ఆ ఇద్దరితో ఊరు ఖాళీ
తమిళసినిమా: గ్రామాల్లో ఎవరైనా తప్పు జేస్తే వారిని గ్రామ ప్రజలు వెలి వేస్తారు. కుల మతాల కారణంగా ప్రేమ జంటలు ఒక్కోసారి అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. అయితే ఒక ప్రేమజంట కారణంగా ఆ గ్రామ ప్రజలే ఊరు వదిలి వెళ్లిపోయిన ఇతివృత్తంతో రూపొందిన చిత్రం నాడోడి కనవు. ఆర్‌ఆర్‌ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజేంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ సహ నిర్మాతగా వ్యవహరించారు. వీరసెల్వ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేంద్రన్ కథానాయకుడిగా నటించారు.ఈయన బాల నటుడిగా దక్షిణాది భాషలన్నింటిలోనూ అనేక చిత్రాల్లో నటించారన్నది గమనార్హం.
నాయకిగా సుప్రజ నటించిన ఇందులో క్రేన్‌మనోహర్, విజయ్‌గణేశ్, కే.రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. సబేష్ మురళి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం అన్నారు. అసలు ఒక ప్రేమజంట కారణంగా గ్రామ ప్రజలే ఊరు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఆ తరువాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది లాంటి ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన చిత్రం నాడోడి కనవు అని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను శివగంగై, చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించినట్లు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, చిత్రాన్ని ఈ నెలలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.