
సంచలన తార నయనతార మరో హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దక్షిణాది అగ్ర కథానాయకిగా వెలిగిపోతున్న నటి నయనతార. ఈ బ్యూటీ ఒక పక్క హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు చేస్తూనే మరో పక్క స్టార్ సీనియర్ హీరోల నుంచి యువ హీరోల వరకూ జత కట్టేస్తోంది. ఇంతకు ముందు కోలమావు కోకిల, ఇమైకా నొడిగళ్ వంటి చిత్రాల సక్సెస్‌లు నయనతార ఖాతాలో పడ్డాయి. అజిత్‌తో జత కట్టిన విశ్వాసం చిత్రం ఇటీవల విడుదలై విజయం సాధించింది.
త్వరలో నయన్ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం ఐరా, శివకార్తికేయన్‌కు జంటగా నటించిన మిస్టర్ లోకల్ చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఇక తెలుగులో చిరంజీవితో నటిస్తున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం సైరా నరసింహారెడ్డి నిర్మాణంలో ఉంది. ఇక అదే హీరోతో మరో చిత్రం కమిట్ అయ్యింది. అదే విధంగా తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌కు నిర్మాణ బాధ్యతలను అప్పగించి తాను నిర్మించే చిత్రంలోనూ నటించనుందనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం విజయ్‌తో అట్లీ దర్శకత్వంలో నటిస్తోంది. కాగా తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపిందన్నది తాజా సమాచారం. పునీత్ రాజ్‌కుమార్ మేనేజర్ కుమార్ నిర్మించనున్న నూతన చిత్రంలో నయనతార నటించబోతోంది. ఈయన నిర్మిస్తున్న తమిళ చిత్రానికి సీ.వేల్మతి దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు అండావ కానోమ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదల కావలసి ఉంది. నయనతార హీరోయిన్‌గా నటించే చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment