
ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదు: జూనియర్ ఎన్టీఆర్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు ఏమాత్రం లేదని టాలీవుడ్ హీరో, సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ లాంటి యుగపురుషుడు మళ్లీ పుట్టబోరని ఆయన అన్నారు.
నందమూరి తారక రామారావు 18వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు హరికృష్ణ, రామకృష్ణ, జయకృష్ణ, మనవలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగానే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు.
ఎన్టీఆర్ కొడుకుగా పుట్టడం తన అదృష్టమని హరికృష్ణ అన్నారు. ఒక వ్యక్తిగా, సినిమా నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని, తెలుగుజాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టారని ఆయన చెప్పారు. అయితే, కొందరు తమ స్వార్థం కోసం తెలుగువారి మధ్య చిచ్చు పెడుతున్నారని ఈ సందర్భంగా హరికృష్ణ మండిపడ్డారు.