ఎంతో ధైర్యంగా పోరాడి ప్రాణాంతక కరోనా వైరస్‌ను జయించడంతో పాటు తన ప్లాస్మాను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిందని తన కజిన్ కూతురు దియా నాయుడుపై నటి నఫీసా అలీ ప్రశంసలు కురిపించారు. కరోనాపై పోరులో విజయం సాధించి... ప్రస్తుతం తన లాంటి పేషెంట్లను కాపాడేందుకు సాయం అందిస్తున్న హీరో దియా అనుభవాలను తెలుసుకోవాలని తన ఇన్‌స్టా ఫాలోవర్లకు సూచించారు. ‘‘దియా నాయుడు. ప్లాస్మా దానం చేసి ఇంటికి తిరిగివచ్చింది. ఇప్పుడదే లిక్విడ్ గోల్డ్‌లా కనిపిస్తోంది. ఎన్నో ప్రాణాలను నిలబెడుతోంది కాబట్టి దానికి విలువ కట్టలేం’’అని తన సోషల్ మీడియా అకౌంట్లో రాసుకొచ్చారు. దియాను ధైర్యశాలిగా ఆమె అభివర్ణించారు. ఈ క్రమంలో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.(కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ?)
కాగా బెంగళూరులో నివసించే దియా నాయుడు కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆమె ఇటీవలే కోలుకున్నారు. కరోనా పేషంట్లకు.. కోవిడ్ నుంచి కోలుకున్న వారి ప్లాస్మా ఎక్కించడం ద్వారా ప్రమాద తీవ్రత తగ్గుంతుందన్న వార్తల నేపథ్యంలో ముందుకొచ్చి.. కర్ణాటకలో ప్లాస్మా దానం చేసిన రెండో వ్యక్తిగా ఆమె నిలిచారు. ఈ క్రమంలో తన అనుభవాలు వెల్లడిస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశారు. ‘‘కర్ణాటకలో ప్లాస్మా థెరపీ ప్రారంభించారు. కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ల రక్తంలోని ప్లాస్మాను సేకరిస్తున్నారు. అందులోని యాంటీబాడీలు వైరస్ బారిన పడిన వారు కోలుకునేందుకు ఉపయోగపడతాయి. ఒక్క బ్యాగు ప్లాస్మా ఒక పేషెంట్‌కు మాత్రమే సరిపోతుందట. అంటే ప్లాస్మా దానం చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.(ప్లాస్మా దానం చేస్తున్న తబ్లిగీలు)
కాబట్టి కరోనా నుంచి బయటపడ్డవారు ముందుకురావాలి. మనలాగే బాధ పడుతున్న వారిని కాపాడాలి. మీరు నాకు మెసేజ్ చేస్తే మీ సమాచారాన్ని డాక్టర్లకు చేరవేస్తాను. ఎవ్వరూ భయపడవద్దు. రక్తదానం చేసినట్లుగానే ఈ ప్రక్రియ కూడా. పెద్దగా నొప్పికూడా ఉండదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మన నుంచి ప్లాస్మా సేకరిస్తారు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. అంతేకాదు మరో రెండు వారాల్లో తిరిగి ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. కేవలం నాలుగు గంటలు కేటాయిస్తే చాలు ఒక్కరి ప్రాణం కాపాడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. వైద్యబృందాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. వారికి సాయం అందిద్దాం’’అని చైతన్యం నింపారు. కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment