
అగ్రనటి నయనతార మరోసారి వార్తల్లోకెక్కింది. సంచలన నటిగానే కాదు లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నటి నయనతార. లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తూ వాటి భారాన్నంతా తన భుజాలపైనే వేసుకుని విజయాల తీరం చేర్చుతున్న సత్తా కలిగిన నటి ఈ బ్యూటీ. అలాగని స్టార్ హీరోల చిత్రాలను పక్కన పెట్టడం లేదు. అయితే ఇలాంటి చిత్రాలతోనే ఈ అమ్మడు అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. మొన్న విజయ్‌తో, అటు మొన్న తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాల్లోనూ నయనతార పాత్ర నామమాత్రంగానే ఉందనే విమర్శలు వచ్చాయి.
ఇకపోతే ఇటీవల రజనీకాంత్‌కు జంటగా నటించిన దర్బార్ చిత్రంలో నయనతార పాత్ర ఇంకా దారుణం అనే విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అందులో రజనీకాంత్‌కు కూతురుగా నటించిన నివేదా థామస్‌కు ఉన్న ప్రాముఖ్యతను కూడా నయనతారకు ఇవ్వలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు దర్బార్ చిత్రంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్‌లా చూపించారనే ఆరోపణలు ఎక్కు పెడుతున్నారు. హీరోయిన్ సెంట్రిక్ కథా పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్న నయనతార అసలు ఇలాంటి చిత్రాలను ఎందుకు ఒప్పుకోవాలనే ప్రశ్నలను అభిమానులు సంధిస్తున్నారు. ఇవి నయనతార దృష్టికి వచ్చింది.
చదవండి: విఘ్నేశ్‌తో నయన్ తెగతెంపులు?
ఇప్పటికే దర్బార్ చిత్రంలో ఆ చిత్ర దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తన పాత్రకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఆసంతృప్తితో ఉన్న నయనతార ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అభిమానుల విమర్శలకు మరింత అశాంతికి గురవుతున్నట్లు సమాచారం. నిజానికి దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌తో నయనతారకు చాలా కాలంగా కోల్డ్ వార్ జరుగుతోంది. గజని చిత్ర సమయంలోనే తన పాత్రను కట్ చేసి నటి ఆసిన్‌కు ప్రాధాన్యతనిచ్చారని విమర్శించింది. అంతే కాదు తాను చేసిన పెద్ద తప్పు గజని చిత్రంలో నటించడమేనని ఆ మధ్య పేర్కొంది. అలాంటిది దాదాపు 12 ఏళ్ల తరువాత ఇటీవల ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రంలో నటించింది.
ఈ చిత్రంలోనూ నయనతారకు అన్యాయం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి నయనతార ఏఆర్.మురుగదాస్‌పై అసంతృప్తితో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు మూక్కూత్తి అమ్మన్, నెట్రికన్ చిత్రాల్లో నటిస్తోంది.ఈ రెండు చిత్రాలు కథానాయకికి ప్రాముఖ్యత కలిగిన కథా చిత్రాలే అన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment