ఈ 30 ఏళ్లలో రవితేజ, నాని మాత్రమే వచ్చారు
– ‘దిల్’ రాజు
‘‘ఓ ఎన్టీఆర్, ఓ ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు... తెలుగు చిత్ర పరిశ్రమ పుట్టినప్పుడు ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన వీళ్లందరూ స్వయంకృషితో హీరోలయ్యారు. తర్వాత చిరంజీవి వచ్చి ఇరగదీశారు. ఆ తర్వాత ఈ 30 ఏళ్లలో స్వయంకృషితో హీరోలయింది రవితేజ, నాని మాత్రమే’’ అన్నారు ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు. నాని, కీర్తీ సురేశ్ జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన చిత్రం ‘నేను లోకల్’. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్... అనేది ఉపశీర్షిక. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. శనివారం కాకినాడలో ఆడియో సీడీలను విడుదల చేశారు. నాని మాట్లాడుతూ – ‘‘థియేట్రికల్ ట్రైలర్ చూసి షాకయితే ఎలా? ఫుల్ సినిమా చూస్తే మంచి క్రేజీగా ఉంటుంది.
కాకినాడ స్పెషల్ ఏంటని కీర్తీ సురేశ్ అడిగితే.. ‘కాకినాడ కాజా’ అన్నాను. ‘కాజా అంటే ఏంటి?’ అనడిగింది. ఏం చెప్పాలో తెలియలేదు. కాజా రుచి చూసి ఎక్స్‌పీరియన్స్ చేయాలని చెప్పా. అలాగే, ‘నేను లోకల్’ గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. థియేటర్‌లో బొమ్మ చూసి ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‌తో నన్ను బాగా డ్యాన్స్ చేయించాడు. ‘దిల్’ రాజుగారి గొప్పతనంలో 90 శాతం ఆయన టీమ్ శిరీష్, హర్షిత్, బెక్కం వేణుగోపాల్‌లదే. బయటకు మాత్రం క్రెడిట్ ఈయన కొట్టేస్తారు. వాళ్లందరూ కష్టపడి పనిచేసిన చిత్రమిది. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులందర్నీ డిస్ట్రబ్ చేస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘క్యారెక్టరైజేషన్‌తో కూడిన ‘ఇడియట్’, ‘ఆర్య’ వంటి ప్రేమకథలంటే నాకు ఇష్టం.
ఇది ఆ తరహా చిత్రమే. ఓ ప్రేమకథకి ఒక క్యారెక్టరైజేషన్ యాటిట్యూడ్‌గా ఉంటే... ఎలా ఉంటుందనేది ‘నేను లోకల్’. ‘ఇడియట్’, ‘ఆర్య’ తరహాలో పెద్ద హిట్టవుతుంది. వరుసగా ఐదు సక్సెస్‌లతో జోరు మీదున్న నానీకి సెకండ్ హ్యాట్రిక్ అవుతుంది’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘రాజుగారితో నేను చేసిన ఆరో చిత్రమిది. ఆయనెప్పుడూ వందశాతం గ్యారెంటీ హిట్ చిత్రాలు తీస్తారు. అలాంటి హిట్ చిత్రమిది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్, కాకినాడ మున్సిపల్ కమీషనర్ అలీం భాషా, చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన, నిర్మాత శిరీష్, హీరోయిన్ కీర్తీ సురేశ్, రచయిత ప్రసన్నకుమార్, హీరో నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.