మాంఝీ (ది మౌంటెయిన్ మ్యాన్) సినిమాలో ఓ దృశ్యం
'కొందరుంటారు.. కేవలం ప్రేక్షకులను రంజింపజేసేందుకు జన్మిస్తారు. వందేళ్లకు అలాంటివారు ఒక్కరో ఇద్దరో పుడతాడు. ఈ శతాబ్ధికైతే అలాంటి నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీనే. నా జన్మభూమికి సంబంధించిన కథలో ప్రధాన పాత్రధారిగా ఆయన నటన అసమానం. నా ఒళ్లు పులకించింది' అంటూ మాంఝీ సినిమాపై, ఆ చిత్రంలో ప్రధాన పాత్రధారి నవాజుద్దీన్ సిద్దిఖీపై ప్రశంసలజల్లు కురుపించారు కేంద్ర మాజీ మంత్రి, బాలీవుడ్ అలనాటి హీరో శత్రుఘ్న సిన్హా.
మాఝీ సినిమా చూస్తున్నంతసేపు ఆలోచనలు జన్మభూమి చుట్టూరా తిరిగాయని, తన స్వస్థలంలో బీహార్లో జరిగిన యదార్థగాథను దర్శకుడు కేతన్ మెహతా హృద్యంగా చిత్రీకరించారని సిన్హా అన్నారు. ఈ శతాబ్ధి ఆవిష్కరించిన నటుడంటూ.. మాంఝీ భార్య పాత్రలో రాధికా ఆప్టే నటన ప్రశంసనీయమంటూ శనివారం ఆయన ట్వీట్లు చేశారు.
గయా జిల్లాలోని గెహలూర్ గ్రామానికి చెందిన దశరథ్ మాంఝీ.. ఒంటరిగా ఓ భారీ కొండను తవ్వి గ్రామానికి రహదారిని నిర్మించారు. 'మౌంటెయిన్ మ్యాన్' గా ప్రసిద్ధికెక్కిన ఆయన 2007లో మరణించారు. దశరథ్ మాంఝీ జీవితగాథనే 'మాంఝీ.. ది మౌంటెయిన్ మ్యాన్' సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు కేతన్ మెహతా. నిన్న (ఆగస్టు 21)న విడుదలైన ఈ చిత్రం పలువురి ప్రశంసలతో దూసుకెళుతోంది. దశరథ్ మాంఝీ పాత్రకు నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆయన సతీమణి పగునియా పాత్రకు రాధికా ఆప్టే జీవం పోశారు.