
లీల మాయలో..!
ఫ్రెండ్స్‌తో సరదాగా హాయిగా తిరిగే ఆ కుర్రాణ్ణి ప్రేమలో పడేసిందో చిన్నది. ఆమె పేరు లీల. పేరుకు తగ్గట్టే తన అందంతో అతణ్ణి మాయ చేసింది. అసలే చెల్లి వాళ్ల ఫ్రెండ్. ప్రేమగా ఆమెతో మాటలు కలిపాడు. మరి అతని ప్రేమ ఎన్ని మలుపులు తిరిగిందనే కథాంశంతో లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ‘ఏ మాయచేశావే’ తర్వాత నాగచైతన్య హీరోగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. రచయిత కోన వెంకట్ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మంజిమా మోహన్ కథానాయిక. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను టర్కీలో చిత్రీకరించారు. ఈ నెల 16 నుంచి 20 వరకూ జరిగే షూటింగ్‌తో ఈ సినిమా పూర్తవుతుంది. దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ- ‘‘ఎ.ఆర్. రెహ్మాన్ వినసొంపైన పాటలు అందించారు. ఇటీవల యూ-ట్యూబ్‌లో విడుదల చేసిన ‘ఎల్లిపోమాకే...ఎదనే వదిలి పోమాకే’ పాట ఇప్పటికే హిట్ అయింది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డెక్‌మాక్ ఆర్థర్, ఆర్ట్: రాజీవన్.