సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు: ప్రణీత
అసలు తాను సినిమాల్లో నిలబడగలనని ఏమాత్రం అనుకోలేదని సోగకళ్ల సుందరి ప్రణీత చెప్పింది. డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చిన తాను బాగా చదువుకుని ఏదో ఒక రంగంలో స్థిరపడాలనే అనుకున్నాను గానీ, అసలు తాను గానీ తన త్లలిదండ్రులు గానీ అసలు తాను హీరోయిన్ అవుతానని, విజయాలు సాధిస్తానని అనుకోలేదని తెలిపింది. 2010లో 'పోర్కి' అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రణీత.. ఇప్పటికి దాదాపు 12 సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్తో కలిసి చేసిన 'అత్తారింటికి దారేది'తో టాలీవుడ్లో ఆమె దశ తిరిగింది.
తన కెరీర్ సాగుతున్న తీరుపట్ల చాలా సంతృప్తిగా ఉందని, కన్నడ అమ్మాయినైన తాను.. అసలు సినిమాల్లోకి వస్తాననే భావించలేదంది. నాలుగేళ్ల క్రితం అయితే అసలు తాను ఇక్కడకు వస్తానని కూడా ఎవరూఊహించలేదని ప్రణీత తెలిపింది. ఇక్కడన్నీ ప్రయోగాలు చేయడం, అలా వెళ్లిపోవడమేనని వివరించింది. ఎన్టీఆర్ సరసన ఆమె నటించిన రభస చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ పాత్రలో మాస్ ప్రేక్షకులకు కావల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్లు ఉంటాయని చెప్పింది. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడని, ఆయన డాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాల్సిందేనని ప్రణీత చెప్పింది.