత్వం ఎక్కడ చేస్తాను?
సింగర్‌గా: సినిమాలకు పాడటం తగ్గిపోయింది. బాపుగారు డెరైక్ట్ చేసిన ‘సుందరకాండ’ తర్వాత నేను మళ్లీ సినిమా పాట పాడలేదు. అన్నీ ప్రైవేట్ ఆల్బమ్స్ సాంగ్సే. టీవీ షోస్, ఫారిన్ ట్రిప్స్ కామనే.