జనవరి నుంచి సినిమాల పండుగ
అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఈసారి నవీముంబై వేదిక కానుంది. వచ్చే జనవరి 31 నుంచి ఫిబ్రవరి రెండో వరకు నెరూల్‌లోని డి.వై.పాటిల్ ఆడిటోరియంలో దీనిని నిర్వహిస్తారు. పలు లఘుచిత్రాలు, సినిమాలను ఇందులో ప్రదర్శిస్తారు. భారత్‌తోపాటు ఫ్రాన్స్, అర్జెంటీనా, రొమేనియా, బ్రెజిల్, జర్మనీ, ఇటలీ, తుర్క్‌మిస్థాన్, అమెరికా, నెదర్లాండ్స్, సింగపూర్, ఇజ్రాయెల్, స్పెయిన్ తదితర దేశాల సినిమాలను చూడవచ్చు. ఇదివరకు జరిగిన అంతర్జాతీయ సినిమాల ఉత్సవాల్లో మన దేశానికి చెందిన 170 చిత్రాలకు ప్రవేశం లభించింది.
నెరూల్‌లో మూడురోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి మహేశ్ మాంజ్రేకర్, డింపుల్ కపాడియా, నగేశ్ కుక్నూర్ తదితర దిగ్గజాలతోపాటు, ప్రముఖ నటీనటులు హాజరుకానున్నారు. నవీముంబైలో పలువురు సినీతారలు, కళాకారులు ఉన్నా, ఇంతవరకు ఇక్కడ సినీ ఉత్సవాలు జరగలేదు. నమీముంబై సినీ ప్రేమికులు సినిమా, కాలాఘోడా ఉత్సవాలను వీక్షించేందుకు ముంబైకి రావాల్సి వస్తోంది. అందుకే 2014లో ఇక్కడ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సచిన్ ఖన్నా, అశోక్ పురంగ్, సమీర్ వాలవ్కర్, బిశారద్, డాక్టర్ విక్రం పర్లీకర్ తదితర ప్రముఖులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నవీముంబై అన్ని రంగాల్లోనూ పురోగమిస్తోంది.
ఇక్కడ భారీ భవనాలు,అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఊపందుకుంటున్నాయి. అయినప్పటికీ ఇంతవరకు అంతర్జాతీయస్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగలేదని సచిన్ ఖన్నా అన్నారు. వాషిలో విష్ణుదాస్‌భావే హాలు మినహా సినిమా థియేటర్లుగాని నృత్యశాలలుగాని లేవు. నవీముంబైలో శంకర్ మహదేవన్ వంటి గాయకులు, సినీకళాకారులు ఉంటున్నారు. ఇక్కడ కూడా సాంస్కృతిక వాతావరణం సృష్టించడానికే ఈ ప్రయత్నమని ఖన్నా వివరించారు.