
తెరపైకి మరో సినీ అసోసియేషన్
సినీ నిర్మాతలు, థియేటర్ల యజమానులు, పంపిణీదారులు.. మలయాళ నటుడు దిలీప్ నాయకత్వంలో కేరళ ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఈయూఓకే)ను ఏర్పాటు చేశారు.
కొచ్చి: సినీ నిర్మాతలు, థియేటర్ల యజమానులు, పంపిణీదారులు.. మలయాళ నటుడు దిలీప్ నాయకత్వంలో కేరళ ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఈయూఓకే)ను ఏర్పాటు చేశారు. తన అసోసియేషన్‌లో వందకు పైగా థియేటర్ల యజమానులున్నారని, వారు తనకు పూర్తి మద్ధతు ఇచ్చారని దిలీప్ చెప్పారు. గత డిసెంబర్ లో ముఖ్యంగా క్రిస్మస్ సమయంలో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదని ఎఫ్‌ఈయూఓకే అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో కేరళ సినీ రంగానికి తీవ్ర నష్టం వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా నటుడు దిలీప్ గుర్తుచేశారు.
'మలయాళ సినీ పరిశ్రమకు ఒక కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేయాలని కేరళ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్ (కేఎఫ్‌ఈఎఫ్) గత డిసెంబర్‌లో సమ్మె చేశారు. పంపిణీదారులు, ప్రదర్శనకారుల మధ్య వాటాల నిష్పత్తిలో మార్పులు చేయాలన్నదే నిరసన ఉద్దేశం. అప్పుడు చివరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ చొరవతో సమ్మె విరమించాం. ఈ సమ్మె కారణంగా ఒకనెల పాటు 353 క్లాస్ వన్ థియేటర్లల్లో సినిమాలు ప్రదర్శించలేదు. కేరళ ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఇప్పటికైనా ఏర్పడటం శుభపరిణామం. ఇకపై రాష్ట్రంలో థియేటర్లు మూతపడే అవకాశం లేదు. ఈ నూతన అసోసియేషన్‌కు మలయాళ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ తమ మద్ధతు తెలిపారు' అని నటుడు ఎఫ్‌ఈయూఓకే అధ్యక్షుడు దిలీప్ వివరించారు.