
అన్నయ్యతో విభేదాలు లేవు: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తనకు, తన అన్నయ్యకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో పోటీ అంశాలపై త్వరలోనే స్పందిస్తానని ప్రకటించారు. ఈ నెల రెండో వారంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తానన్నాడు. ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2, ఓ మైగాడ్ రీమేక్ సినిమాల్లో బిజీగా ఉన్నట్టు వెల్లడించారు.
పవన్, చిరంజీవి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్టు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవితో దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్, నాగబాబు టీడీపీలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని వారిద్దరూ అప్పట్లో ఖండించారు. అయితే చిరంజీవి, పవన్ మధ్య విభేదాలు పూర్తిగా సమసిపోలేదని మరోసారి రుజువయింది.
నాగబాబు తనయుడు వరుణ్తేజ సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన చిరు, పవన్ ఎడమొహం, పెడమొహంగా వ్యవహరించడంతో మెగా బ్రదర్స్ మధ్య దూరం కొనసాగుతోందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తన అన్నయ్యతో విభేదాలు లేవని పవన్ కళ్యాణ్ నేడు ప్రకటన విడుదల చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ప్రెస్ మీట్తో ఆయన తెర దించనున్నారు.