![My security is Pawan Kalyan responsibility, says kathi mahesh - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/26/I-Will-Join-Pawan-Kalyan-s-.jpg.webp?itok=J_eAZUOp)
కత్తి మహేశ్, పవన్ కల్యాణ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య ఎడతెగని వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్‌ను కత్తి మహేశ్ పలు విషయాల్లో విమర్శిస్తుండటం.. అందుకు బదులుగా పవన్ అభిమానులు కత్తిని టార్గెట్ చేసి దుర్భాషలాడటం, బెదిరించడం తెలిసిందే. ఆ తర్వాత టీవీ చర్చల అనంతరం ఈ వివాదం ముగిసినట్టు ఇరువర్గాలు ప్రకటించాయి. కానీ కత్తి మహేశ్ తాజాగా మరోసారి పవన్ అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తనకు ఏమైనా జరిగితే అందుకు పవన్ కల్యాణ్‌దే బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. తన భద్రత బాధ్యతను పవన్ తీసుకోవాలని ట్విటర్‌లో పోస్టు చేసిన ఓ వీడియోలో కత్తి మహేశ్ పేర్కొన్నారు. తిడుతూ.. బెదిరిస్తూ.. ఆన్‌లైన్ ట్రోలింగ్ చేస్తున్న తన అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత పవన్‌దేనని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్‌గారూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ అంటూ విజ్ఞప్తి చేశారు. ఆయన వీడియోలో ఏమన్నారంటే..
‘బూతులు తిట్టడం, బెదిరించడం, ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ చేయడం, ఫోన్ నంబర్ దొరికితే కాల్ చేసి పరమ చెండాలంగా మాట్లాడటం.. ఇవీ పవన్‌కల్యాణ్ అభిమానులకు ఉన్న అతిపెద్ద బలాలు. మళ్లీ అదే మొదలుపెట్టారు. నా ఫోన్ నంబర్ బయటపెట్టారు. నా అడ్రస్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టి తమలో తాము రెచ్చగొట్టేలా మాట్లాడుకొని.. నా మీద దాడి చేయాలని ప్లాన్ చేయడం, నాకు ఫోన్ చేసి బెదిరించడం.. అసహ్యంగా ఉంది. భరించలేకుండా ఉంది. నాకు ఏమైనా జరిగితే అందుకు పవన్ కల్యాణ్‌దే బాధ్యత. మై సెక్యూరిటీ ఈజ్ పవన్ కల్యాణ్స్ రెస్పాన్సిబిలిటీ. ఇది భయంతో చెప్పడం లేదు. సమాజంలో ఇలాంటి అరాచకానికి కారణమైన వాళ్లు దానిని బాధ్యతగా స్వీకరించకపోవడం కూడా సమస్యే. పవన్ కల్యాణ్‌గారూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్’ అని కత్తి మహేశ్ వీడియోలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment