Naa Nuvve Movie Review, in Telugu | కల్యాణ్ రామ్‌ నా నువ్వే తెలుగు మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

Published Thu, Jun 14 2018 11:58 AM | Last Updated on Thu, Jun 14 2018 1:04 PM

Naa Nuvve Telugu Movie Review - Sakshi

టైటిల్ : నా నువ్వే
జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : కల్యాణ్ రామ్‌, తమన్నా, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళీ, ప్రవీణ్‌
సంగీతం : శరత్‌
దర్శకత్వం : జయేంద్ర
నిర్మాత : మహేష్‌ ఎస్‌. కోనేరు, కిరణ్ ముప్పవరపు, విజయ్‌ కుమార్‌ వట్టికూటి

మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన కల్యాణ్ రామ్‌ ఇన్నాళ్లు అదే ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తూ సినిమాలు చేస్తూ వచ్చాడు. కెరీర్‌లో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా వరుస సినిమాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తొలిసారిగా తన ఇమేజ్‌ను పక్కన పెట్టి పూర్తి క్లాస్ మూవీగా తెరకెక్కిన నా నువ్వేతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కల్యాణ్ రామ్‌. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన నా నువ్వే అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంది..? మాస్ ఇమేజ్‌ ను పక్కన పెట్టి కల్యాణ్ రామ్‌ చేసిన ప్రయోగం ఏ మేరకు ఫలించింది..?

కథ ;
నా నువ్వే డెస్టినీని నమ్మే అమ్మాయి.. నమ్మని అబ్బాయిల ప్రేమకథ. వరుణ్‌ (కల్యాణ్ రామ్‌) పెద్దగా నమ్మకాలు లేని మోడ్రన్‌ కుర్రాడు. అమెరికాలో ఉద్యోగం రావటంతో ఫ్రెండ్స్‌ని, బామ్మని వదిలేసి అమెరికా ప్రయాణం అవుతాడు. కానీ ఏవేవో కారణాల వల్ల మూడు సార్లు వరుణ్ ప్రయాణం క్యాన్సిల్‌ అవుతుంది. మీరా (తమన్నా) డెస్టినీని విపరీతంగా నమ్మె అమ్మాయి. అనుకోకుండా తన దగ్గరకు వచ్చిన బుక్‌ లో వరుణ్‌ ఫొటో చూసి ఇంప్రెస్‌ అవుతుంది. ఆ ఫొటో చూసినప్పుడలా తనకు లక్‌ కలిసి వస్తుండటంతో ఫొటో చూసే వరుణ్‌తో ప్రేమలో పడుతుంది. ఎలాగైన వరుణ్‌కు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంది. అనుకున్నట్టుగానే వరుణ్‌ కలిసి తన ప్రేమ గురించి చెపుతుంది. అయితే మీరా నమ్మే డెస్టినీకి ఓ టెస్ట్‌ పెట్టిన వరుణ్ చివరకు మీరాతో ప్రేమలో పడతాడు. మీరా తండ్రి (తనికెళ్ల భరణి) వారి ప్రేమకు అడ్డు చెప్తాడు. అనుకోని పరిస్థితుల్లో వరుణ్, మీరాకు దూరమవుతాడు. వరుణ్‌ను తిరిగి కలుసుకునేందుకు మీరా ఏం చేసింది..? వరుణ్, మీరాలు ఎందుకు దూరమయ్యారు..? చివరకు ఎలా కలిశారు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
ఇన్నాళ్లు మాస్ యాక్షన్ రోల్స్‌ లో కనిపించి కల్యాణ్‌ రామ్‌ సాఫ్ట్‌, స్టైలిష్‌ లుక్‌ లో మెప్పించాడు. నటన పరంగానూ ఆకట్టుకున్నాడు. మీరా పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. గ్లామర్‌ షోతో కుర్రకారును ఫిదా చేసిన తమన్నా నటనలోనూ ఫుల్‌ మార్క్స్‌ సాధించింది. రొమాంటిక్‌ సీన్స్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ తమన్నా నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పోసాని కృష్ణమురళీ తెర మీద కనిపించింది తక్కువ సేపే అయిన ఉన్నంతలో తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. హీరోయిన్‌ తండ్రి తనికెళ్ల భరణీ తనకు అలవాటైన రొటీన్ పాత్రలో కనిపించారు. ప్రవీణ్‌, వెన్నెల కిశోర్‌, సురేఖ వాణి, ప్రియదర్శి తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ ;
కల్యాణ్ రామ్‌ లాంటి మాస్‌ హీరోతో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కించిన దర్శకుడు జయేంద్ర అనుకున్న స్థాయిలో అలరించలేకపోయాడు. డెస్టినీ చుట్టూ రాసుకున్న కథలో ఎమోషన్స్‌ మిస్‌ అయినట్టుగా అనిపిస్తుంది. విడిపోయిన హీరో హీరోయిన్లు ఎలా కలుస్తారన్న క్యూరియాసిటీ కలిగించినా.. ప్రేక్షకుడు కథలో లీనమయ్యే స్థాయి ఎమోషనల్‌ సీన్స్ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌లకు కామెడీ కూడా కీలకం. అయితే దర్శకుడు ఎక్కడా కామెడీ మీద దృష్టి పెట్టలేదు. వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి లాంటి కమెడియన్స్‌ ఉన్నా వారిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. శరత్ సంగీతమందించిన పాటలు పరవాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. యాడ్‌ ఫిలిం మేకర్‌ అయిన జయేంద్ర పాటలను యాడ్‌ ఫిలింస్‌ లా గ్రాఫిక్స్‌ నేపథ్యంలో ప్లాన్ చేశారు. అయితే ఆ ప్రయత్నం కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. పీసీ శ్రీరాం లాంటి లెజెండరీ సినిమాటోగ్రాఫర్‌ ఉన్నా.. ఆయన మ్యాజిక్‌ కూడా ఎక్కడా కనిపించలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పూర్తి క్లాస్‌ సినిమా కావటంతో ఓ సెక్షన్‌ ఆడియన్స్‌ ను అలరించినా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

ప్లస్‌ పాయింట్స్‌ :
తమన్నా గ్లామర్‌
కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
స్లో నేరేషన్‌
లవ్‌ స్టోరిలో ఉండాల్సిన ఫీల్‌ కనిపించకపోవటం
ఎంటర్‌టైన్మెంట్‌ లేకపోవటం

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement