
విజయ్ మరో ఛాన్స్ కొట్టేశాడు
లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ, తరువాత ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పెళ్లిచూపులు సినిమాతో విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్న విజయ్, వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. అర్జున్ రెడ్డి పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విజయ్, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో క్రేజీ ఆఫర్ విజయ్ని వెతుక్కుంటూ వచ్చింది.
అలా మొదలైంది సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన నందినీ రెడ్డి, తరువాత కాస్త తడబడినా ఇటీవల కళ్యాణ వైభోగమే సినిమాతో మరోసారి ఆకట్టుకుంది. అదే జోరులో ఇప్పుడు విజయ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో కూడా కళ్యాణ్ వైభోగమే ఫేం మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తవ్వగానే నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను మొదలు పెడతాడు విజయ్.