Nannu Dochukunduvate Review, in Telugu | నన్ను దోచుకుందువటే మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

Published Fri, Sep 21 2018 12:15 PM | Last Updated on Fri, Sep 21 2018 4:08 PM

Nannu Dochukunduvate Telugu Movie Review - Sakshi

టైటిల్ : నన్ను దోచుకుందువటే
జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : సుధీర్‌ బాబు, నభ నటాషా, నాజర్‌, తులసి
సంగీతం : అజనీష్‌ లోక్‌నాథ్
దర్శకత్వం : ఆర్‌ఎస్‌ నాయుడు
నిర్మాత : సుధీర్‌ బాబు

సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో సుధీర్‌ బాబు తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ కోసం కష్టపడుతున్నాడు. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన చార్మింగ్ హీరో మల్టీస్టారర్‌ సినిమాలతో పాటు ప్రతినాయక పాత్రలకు కూడా సై అంటున్నాడు. తాజాగా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి తానే స్వయంగా నటిస్తూ నిర్మించిన సినిమా నన్ను దోచుకుందువటే. ఇటీవల సమ్మోహనంతో సూపర్‌ హిట్ కొట్టిన సుధీర్‌ బాబు ఈ సినిమాతో మరో విజయం అందుకున్నాడా..? తొలిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?

కథ ;
కార్తీక్‌ (సుధీర్‌ బాబు) ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో మేనేజర్‌. పని విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండే కార్తీక్‌ అంటే ఆఫీస్‌లో ఎంప్లాయిస్‌ అందరికీ భయం. ఎప్పుడు ఎవరిని ఉద్యోగం నుంచి తీసేస్తాడా అని అంతా భయపడుతూ పనిచేస్తుంటారు. ఎప్పటికైనా కంపెనీలో ప్రమోషన్‌ సాధించి అమెరికా వెళ్లాలని ఆశపడుతుంటాడు కార్తీక్‌. ఆ కలను నిజం చేసుకునేందుకు ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా కష్టపడుతుంటాడు. ఈ సమయంలో కొన్ని పరిస్థితుల కారణంగా కార్తీక్‌ తన తండ్రి(నాజర్‌)తో ఓ అబద్ధం చెప్పాల్సి వస్తుంది. తాను సిరి అనే అమ్మాయిని ప్రేమించానని తండ్రితో చెపుతాడు కార్తీక్‌. దీంతో కార్తీక్‌ తండ్రి, సిరిని కలిసేందుకు హైదరాబాద్‌ వస్తాడు.

తప్పనిసరి పరిస్థితుల్లో షార్ట్‌ ఫిలింస్‌లో నటించే ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ మేఘన(నభ నటేష్‌)ను తన గర్ల్‌ ఫ్రెండ్‌గా నటించేందుకు ఒప్పందం చేసుకుంటారు కార్తీక్‌. కానీ మేఘన మంచితనం, ప్రేమ నచ్చి వారిద్దరి పెళ్లికి కార్తీక్‌ వాళ్ల నాన్న అంగీకరిస్తాడు. అదే సమయంలో కార్తీక్‌కి కూడా మేఘన మీద ఇష్టం కలుగుతుంది. మేఘన కూడా కార్తీక్‌ను ఇష్టపడుతుంది. కానీ మేఘనతో ఎక్కువ సమయం గడుపుతుండటంతో కార్తీక్‌కు ఆఫీస్‌లో ఓ సమస్య ఎదురవుతుంది. దీంతో తన గోల్‌కు దూరమవుతున్నా అన్న భయంతో మేఘనను దూరం పెడతాడు.  అదే సమయంలో మేఘనకు దూరమవుతున్నందుకు బాధపడుతుంటాడు. చివరకు కార్తీక్‌ ఏ నిర్ణయం తీసుకున్నాడు..? గోల్‌ కోసం మేఘనను వదులుకున్నాడా.? లేక మేఘన కోసం గోల్‌ను పక్కన పెట్టాడా? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
సుధీర్‌ బాబు నిర్మాతగా మారేందుకు పర్ఫెక్ట్‌గా తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథను ఎంచుకున్నాడు. తన ఇమేజ్‌కు తగ్గట్టుగా రొమాంటిక్‌ కామెడీతో అలరించాడు. తాను సీరియస్‌గా ఉంటూనే ఆడియన్స్‌ను నవ్వించటంలో సక్సెస్‌ సాధించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మంచి పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా ఆఫీస్‌లో ఎంప్లాయిస్‌లు టార్చర్‌ పెట్టే సీన్స్‌లో సుధీర్‌ నటన సూపర్బ్‌. హీరోయిన్‌ గా పరిచయం నబా నటేష్‌ బబ్లీ గర్ల్‌గా ఆకట్టుకుంది. నభకు తొలి సినిమాలోనే మంచి వేరియేషన్స్‌ చూపించే అవకాశం దక్కింది. నటన పరంగా పరవాలేదనిపించిన నభ, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంది. హీరో తండ్రి పాత్రలో నాజర్‌ ఒదిగిపోయారు. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్‌ సీన్స్‌లో నాజర్‌ నటన కంటతడిపెట్టిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో పృథ్వీ, తులసీ, సుదర్శన్‌ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేషణ ;
సమ్మోహనం సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న సుధీర్‌ బాబు నిర్మాతగా మారేందుకు హార్ట్ టచింగ్‌ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నాడు. లవ్‌, కామెడీ, రొమాన్స్‌, సెంటిమెంట్‌ ఇలా అన్ని ఎమోషన్స్‌ ఉన్న పర్ఫెక్ట్ ప్యాకేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు ఆర్‌ఎస్‌ నాయుడు, నిర్మాత తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి భాగం హీరో ఆఫీస్‌ సీన్స్‌తో పాటు, హీరోయిన్‌తో లవ్‌ సీన్స్‌తో సినిమా ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. అయితే కథనం ఇంకాస్త వేగంగా ఉంటే బాగుండనిపిస్తుంది. ద్వితీయార్థానికి వచ్చే సరికి దర్శకుడు మరింత స్లో అయ్యాడు. ప్రతీ సన్నివేశం నెమ్మదిగా సాగుతూ ఆడియన్స్‌ను ఇబ్బంది పెడుతుంది. ప్రీక్లైమాక్స్‌లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం కూడా సినిమాకు పర్ఫెక్ట్‌ గా సెట్ అయ్యింది. పాటలు పరవాలేదనిపించినా, నేపథ్య సంగీతం సీన్స్‌ను మరింతగా ఎలివేట్ చేసింది. సురేష్‌ సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. ఎడిటింగ్‌ నిరాశపరిచింది. చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగటం సినిమాకు మైనస్‌ అయ్యింది. సుధీర్‌ బాబు సొంత సినిమా కావటంతో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా క్వాలిటీ అవుట్‌పుట్‌ ఇచ్చేందుకు కష్టపడ్డాడు.

ప్లస్‌ పాయింట్స్‌ ;
సుధీర్‌ బాబు క్యారెక్టర్‌
కామెడీ
ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ ;
నెమ్మదిగా సాగే కథనం

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement