నాగ్ అశ్విన్
సాక్షి, హైదరాబాద్ : మహానటి సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు ఆయన పరిచమయ్యారు. నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమా ఓ మోస్తరుగా ఆడినా దర్శకుడిగా అశ్విన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. రెండో సినిమాగా బయోపిక్‌ను ఎంచుకోవడం.. అందులోనూ మహానటి సావిత్రి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలనుకోవడం.. అనుకున్న దానికంటే అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దిన తీరు ఆయనపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
సావిత్రి బయోపిక్ తీయాలనుకోవడం ఒక సాహసమైతే.. ఒకే సినిమాతో దిగ్గజాలను తెరపైన ఆవిష్కరించానుకోవడం మరో సాహసం. జెమినీ గణేషన్, ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్, ఎస్వీఆర్, కేవీ రెడ్డి, చక్రపాణి, ఎల్వీప్రసాద్ ఇలా అలనాటి మేటి సినీ వర్గాన్ని తెరపైన చూపించాలంటే వారి అభినయాన్ని, ఆహార్యాన్ని స్ఫురణకు తెచ్చే నేటి నటులను తెరపైకి తేవాలి. ఇది అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటిది మేటి తారలకు తగ్గట్టుగా వారి పాత్రలలో నేటి తారలను చూపించి ఔరా అనిపించారు అశ్విన్. సినిమాతో మ్యాజిక్ చేసి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఎవడే సుబ్రమణ్యం తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదని, ఏదైనా చేస్తే అది భవిష్యత్తును ముందుకు నడిపేదిగా ఉండాలి. చిన్నప్పటి నుంచి నటిగా సావిత్రి అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె గురించిన విషయాలు తెలుసుకోవడానికి రెండేళ్లు కష్టపడ్డాను. ఏది ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుంది. రెండో సినిమాగా బయోపిక్ తీయడం అలా జరిగిపోయింది. రానున్న రోజుల్లో ప్రయోగాలు చేస్తానో లేదో తెలియదు. కొన్ని విజయాలు, అపజయాల తర్వాత జీవితం ఎలా మారుతుందో. ఇప్పుడు తీసినంత నిజాయితీగా తర్వాతి రోజుల్లో తీస్తానో లేదో. మహానటి విజయం ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. సావిత్రి గురించి తెలుసుకోవడానికి చాలా పుస్తకాలు చదివాను, సావిత్రితో కలిసి నటించిన వారు ఆమె గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలలోని విషయాలను కూడా తెలుసుకున్నాను.
ముఖ్యంగా ఆమె కూతురితో సినిమాకు అవసరమైన అన్ని విషయాలపై చర్చించాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిజాయితీతో పూర్తి చేశారు. కీర్తి సురేష్ నటన సినిమా విజయానికి ఓ ముఖ్య భూమిక పోషించింది. శేఖర్ కమ్ముల వద్ద పని చేసినపుడు పాత్రల విషయంలో ఎక్కువ ఆసక్తి చూపేవాడిని. మొదట సావిత్రి పాత్రకోసం చాలా మందిని అనుకున్నప్పటికి చివరగా కీర్తి సురేష్‌ను ఎంచుకున్నాం. ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా తొడరిలో కీర్తి సురేష్ నటన నచ్చడంతో ఆమె ఈ పాత్రకు న్యాయం చేస్తుందని నమ్మాను.
మహానటి సినిమాలో నటించిన దుల్కర్ సల్మాన్, సమంతా అక్కినేని, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, బానుప్రియ, ఇతరులతో కలిసి పనిచేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. వారి షెడ్యూల్స్‌ను మేనేజ్ చేయడమే ఇబ్బందిగా మారేదని, కేవలం సావిత్రి బయోపిక్ అన్న ఒక్క కారణంతో సినిమా పాత్ర నిడివి తక్కువైనా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా కోసం కష్టపడిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను నమ్మి సినిమా చేసిన నిర్మాతలు ప్రియాదత్, స్వప్నదత్‌ల వల్లే మహానటి విజయం సాధ్యపడింది. మహానటి సినిమాతో తన బాధ్యత మరింత పెరింగిందంటూ’ పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment