
రజనీకాంత్,నయనతార
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జోడీ కట్టే హీరోయిన్ ఎవరో తెలిసిపోయిందోచ్ అంటున్నాయి చెన్నై కోడంబాక్కం వర్గాలు. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొన్ని రోజులుగా పలువురి పేర్లను పరిశీలించింది చిత్రబృందం. ఇటీవల కీర్తీ సురేష్, కాజల్ అగర్వాల్ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా నయనతార పేరు వినిపిస్తోంది. ఆల్రెడీ నయనతారకు కథ వినిపించారట మురుగదాస్.
కథానాయిక నయనే అని కోలీవుడ్ అంటోంది. నయనతార ఈ చిత్రానికి ఊ కొడితే ‘చంద్రముఖి’ చిత్రం తర్వాత రజనీకాంత్, నయనతార జోడీగా మళ్లీ వెండితెరపై కనిపిస్తారు. అంటే.. 14 ఏళ్ల తర్వాత జంటగా నటించనున్నారన్న మాట. రజనీ ‘శివాజీ’లో ఓ స్పెషల్ సాంగ్, ‘కథానాయకుడు’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు నయనతార. రజనీ తాజా చిత్రం షూటింగ్ మార్చిలో ఆరంభం కానుంది. రజనీ, నయన జోడీ రిపీట్ అవుతుందో లేదో వచ్చే నెలలో తెలిసిపోతుంది.