కమల్హాసన్ గురించి తప్పుగా మాట్లాడారు
చెన్నై: ప్రముఖ నటుడు కమల్హాసన్ గురించి నడిగర్ సంఘం కార్యదర్శి రాధారవి తప్పుగా మాట్లాడారని, ఆ ఆధారాలు తన వద్ద ఉన్నాయని నటుడు విశాల్ అన్నారు. నడిగర్ సంఘం వ్యవహారంలో శరత్‌కుమార్ వర్గం, విశాల్ వర్గం మధ్య పోటీ తీవ్రరూపం దాల్చిందని చెప్పక తప్పదు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేస్తున్నారు. విమర్శలు గుప్పించుకుంటున్నారు. అలాగే ఓట్ల ప్రచారం ముమ్మరం చేశారు.
నటుడు విశాల్ వర్గం సేలం తిరుచ్చి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడి రంగస్థల నటులతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుత సంఘ నిర్వాహకులపై అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ దండెత్తారు. తిరుచ్చి దేవర్ హల్‌లో నిర్వహించి న సమావేశంలో నటుడు విశాల్ మాట్లాడుతూ తాము పదవుల కోసం ఊరూరా తిరగడంలేదని అన్నారు. సినిమా తమ కుటుంబం అని అందులో రంగస్థల నటులు ఒక అంగం అని పేర్కొన్నారు. అలాంటి వారి క్షేమం కోసం గొంతెత్తడం తప్పా? అంటూ ప్రశ్నించారు.
నటుడు కమల్హాసన్‌ను రాధారవి తప్పుగా మాట్లాడారు. ఆ ఆధారాలు చూపడానికి తాను రెడీ అన్నారు విశాల్. సహ నటీనటులను తక్కువ చేసి మాట్లాడటం నాగరికతా? అంటూ ప్రశ్నించారు. ఇకపై సంఘం వ్యవహారాల్లో విశాల్ మాత్రమే కాదు నటులందరూ ప్రశ్నిస్తారన్నారు. తాను తమ జట్లుకు ఓటు వేయమని అడగడం లేదని మనసాక్షికనుగుణంగా ఓటు వేయండి అంటున్నానని విశాల్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో నటుడు నాజర్, కరుణాస్, పోన్‌వన్నన్ తదితరులు పాల్గొన్నారు.