బొమ్మనహళ్లి: అలనాటి సూపర్ హిట్ సినిమా ‘నాగరహావు’ నేటి డిజిటల్ ధ్వని, కొంగొత్త హంగులతో ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో శోభన్‌బాబు, లక్ష్మి నటించిన ‘కోడెనాగు’ చిత్రానికి మాతృక అయిన ఈ కన్నడ సినిమా సరిగ్గా 46 ఏళ్ల కిందట విడుదలై అనేక రికార్డులను తిరగ రాయడమే కాకుండా అవార్డుల పంట పండించింది. ఈ ఒక్క సినిమాతోనే హీరో విష్ణువర్ధన్ నటుడుగా భారీ బ్రేక్ సాధించి అగ్రనటుడు డాక్టర్ రాజ్ కుమార్ సరసన స్థానాన్ని సైతం సంపాదించాడు.
చిత్ర నిర్మాత తనయుని తపనతో...
ఈ చిత్ర నిర్మాత ఎన్.వీరాస్వామి కుమారుడు బాలాజీ ఆలోచనతో సినిమా మరోసారి రూపుదిద్దుకుంది. కొత్త టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తిరిగి రూపొందిస్తే ఎలాగుంటుందని తన సోదరుడైన నటుడు రవిచంద్రన్‌ను అడిగానని, ఆయన తనను ప్రోత్సహిస్తూ, వెంటనే పనిని ప్రారంభించమన్నారని బాలాజీ తెలిపారు. ఈ చిత్రానికి కొత్త హంగులను దిద్దాలనుకున్నప్పుడు ప్రింట్లు మాత్రమే దొరికాయని, చెప్పారు. వెతగ్గా వెతగ్గా చెన్నైలోని జెమిని ల్యాబ్స్‌లో నెగటివ్ లభ్యమైందని తెలిపారు. కొత్త హంగులను సమకూర్చడంలో 60 మంది సాంకేతిక నిపుణులు రెండేళ్ల పాటు శ్రమించారని చెప్పారు. మొత్తానికి ఈ నాగరహావు విభిన్న దృశ్య అనుభవాన్ని పంచుతుందని చెప్పారు. గత నెలలో యూట్యూబ్‌లో టీజర్‌ను విడుదల చేయగా ఇప్పటికి 11 లక్షల మందికి పైగా వీక్షించారు. అప్పట్లో నాగరహావును 35 ఎంఎంలో విడుదల చేయగా, ఇప్పుడు సినిమా స్కోప్‌లో విడుదల కానుంది.
1972లో సంచలనం
1972లో విడుదలైన ఈ చిత్రం విష్ణువర్ధన్‌కు సూపర్ స్టార్‌డమ్‌ను తెచ్చింది. అప్పటి వరకు రంగ స్థల, కళా చిత్రాల నటుడుగా మాత్రమే పరిచయమైన విష్ణువర్ధన్‌కు ఈ సినిమాలో హీరోగా అవకాశం లభించింది. ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు పుట్టన్న కనగాల్ అప్పట్లో కళా, వాణిజ్య చిత్రాల వారధిగా వ్యవహరిస్తున్నారు. విష్ణువర్ధన్‌నే కాదు ఈ చిత్రంలో ఆయన అంబరీశ్‌ను కూడా పరిచయం చేశారు. ఇక ఆ సినిమాలో చామయ్య మాస్టారుగా నటించిన కేఎస్. అశ్వత్ పేరు ప్రతి ఇంటా ప్రతి ధ్వనించేది. నటీమణులు ఆరతి, జయంతిలకు కూడా ఈ సినిమా ఎంతో పేరు ప్రతిష్టలను తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలోని పాటలు ఈనాటికీ సూపర్ హిట్ అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో ఈ సినిమాను హిందీలో జహ్రీలా ఇన్సాన్, తమిళంలో రాజ నాగం పేరిట రీమేక్ చేశారు.
అభిమానులకు పండుగే
నాగరహావు చిత్రం ఓ కళా ఖండం. దీనిని పునః సృష్టించారు. విష్ణువర్ధన్ అభిమానులకు కచ్చితంగా ఇది పండుగ సీజనే. ఈ సినిమా రజతోత్సవాన్ని జరుపుకుంటుందనే విశ్వాసం నాకుంది.
– భారతి, అలనాటి హీరోయిన్, విష్ణువర్ధన్ సతీమణి
ఓబవ్వ పాత్రను సవాల్‌గా తీసుకున్నా
ఈ సినిమాలో ఓబవ్వ పాత్రను తొలుత కల్పనకు ఇవ్వజూపారు. చిన్న పాత్ర అనే కారణంతో ఆమె తిరస్కరించింది. అనంతరం పుట్టన్న నన్ను అడిగారు. దీనినో సవాలుగా భావించి నేను ఒప్పుకున్నాను. శత్రు సేనలను తుదముట్టించే వీర నారిగా ఓబవ్వను వర్ణిస్తూ రాసిన పాట పుట్టన్న ఊహల్లోంచి పుట్టింది. ఈ పాటను విన్నప్పుడల్లా నాకు కొత్త గీతంగానే అనిపిస్తూ ఉంటుంది.
– జయంతి, అలనాటి నటి, ఓబవ్వ పాత్రధారి
Comments
Please login to add a commentAdd a comment