షరతులు వర్తిస్తాయి!
‘మేం చెప్పినట్లు చేయాల్సిందే. కాదు కూడదంటే సినిమా వదులుకోవాల్సిందే’... బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చే నటీనటులకు ఇలాంటి కండీషన్స్ ఉంటాయి. స్టార్ అయ్యాక సీన్ రివర్స్ అవుతుంది. సినిమా ఒప్పుకునే ముందు ‘ఇలాంటివి చేయం’ అని వీళ్లే కండీషన్లు పెడతారు. ప్రస్తుతం నయనతార ఆ స్థాయిలోనే ఉన్నారు. ఈ మధ్య తెలుగు సినిమాలు తగ్గించేసి, వరుసగా తమిళ సినిమాలు ఒప్పు కుంటున్నారు ఈ మలయాళ బ్యూటీ. అది కూడా తన కండీషన్లకు ఒప్పుకునే దర్శక– నిర్మాతలతోనే సినిమాలు చేస్తున్నారామె.
‘సినిమాలో నటిస్తా కానీ, ప్రచార కార్యక్రమాలకు పిలవొద్దు’ అని ఎప్పుడో కండీషన్ పెట్టారు. అందుకే ప్రచార కార్యక్రమాల్లో ఆమె కనిపించరు. తాజాగా మూడు నిబంధనలు పెట్టారట. వాటికి సమ్మతించినవాళ్లకే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని చెన్నై టాక్. ఆ మూడు నిబంధనల విషయానికొస్తే.. లిప్ లాక్ సీన్స్‌లో నటించనన్నది మొదటి కండీషన్, స్నానం చేసే సీన్స్‌కి నో అన్నది రెండోది, చిట్టిపొట్టి దుస్తులు వేసుకోనన్నది మూడో కండీషన్. కథ వినే ముందే నయనతార ఈ నిబంధనలను చెప్పేస్తున్నారట. స్టార్ హీరోయిన్ పెట్టే షరతులను కాదంటారా? అందుకే చిత్తం అని దర్శక–నిర్మాతలు అంటున్నారట.