జీవితం చెప్పే చేదునిజాల పాఠాలు నేర్చుకోక తప్పదు
మా అమ్మాయికి పెళ్లయ్యి 12 ఏళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. మా అల్లుడు వ్యాపారం చేస్తుంటాడు. అనారోగ్యం వల్ల అతను మూడు నెలలుగా ఆసుపత్రిలో ఉన్నాడు. దాంతో వ్యాపారం కాస్తా మూతపడింది. మేం కొంత డబ్బు అప్పు ఇచ్చి సర్దాం. కుటుంబ అవసరాల కోసం మా అమ్మాయి చాలా ఇబ్బందిపడుతోంది. తను ఆర్థికంగా, మానసికంగా కోలుకునే మార్గం కనపడటం లేదు. ఏం చేస్తే బాగుంటుంది?
- పి. విజయ, గుంటూరు
కూతురు కాపురంలో ఇబ్బందులని తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోలేరు. మీకు ఇబ్బంది కానంతవరకు ఆమెకు సహాయం చేయడం మంచిదే. అత్యవసరమైనప్పుడు అప్పులు చేసైనా సహాయం చేయక తప్పదు. కానీ అత్యవసరం కానప్పుడు మీరు అప్పులు చేసి సహాయం చేయటం ఎంతవరకు అవసరమో ఆలోచించుకోండి. ఎందుకంటే అత్తమామలు చేసే ఆర్థిక సహాయాన్ని హక్కుగా భావిస్తారు, కొందరు అల్లుళ్లు. చివరికి మీ అప్పులు మీరే తీర్చుకోవలసిన దుస్థితి రావచ్చు. ముందు మీ అమ్మాయికి లభించగల నిధులు ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఉదాహరణకి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, ఎల్‌ఐసీ పాలసీలపై అప్పు తీసుకోవచ్చు. బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు ఉంటే వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదా వాటిపై డిమాండ్ లోన్ తీసుకోవచ్చు. వారి వద్ద అప్పు తీసుకున్న వారెవరైనా ఉంటే, వాటి వసూలుకు ఒత్తిడి తేవచ్చు.
మరొక ముఖ్యవిషయం... మీ అల్లుడి పేరుతో బీమా పాలసీల ప్రీమియం చెల్లింపు గడువు సమీపిస్తే - అప్పు చేసైనా ఆ ప్రీమియం కట్టాలని మీ అమ్మాయికి గుర్తు చేయండి. ప్రీమియం కోసం ఈ సమయంలో అప్పుచేస్తే ఎవరేమనుకుంటారోనని ఆలోచించనవసరం లేదు. ఆపద సంభవించిన తరువాత ఎవరూ మీ అమ్మాయిని ఆదుకోరు. దురదృష్టాన్ని ఊహించి పాలసీ ప్రీమియం కోసం అప్పు చేస్తున్నదని లోకులు కాకుల్లా పొడుస్తారన్న సంకోచాలేమీ పెట్టుకోకుండా వాస్తవిక దృక్పథంతో ఆలోచించడం అవసరం. జీవితం చెప్పే చేదు నిజాల పాఠాలు నేర్చుకోక తప్పదు.
- వంగా రాజేంద్రప్రసాద్, ఆర్థిక వ్యవహారాల నిపుణులు