
సినిమా: కోలీవుడ్‌లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాక్‌గా మారిన చిత్రం దర్బార్. కారణం టాప్ స్టార్స్ కలయికలో రూపొందుతుండడమే కాదు. చాలా ఆసక్తికరమైన అంశాలను చోటుచేసుకున్న చిత్రం దర్బార్. ప్రధాన అంశం ఇది సూపర్‌స్టార్ దర్బార్ కావడం. రెండో అంశం లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించడం. మూడోది సంచలన దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దర్శకుడు కావడం. ఇవి చాలవా? దర్బార్ ప్రత్యేకతకు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ క్రేజీ చిత్రానికి యువ సంగీతదర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండడం మరో విశేషం. ఇటీవలే దర్బార్ చిత్ర షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించారు.ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచా రం ఒక పక్క జరుగుతున్నా, ఆయన చాలా కాలం తరువాత ఒక పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారన్న ప్రచారం మరో పక్క జరుగుతోంది.
కాగా చంద్రముఖి, కుశేలన్ చిత్రాల తరువాత రజనీకాంత్, నయనతార కలిసి నటిస్తున్న చిత్రం దర్బార్. దీంతో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారని అనుకుంటున్న తరుణంలో జంటగా కాదు మరోలా నటిస్తున్నారనే టాక్ తాజాగా స్ప్రెడ్ అయ్యింది. వేరేలా అంటే అసలు ఇందలో రజనీకాంత్‌కు జోడీనే లేదని, తండ్రీ, కూతుళ్ల మధ్య ప్రేమానుబంధాలను ఆవిష్కరించే ఈ చిత్రంలో రజనీకాంత్‌కు కూతురిగా నటి నివేదా థామస్ నటించబోతోందని సమాచారం. మరి నయనతార పాత్రేంటి అనే ఆసక్తి కలగవచ్చు. దర్బార్‌లో రజనీకాంత్, నయనతారల మధ్య సరసాలు ఉండవట. జగడమేనట. అంటే ఇందులో నయనతార ప్రతికథానాయకి పాత్రలో నటిస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో నటించడానికి అంగీకరించిందని, అంతే కాకుండా ఈ చిత్రం కోసం సంచలన నటి నయతార ఏకంగా 60 రోజులు కాల్‌షీట్స్ కేటాయించిందని సమాచారం. ఈ బ్యూటీ చిత్రం అంతా కనిపిస్తుందట. దర్బార్ టైటిల్ విడుదలతోనూ చిత్రంపై హైప్ పెరిగిపోయింది. ఇప్పుడు నయనతార విలనీయం అనగానే దర్బార్ చిత్రంపై మరింత ఆసక్తి కలుగుతోంది కదూ! అయితే ఈ విషయం గురించి స్పష్టమైన ప్రకటన చిత్ర వర్గాల నుంచి రావలసి ఉందన్నది గమనార్హం.