
పవన్ వద్దన్న దర్శకుడితో నితిన్
అ.. ఆ... సినిమా సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నాడు యంగ్ హీరో నితిన్. ఈ మంగళవారంతో 14 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న నితిన్ అదే సమయంలో 40 కోట్ల క్లబ్లో కూడా చేరటంతో మరింత ఆనందంగా ఉన్నాడు. అదే సమయంలో తన నెక్ట్స్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం అ ఆ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో ఇంత వరకు తన తదుపరి ప్రాజెక్ట్ ప్రకటించలేదు.
అయితే క్లాస్ హీరోగా మంచి ఇమేజ్ రావటంతో తన తదుపరి సినిమాతో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయాలని భావిస్తున్నాడట. అందుకే మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సంపత్ నందితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఏమైంది ఈ వేళ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంపత్ రెండో సినిమానే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించటంతో పవన్ కళ్యాణ్ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు.
అయితే పవన్ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్ కావటంతో వెంటనే రవితేజ హీరోగా బెంగాల్ టైగర్ను తెరకెక్కించి మరోసారి విజయం సాధించాడు. మాస్ సినిమాలతో ఆకట్టుకుంటున్న సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేయడానికి నితిన్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. తన అభిమాన నటుడు పవన్ కాదన్న దర్శకుడితో నితిన్ నిజంగానే సినిమా చేస్తాడా..? లేక అన్నీ రూమర్స్ అంటూ కొట్టి పారేస్తాడా..? చూడాలి.