అందుకే సూర్యను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను : నాగార్జున
‘‘సూర్యను తెలుగు ప్రేక్షకులు మన హీరోలాగానే భావించి ఆదరిస్తున్నారు. తనకు తమిళనాడులో కన్నా ఇక్కడే ఎక్కువ క్రేజ్ ఉందని సూర్య ఇప్పుడే నాతో చెప్పాడు. సూర్య ప్రతి సినిమాకీ పడే కష్టం మామూలుది కాదు’’ అని నాగార్జున అన్నారు. సూర్య - సమంత జంటగా లింగుస్వామి దర్శకత్వంలో రామలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన ‘సికిందర్’ చిత్రం పాటల వేడుక గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.
పాటల సీడీని నాగార్జున ఆవిష్కరించి రాజమౌళికి ఇచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘‘నేనొకసారి సూర్యకు ఫోన్ చేసి చిన్న సహాయం అడిగాను. హెచ్.ఐ.వి. గురించి ప్రచారం చేయమని అడిగితే వెంటనే జ్యోతికతో కలిసి ప్రచారం చేయడానికొచ్చారు. అందుకే సూర్యను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను’’ అని తెలిపారు. సూర్య మాట్లాడుతూ ‘‘చాలారోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. రాజమౌళి గారు ఒప్పుకుంటే బాహుబలిలో చిన్నవేషమైనా వేస్తాను’’ అన్నారు. ఈ వేడుకలో సమంత, లింగుస్వామి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు.