
పాట్నా: ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి సినిమా విడుదలపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేయడంతో ఊరట లభించిందని భావించిన పద్మావతి యూనిట్‌కు మరో రాష్ట్రం ఝలక్ ఇచ్చింది. ఆ మూవీ దర్శక, నిర్మాతలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను సైతం న్యాయస్థానం కొట్టివేసిన రోజే పద్మావతి ప్రదర్శనను అడ్డుకుంటూ బిహార్ రాష్ట్రం నిషేధం విధించింది. పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు ఇదివరకే పద్మావతి మూవీపై నిషేధం విధించగా.. ఈ చిత్రాన్ని బిహార్‌లోనూ ప్రదర్శించొద్దని సీఎం నితీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
రాణి పద్మావతికి సంబంధించిన అంశాలను తప్పుగా చిత్రీకరించారంటూ కర్ణిసేన గత కొన్నిరోజులుగా సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ ధర్నాలు, నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. రాజ్‌పుత్‌కు చెందిన కొన్ని వర్గాలు దీపికా పదుకొణె, దర్శకుడు భన్సాలీల తలలు తెస్తే రూ. 10 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్‌పుత్ వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ బబ్లూ లేఖ రాయడంతో సీఎం నితీశ్ సంబంధిత అధికారులకు ఈ ఆదేశాలు జారీచేశారు. పద్మావతి దర్శకుడు భన్సాలీ మూవీ వివాదంపై వివరణ ఇచ్చుకుని, వివాదం సద్దుమణిగేలా చేసే వరకు బిహార్‌లో మూవీపై నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు. మరోవైపు పద్మావతి మూవీ డిసెంబర్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment