ఎంతైనా సై అనే ఎన్నారై
ఆ కుర్రాడు ఎన్నారై. అంటే... నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదట. ఏ వస్తువైనా నచ్చితే ఎంత రేటైనా ఇచ్చి కొనుక్కునే టైప్ అని కొత్త డెఫినిషన్ చెబుతున్నాడు. తండ్రి కష్టపడి బిలియన్స్ సంపాదిస్తే... ఎంతో ఈజీగా ఖర్చు పెట్టే కొడుకన్నమాట. ఇలాంటి కుర్రాడు ఇండియాలో అడుగుపెడతాడు. ఇక్కడ ఈ ఎన్నారై పడిన కష్టాల సమాహారమే ‘శంకరాభరణం’. రచయిత కోన వెంకట్ సమర్పణలో నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎం.వి.వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘కైమ్‌లో కామెడీ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం.
ఇంతకుముందు చాలా క్రైమ్ కామెడీ సినిమాలు వచ్చాయి. వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కోసం సెట్స్ ఉపయోగించలేదు. టాకీ మాత్రమే కాదు... చివరికి పాటలను కూడా సహజమైన లొకేషన్స్‌లో తీశాం. బీహార్‌లోని డేంజరస్ స్పాట్స్‌లో కీలక సన్నివేశాలు చిత్రీక రించాం. ఈ నెల 30న పాటలను, దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని కోన వెంకట్ తెలిపారు. ‘‘కోన వెంకట్ మంచి కథ ఇచ్చారు.
ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, సహ-నిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరరావ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి.