మరణానుభవం
మీరెప్పుడైనా స్వర్గం చూశారా? పోనీ, నరకం..?
అవున్లెండి. ఏది చూడాలన్నా ముందుగా ‘పోవాలి’ కదా!
పోయాక ఇక జవాబు చెప్పడం ఎక్కడ కుదిరి చస్తుంది!
ఇంతకూ.. మరణం తర్వాత ఏమవుతుంది?
అది తెలియాలన్నా ‘పోయి’ రావాలి కదా!
మరి.. చచ్చిబతికిన వాళ్లను అడిగితేనో?
ఏదో.. మాటవరసకి అంటూంటాం కానీ.. చచ్చి బతికినవాళ్లూ ఉంటారా?
ఉన్నారు(ట)! నమ్మేదెలా..?
నిజమే.. కొన్ని గాథల్ని నమ్మలేం. కొన్ని మాత్రం కొంచెం నమ్మశక్యంగా ఉంటాయి.
అక్కడక్కడా కొన్ని కథలకు రుజువులూ దొరుకుతాయి!
అలాంటి కొన్ని మరణానుభవాల గురించే ఈ వారం మన ‘వివరం’.
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ
తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి
పుట్టిన వాడికి మరణం తప్పదు. మరణించిన వాడికి జననం తప్పదు. అనివార్యమైన ఈ విషయము గూర్చి శోకించడం వలదు... ఏ కొద్ది మంది నాస్తికులో తప్ప దాదాపు ఆస్తికులందరూ ఈ మాటను విశ్వసిస్తారు. జన్మలూ, పునర్జన్మలూ, కర్మఫలాలూ ఉన్నాయనీ, ఆత్మలకు నాశనం లేదనీ నమ్ముతారు. కానీ.. శోకించకుండా, జీవితం కోసం వెంపర్లాడకుండా ఉండలేరు. ఎక్కడో, ఏవో సందేహాలు. అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలు. రోజూ అనేక మరణాలూ, జననాలూ. మరి.. ఆ రెండింటి మధ్యన ఏం జరుగుతోంది? మరణం తర్వాత జీవితం ఉందా? ఉంటే, ఎక్కడికి వెళుతున్నాం? స్వర్గానికా? నరకానికా? అసలవి ఉన్నాయా? ఉంటే ఎక్కడున్నాయి? ఇవెప్పటికీ అంతు తెలియని రహస్యాలే. ఈ రహస్యాలు తెలియాలంటే ముందుగా మరణించాలి. మరి మరణిస్తే. వీటి గురించి తెలిసిందో లేదో తెలిసేది ఎలా!? అందుకే.. మరణం తర్వాత ఏం జరుగుతుందన్నది తెలుసుకోవాలంటే రెండే దారులు. ఒకటి స్వయంగా అనుభవించడం. లేదా అనుభవించి వచ్చినవారు చె బితే తెలుసుకోవడం!
ఒక అనుభవం
వెలుగు. కళ్లు జిగేల్‌మనిపించే వెలుగు. బ్రహ్మాండమైన వెలుగు. జీవితంలో ఇంతకుముందెన్నడూ చూడనంతటి వెలుగు. అంతా ఆహ్లాదకరం! ప్రశాంతత. మనసులో ఏ చింతా లేనంతటి ప్రశాంతత. నిరాశా, నిస్పృహలు ఏవీ దరిచేరనంతటి ప్రశాంతత. అంతా ఆనందమే. అంతా ప్రేమమయమే. దేహం విడిచి.. ఇహాన్ని వదలి.. పరలోకానికి పయనం! స్వర్గాన్ని కళ్లారా చూడటం. ముందే అక్కడికి చేరిపోయిన మనవాళ్లను కలుసుకోవడం. మనకు తెలియని మనవాళ్లతోనూ మాట్లాడటం. విశ్వమంతా ఒకే మహాశక్తి అని ఎరుక అయ్యే వేళ! ఆ మహాశక్తి వైపు అప్రయత్నంగా నడక సాగుతుంది. ఆ అనంత శక్తి స్వరూపంలోకి ఆనంద పారవశ్యంతో లీనమైపోవడం ఒక అద్భుతం! అంతలోనే.. ఎంత బతిమాలినా కుదరక.. అయిష్టంగానే, బలవంతంగానే, తిరిగి ఈ లోకంలోకి.. మన దేహంలోకి నిర్దాక్షిణ్యంగా తోసేయబడటం. ఇదీ మరణ అనుభవం! నిజంగా ఒక మహాద్భుతం!!
మరొక అనుభవం
కనిపిస్తుంది. మన కళ్ల ముందు నిర్జీవంగా పడున్నది మన శరీరమే. తెలుస్తుంది. మన దేహం నుంచి మనం బయటికి వచ్చేశాం. వీరెవరు? ఎందుకు లాక్కుపోతున్నారు? పెడరెక్కలు విరిచి. ఎక్కడికి లాక్కుపోతున్నారు? జబ్బలపై చరిచి. ఆ అరుపులేంటి? ఆ చిత్రవధలేంటి ? దే..వు..డా..! అప్పుడే చనిపోయామా? నరకంలోకి వచ్చేశామా? వారిని నూనెలో వేయిస్తున్నారు. వీరిని మంటల్లో కాలుస్తున్నారు. వారూవీరిని శూలాలతో గుచ్చుతున్నారు.
మన సంగతేందిరా దేవుడా! ఆ.. ఏంటీ..? పొరపాటుకు చింతిస్తున్నారా? పక్క వీధిలో నా పేరుతోనే ఉన్న తింగరోడ్ని తీసుకు రావాల్సిందా? నన్ను తిరిగి పంపించేస్తున్నారా? హమ్మయ్య..! ఇంట్లోనో.. ఆస్పత్రి మంచంపైనో.. కోమాలోనో.. అకస్మాత్తుగా గుండె ఆగిన వేళనో.. ఎప్పుడో ఓసారి మస్తిష్కం మొద్దుబారి.. దేహం పూర్తిగా చలనం కోల్పోయిన సమయం.. ఇలా మృత్యు కౌగిలికి చిక్కినట్టే చిక్కి తిరిగి తప్పించుకు రావడం ఒక అద్భుతం! ఒళ్లు గగుర్పొడిచే నరకయాతనలను కళ్లారా చూసి.. ఇంకొన్నాళ్లు బతుకు జీవుడా అంటూ తిరిగి వెనక్కి వచ్చేయడం నిజంగా ఒక మహాద్భుతం!!
అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది?
అనారోగ్యం వల్లో లేక ప్రమాదం వల్లో.. మెదడు పనిచేయడం మానేసి దేహం మొత్తం అచేతనంగా మారిపోయినప్పుడు.. అకస్మాత్తుగా గుండె ఆగిపోయి శరీరం వైద్యపరంగా చనిపోయినప్పుడు లేదా కోమాలోకి వెళ్లినప్పుడు కొంత మంది వ్యక్తులకు దేహాన్ని విడిచిపెట్టిన భావన కలుగుతుంది. చనిపోయిన విషయం తెలిసిపోతుంది. దేహం నుంచి ఆత్మ వేరుపడుతుంది. సునాయాసంగా గాల్లోకి తేలిపోతారు. సొంత శరీరం, పరిసరాలను స్పష్టంగా చూస్తారు. కళ్లు జిగేల్‌మనిపించే కాంతి ప్రత్యక్షమవుతుంది. బ్రహ్మాండమైన ఆనందం లేదా విపరీతమైన భయం ఆవహిస్తుంది. కాంతి సొరంగం గుండా ఎక్కడికో ప్రయాణం మొదలవుతుంది. ఎవరైనా తీసుకెళతారు. లేదా ఒంటరిగానూ ప్రయాణం సాగుతుంది. ఆనందకరమైన అనుభవం అయితే ఇష్టంగా, ప్రశాంతంగా, తన్మయత్వంతో ప్రయాణం సాగుతుంది.
భయానకమైన అనుభవం అయితే బలవంతంగా ఎవరైనా లాక్కుపోతారు. స్వర్గంలాంటి చోటు అయితే శ్రావ్యమైన సంగీతం. సృష్టిలోని సకల అందాలు, జీవరాశులూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయిన, ప్రేమ నిండిన లోకంలోకి అడుగుపెడతారు. అంతకుముందే చనిపోయిన, ఇష్టమైన ఆప్తులను లేదా ప్రముఖులను అక్కడ కలుసుకుంటారు. అక్కడికి వెళ్లిన ప్రతివారూ అక్కడే ఉండిపోవాలని, తిరిగి రాకూడదనే కోరుకుంటారు. కానీ.. ఇంకా ఆయువు తీరిపోలేదని చెబుతూ అక్కడివారు వెనక్కి తోసేస్తారు.
అదే నరకంలాంటి చోటు అయితే ఇక బీభత్సమే. రంపపు కోతలు, శూలదండనలు.. రకరకాల హింసలకు మనుషులు పెట్టే అరుపులు, కేకలు వినిపిస్తాయి. భయానక నరకయాతనలు కనిపిస్తాయి. కొత్తగా వచ్చినవారిపై విచారణ సాగుతుంది. ఆ భయాందోళనలో ఉండగానే.. పొరపాటున తీసుకొచ్చినట్లు యమదూతలు మాట్లాడుకుని తిరిగి వెనక్కి తోసేస్తారు. ఇలాంటి అతీంద్రియ అనుభవాలనే మరణానుభవాలు (నియర్ డెత్ ఎక్స్‌పీరియెన్సెస్)గా చెప్పుకుంటారు. అయితే, విచిత్రంగా ఒక మతం, సాంస్కృతిక నేపథ్యం ఉన్నవాళ్లకు ఒకరకమైన అనుభవాలు, ఇంకో మతం, సాంస్కృతిక నేపథ్యం ఉన్నవాళ్లకు మరోరకం అనుభవాలే ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది.
భారతీయుల రూటే.. సెపరేటు!
భారతీయుల, ముఖ్యంగా హిందువుల మరణానుభవాలపై పరిశోధించిన సత్వంత్ పస్రీచా, ఇయాన్ స్టీవెన్సన్‌లు 1986లో 16 కేసులను వివరిస్తూ అమెరికన్ సొసైటీ ఫర్ ఫిజికల్ రీసెర్చ్ జర్నల్‌లో వ్యాసం రాశారు. వీరి అధ్యయనం ప్రకారం.. ఎక్కువ మంది హిందువులు చనిపోగానే తమను యమదూతలు లేదా దేవదూతలు తీసుకెళ్లినట్లు చెప్పారు. పేర్లతో కన్‌ఫ్యూజన్ అయిపోయి.. చాలా మందిని పొరపాటుగా తీసుకెళ్లడం వల్లనే తిరిగి కిందికి తోసేశారని చెప్పారు.
అదే పాశ్చాత్య సంస్కృతికి చెందిన వారిలో ఎక్కువ మంది పెద్దగా ఏ కారణం లేకుండానే తిరిగి కళ్లు తెరిచినట్లు వెల్లడించారు. అదేవిధంగా కాంతి సొరంగాల గుండా ప్రయాణించడం, దేహం నుంచి బయటికి వచ్చి దేహాన్ని చూడటం, ఇష్టమైనవారిని కలుసుకోవడం, యముడు లేదా దేవుడు వంటివారి రూపురేఖలు కూడా భిన్నంగా కనిపించినట్లు భారతీయులు వివరించారు. అలాగే, నరకంలోకి వెళితే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాల్సి ఉంటుందని అనిపించినట్లు ఇతర మతాలు, దేశాల వారిలో ఎక్కువ మంది చెప్పగా.. భారతీయుల్లో ఎక్కువ మంది మాత్రం.. నరకంలో శిక్షలు పూర్తయ్యాక విడుదల చేస్తారని అనిపించినట్లు చెప్పారట.
కాళ్లు నరికారు.. గుర్తులు మిగిలాయి!
దుర్గా జాతవ్ 20 ఏళ్ల వయసులో టైఫాయిడ్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రిలో దేహం చలనం కోల్పోవడంతో అందరూ అతడు చనిపోయాడని భావించారు. కానీ రెండు గంటల తర్వాత లేచి కూర్చున్నాడు. ఈ లోపు జరిగిందిది..‘‘నన్ను ఓ పదిమంది వచ్చి ఎక్కడికో తీసుకుపోయారు. పారిపోవడానికి ప్రయత్నించడంతో మోకాళ్ల వరకూ కాళ్లు నరికేశారు.
40, 50 మంది కూర్చున్న ఓ చోటికి వారు నన్ను తీసుకెళ్లగానే ఓ వ్యక్తి కాగితాలు చూస్తూ.. జాబితాలో నా పేరు లేదని చెప్పాడు. ‘ఇతడినెందుకు తెచ్చారు? వెనక్కి పంపండి’ అన్నాడు. కాళ్లు లేకుండా ఎలా వెళతానని అడగడంతో కొన్ని జతల కాళ్లను తీసుకొచ్చారు. వాటిలో నా కాళ్లను మళ్లీ నాకు చేతులతోనే అమర్చారు. తర్వాత వెనక్కి పంపేశారు’’ అని దుర్గా జాతవ్ తన అనుభవాన్ని వివరించాడు. అతడి మోకాళ్ల దగ్గర అంతకుముందెన్నడూ లేని కుట్టేసిన గుర్తులు ఉండటమే అతడు నరకానికి వెళ్లొచ్చాడనడానికి సాక్ష్యాలుగా నిలిచాయి. 1979లో ఈ అనుభవం పొందిన దుర్గాను ఆ తర్వాత సత్వంత్ పస్రీచా, ఇయాన్‌స్టీవెన్సన్‌లు ఇంటర్వ్యూ చేశారు.
జీవించాలనుకోగానే... కేన్సర్ మాయం!
అనితా మూర్జానీ హాంగ్‌కాంగ్‌లో స్థిరపడిన భారతీయురాలు. హడ్కిన్స్ లింఫోమా అనే తుది దశ కేన్సర్‌తో పోరాడుతూ మృత్యువుకు చేరువైన ఆమె ఒకరోజు ఉదయం నిద్రలోనే కోమాలోకి వెళ్లిపోయింది. ఇక చేసేదేమీ లేదని, 36 గంటల్లో ఆమె అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయని, వైద్యులు చెబుతున్నారు. చిత్రంగా.. తన భర్తతో వైద్యులు చెబుతున్న ఆ మాటలను అనిత వింటోంది. ఆమె ఉన్న గదికి బయట 40 అడుగుల దూరంలో ఉన్న హాల్‌లో మాట్లాడుకుంటున్న వారిని కళ్లారా చూస్తోంది కూడా.
తాను చనిపోతున్నానని తెలిసిన తన సోదరుడు విమానంలో వస్తుండటమూ కనిపించింది. ఇవన్నీ చూస్తుండగానే.. ఆమె అకస్మాత్తుగా ప్రేమమయమైన ఓ లోకానికి చేరిపోయింది. ‘నాకు కేన్సర్ ఎందుకు వచ్చిందో అప్పుడు నాకు స్పష్టంగా తెలిసిపోయింది. ఈ జీవితంలోకి ఎందుకు వచ్చానో కూడా అర్థమైంది. నా చుట్టూ అంతా ప్రేమమయమైన ఆత్మలు తిరుగుతున్నాయి. నేను త్వరలోనే కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకుంటాననీ తెలిసిపోయింది. మన చుట్టూ మనం సృష్టించుకునే శక్తి మీద ఆధారపడే అనారోగ్యం వస్తుందని అర్థమైంది.
ఇదంతా ఏదీ వాస్తవం కాదు. మన పరిసరాలను, పరిస్థితులను మనమే సృష్టించుకుంటున్నాం’ అని అనిత తన ‘డయింగ్ టు బి మి’ పుస్తకంలో వివరించారు. ‘నేను జీవితం కొనసాగించాలనుకుంటే నా అవయవాలు తిరిగి పనిచేస్తాయి. అక్కడే ఉండాలనుకుంటే పనిచేయవు. కానీ నేను నిర్ణయం తీసుకున్నాను. నా గదిలోకి పరుగెత్తుకు వచ్చిన వైద్యులు నా అవయవాలు తిరిగి పనిచేయడాన్ని నమ్మలేనట్లు చూస్తున్నారు. వెంటనే రకరకాల పరీక్షలు చేశారు. ఆశ్చర్యం. నా తలలో, కడుపులో ఉన్న కేన్సర్ కణతుల్లో చిన్న ముక్క కూడా వారికి కనిపించలేదు! మళ్లీ మళ్లీ పరీక్షలు చేశారు. అయినా అదే ఫలితం! అవును. మన జీవితంలో ప్రతిరోజూ అద్భుతాలు జరిగేందుకు అస్కారం ఉంది. ఈ అనుభవం తర్వాత జీవితంపై ప్రేమ రెట్టింపు అయింది. భూమి పైనే స్వర్గాన్ని అనుభవించేందుకు నాకు రెండో అవకాశం లభించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాను’ అని అనిత తన అనుభవాలను వెల్లడించారు.
నాలుగేళ్లకే స్వర్గ ప్రవేశం!
అమెరికాకు చెందిన కాల్టన్ బర్ఫో అందరిలాగే నాలుగేళ్ల అల్లరి కుర్రాడు. ఒకరోజు అకస్మాత్తుగా తీవ్ర కడుపునొప్పి మొదలైంది. అపెండిక్స్(ఉండుకం) వాచిపోయి ఆస్పత్రికి వెళ్లేలోపే పేలిపోయింది. వైద్యులు రెండుగంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేశారు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన కాల్టన్ రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చాడు. మేలుకోగానే.. తాను స్వర్గానికి వెళ్లొచ్చానని, యేసు ప్రభువును, జాన్ బాప్టిస్ట్‌ను, దేవుడిని చూశానని, అంతకుముందు తాను పుట్టకముందే చనిపోయిన అక్కను, తాతనూ చూశానని చెప్పాడు. పిల్లాడు ఏదో కలల్లోకెళ్లి.. కన్‌ఫ్యూజ్ అయి భ్రమపడి చెబుతున్నాడులే అని వాడి తల్లిదండ్రులు అనుకున్నారు. అయితే.. పాత ఫొటోలన్నీ వెతికించి మరీ తన తాత ‘పాప్’ను వాడు గుర్తుపట్టడంతో విస్తుపోవడం వారి వంతైంది.
ఎందుకంటే.. అంతకుముందెప్పుడూ ఆ ఫొటోలను సైతం వాడు చూడలేదట మరి! అంతేకాదు.. తన కన్నా ముందు ఓ ఆడపిల్ల పుట్టి చనిపోయిందన్న విషయం కూడా వాడికి ఎవరూ చెప్పలేదట. పైగా తనకు ఆపరేషన్ జరుగుతున్న ప్పుడు తన నాన్న టాడ్ బర్ఫో పక్కగదిలోకి వెళ్లి ప్రార్థన చేసుకోవడమూ చూశానని కాల్టన్ వెల్లడించాడు. ఇదేదో నిజంలానే ఉందని అప్పుడు నమ్మిన టాడ్.. కొడుకు చెప్పిన అనుభవాలను వివరిస్తూ 2010లో ‘హెవెన్ ఈజ్ ఫర్ రియల్’ అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకం ఆధారంగా తర్వాత ఏడాది హాలివుడ్ సినిమా రూపొంది విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే ఈ పుస్తకంలోని వివరాలు బైబిల్‌కు వ్యతిరేకంగా ఉన్నాయంటూ మతపెద్దలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వర్గంలో ఓంకారం వినిపించింది!
ఎబెన్ అలెగ్జాండర్. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన న్యూరోసర్జన్. ఎప్పుడూ డ్యూటీ, పరిశోధనలు తప్ప దైవ సంబంధమైన విషయాలను పట్టించుకునే రకం కాదు. 2008లో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వల్ల మెదడు సంబంధమైన తీవ్ర మెనింజైటిస్ వచ్చింది. దీంతో కోమాలోకి వెళ్లిపోయాడు. అనూహ్యంగా ఏడురోజుల తర్వాత కన్ను తెరిచారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే.. ‘నా శరీరం అచేతనంగా పడి ఉన్న సమయంలో కూడా స్పృహ ఉంది. తేలియాడుతున్న మేఘాలు, రంగురంగులు, పచ్చిక మైదానాలు, జలపాతాలతో అలరారుతున్న ఆ ప్రదేశంలో ఓ అమ్మాయి వచ్చి నన్ను సీతాకోక రెక్కలపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లింది. ఆమె రూపురేఖలు నాకు బాగా గుర్తుండిపోయాయి.
చివరగా అద్భుత ప్రకాశంతో మెరిసిపోతున్న దేవుడి దగ్గరకు తీసుకెళ్లింది. అక్కడ శ్రావ్యమైన సంగీతం వినిపించింది. నిరంతరం ప్రతిధ్వనించే ఓంకారం సైతం వినిపించింది. ‘నువ్వు ఎల్లప్పటికీ ప్రేమించబడ్డావు’ అంటూ నా చెవిలో ఆమె ఓ సందేశం చెప్పింది. అంతే మరుక్షణం ఆస్పత్రిలో కళ్లు తెరిచాను. చిత్రంగా.. నేను, నా పని, భాషను కూడా మరిచిపోయాను. కొన్ని వారాలు గడిచాకే మామూలు స్థితికి వచ్చేశాను’ అని ఎబెన్ తన పుస్తకం ‘ప్రూఫ్ ఆఫ్ హెవెన్: ఏ న్యూరోసర్జన్స్ జర్నీ ఇన్‌టూ ద ఆఫ్టర్‌లైఫ్’లో వివరించాడు. ‘నేను చిన్నప్పుడే దత్తత వచ్చాను. నా పుట్టినిల్లు గురించి నాకేమీ తెలియదు. బెట్సీ అనే తోడబుట్టిన సోదరి ఉండేదనీ తెలియదు. పెరిగి పెద్దయ్యాక రక్తసంబంధీకుల కోసం అన్వేషణ మొదలుపెట్టాను. ఈ సమయంలోనే కోమాలోకి వెళ్లాను. కోలుకున్న తర్వాత రక్తసంబంధీకుల నుంచి అందిన బెట్సీ ఫొటో చూశాకే తెలిసింది. నేను స్వర్గంలో చూసింది ఆమెనే అని. అయితే.. కోమాలో ఉన్నప్పుడు నా మెదడుకు సంబంధించి ప్రతినిమిషానికీ రికార్డులున్నాయి. కానీ మెదడు ఎప్పుడూ చైతన్యవంతం కాలేదు. అంటే.. ఈ అనుభవమంతా నా మెదడులో మాత్రం జరగలేదు. సమాధికి ఆవలా అమరత్వం ఉంటుంది’ అని ఎబెన్ అంటాడు.
పరిశోధకులు ఏం తేల్చారు?
మరణానుభవాలపై పారాసైకాలజీ, సైకాలజీ, సైకియాట్రీ, వైద్య చికిత్సల కోణంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి. 1975లో రేమండ్ మూడీ జూనియర్ ‘లైఫ్ ఆఫ్టర్ లైఫ్’ పుస్తకంలో ‘నియర్ డెత్ ఎక్స్‌పీరియెన్స్’ అనే పదబంధం వాడారు. 1981లో మూడీ స్థాపించిన ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ నియర్ డెత్ స్టడీస్’ ద్వారా పరిశోధనలు ఊపందుకున్నాయి. అనేక పుస్తకాలు వచ్చాయి. వీటిలో కొన్ని స్వీయ మరణానుభవాలను వివరిస్తూ రాసినవి కాగా, మరికొన్ని పరిశోధించి రాసినవి. బ్రూస్ గ్రేసన్ మరణానుభవం లోతును కొలిచే ‘నియర్‌డెత్ ఎక్స్‌పీరియెన్స్ స్కేల్’ను కూడా రూపొందించాడు. మెదడు చనిపోతున్నప్పుడు ఏం జరుగుతోందన్న కోణంలో బ్రిటిష్ సైకాలజిస్టు సుసాన్ బ్లాక్‌మోర్ 1993లో ‘డయింగ్ బ్రెయిన్ హైపోథీసిస్’ రాశారు.
మరణానుభవంపై ఫేమస్ పుస్తకాలు, సినిమాలు ఇవే...
90 మినిట్స్ ఇన్ హెవెన్
(డాన్ పైపర్, పాస్టర్-1989)
23 మినిట్స్ ఇన్ హెల్ (బిల్ వీజ్)
ఎంబ్రాస్డ్ బై ద లైట్ (బెట్టీ జె.ఈడీ)
లైఫ్ ఆఫ్టర్ లైఫ్(రేమండ్ ఎ. మూడీ)
డయింగ్ టు బి మి(అనితా మూర్జానీ)
సేవ్డ్ బై ద లైట్ (సినిమా-1995)
రిసరెక్షన్ (2014)
హెవెన్ ఈజ్ ఫర్ రియల్ (2014)
హియర్ ఆఫ్టర్(2010)
హార్ట్ అండ్ సోల్స్(1993)
నీతి తప్పితే శిక్ష తప్పదు... క్రీ.పూ. 380లో ప్లేటో కథనం!
మరణానుభవం గురించి క్రీ.పూ. 380వ సంవత్సరంలోనే ఓ సైనికుడి కథనాన్ని ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త ప్లేటో తన ‘రిపబ్లిక్’ గ్రంథంలో ప్రస్తావించాడు. ‘మిత్ ఇర్ (ఇర్ చెప్పిన మాట)’ అనే ఈ కథనం ఇలా ఉంది.. ఇర్ అనే సైనికుడు యుద్ధంలో మరణిస్తాడు. పదిరోజుల తర్వాత సైనికుల మృతదేహాలు తీసుకొస్తారు. అయితే.. ఇర్ శవం మాత్రం కుళ్లిపోకుండా తాజాగానే ఉంటుంది. రెండు రోజుల తర్వాత ఇర్ శవాన్ని చితిపై ఉంచి దహనం చేయబోతుండగా లేచి కూర్చుంటాడు. చనిపోయాక ఈ పదిరోజుల్లో అద్భుతమైన ఆత్మలతో కూడిన సుందర లోకంలోకి తన ప్రయాణం ఎలా సాగింది? తన పూర్వ జన్మ గురించి సైతం ఇర్ వివరించాడట. ‘నీతిమంతంగా ఉండేవారికి మరణం తర్వాత బహుమతి దక్కుతుంది. నీతి తప్పేవారికి శిక్ష తప్పదు’ అంటూ ప్లేటో ఈ కథనానికి ముక్తాయింపునిచ్చాడు.
చనిపోయేటప్పుడు తీవ్ర ఒత్తిడి పెరిగి మెదడులోని టెంపోరల్ లోబ్(జ్ఞాన లంబిక) చైతన్యం అవుతుంది. దీనివల్లే విచిత్ర మరణానుభవాలు కలుగుతుంటాయని కొందరు పరిశోధకుల వాదన. మనిషి చనిపోతున్నప్పుడు మెదడుకు ఆక్సీజన్ సరఫరా ఆగి, విద్యుత్ ప్రేరణలు పెరగడం వల్ల చిత్రమైన భ్రమలు కలుగుతాయని మరికొందరి భావన. రక్తంలో అధికమొత్తంలో కార్బన్‌డయాకై ్సడ్ చేరి అది మెదడులోని రసాయన సమతుల్యాన్ని దెబ్బతీసినప్పుడు చిత్రమైన అనుభూతులు కలిగే అవకాశముందని 2010లో యూనివర్సిటీ ఆఫ్ మరిబార్ పరిశోధకులు ప్రతిపాదించారు. అయితే భ్రమలు అనేవి మనిషి స్పృహలో ఉన్నప్పుడు కూడా కలుగుతాయి. కానీ మరణానుభవాలు మాత్రం స్పృహలో లేనప్పుడు పైకి కనిపించకుండానే జరిగిపోతాయి. ఈ చిత్రమైన మరణానుభవాల గురించి ఎంతమంది ఎన్ని పరిశోధనలు చేసినా, వివరణలు ఇచ్చినా.. ఏకాభిప్రాయం మాత్రం రాలేదు.
అంతా మాయేనా..?
పక్కసందులోనే ఉన్నట్లు రెప్పపాటులోనే స్వర్గం అంచులదాకా లేదా నరకంలోకి వెళ్లడం ఎలా సాధ్యం? ఇదంతా మాయా? లేక నిజ్జంగానే నిజమా! ఏదేమైనా..నమ్మశక్యమైన కొందరి మరణానుభవాలను చూస్తే మాత్రం.. మరణం మహాద్భుతం అని అనిపిస్తుంది. మరణం అంటే ఆనందం. మరణం అంటే అమరత్వం. స్వర్గం అంటే అంతులేని సంతోషం అనిపిస్తుంది. అయితే మరణం అనేది సహజంగా రావాలి. మృత్యు ఒడిలోకి జారుకుని ఆనందసాగరాల అంచులు చేరాలి. నరకానికి పోయినట్లూ కొందరు చెప్పారే! అయినా ఫర్లేదు. చేసిన పాపాలకు అక్కడ మనకు పడిన శిక్ష అయిపోగానే.. ఆత్మకు విముక్తి లభిస్తుంది. సో.. బీ హ్యాపీ! డోంట్ ఫియర్ ఎబౌట్ డెత్!
- హన్మిరెడ్డి యెద్దుల