ఈ సారి రాజకీయాలకు దూరంగా.. | No Political Story in Vijay Next Movie | Sakshi
Sakshi News home page

ఈ సారి రాజకీయాలకు దూరంగా..

Published Fri, Mar 15 2019 12:52 PM | Last Updated on Fri, Mar 15 2019 12:52 PM

No Political Story in Vijay Next Movie - Sakshi

సినిమా: ఈ సారి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానన్నారు నటుడు విజయ్‌. ఏంటి? ఏదేదో ఊహించేసుకుంటున్నారా? రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్లో మీరలా ఊహించుకోవడంలో తప్పులేదుగానీ, ఇక్కడ విషయం మాత్రం అది కాదు. విజయ్‌ మాట్లాడుతున్నది మాత్రం తన సినిమా గురించే. ఇటీవల ఈయన నటించిన మెర్శల్, సర్కార్‌ వంటివి రాజకీయాలను టచ్‌ చేసినవే కావడంతో విజయ్‌ తాజా చిత్రంపై చాలా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో తెరి, మెర్శల్‌ చిత్రాలు తెరకెక్కి విజయం సాధించాయి. దీంతో ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడడం సహజం.

అదే విధంగా విజయ్‌ చిత్రం అనగానే రాజకీయ అంశాలు ఉంటాయని ఊహించుకోవడం సహజమే. అందుకే వీటన్నిటికీ క్లారిటీ ఇచ్చే విధంగా నటుడు విజయ్‌ తన తాజా చిత్రం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ, అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం చాలా జాలీగా, అదే సమయంలో చాలా కలర్‌ఫుల్‌గా, అందరికీ నచ్చే విధంగా  ఉంటుందని చెప్పారు. తన గత చిత్రాలు కాస్త సీరియస్‌గా, చిత్ర క్‌లైమాక్స్‌లో రాజకీయాలకు సంబంధించిన అంశాలు, అదే విధంగా మీడియా ముందు మాట్లాడడం వంటివి చోటుచేసుకున్నాయన్నారు. ఇలాంటి సన్నివేశాల్లో నటించడం తనకే బోర్‌ అనిపిస్తోందన్నారు. అందుకే అలాంటి కథా చిత్రాలకు భిన్నంగా, రాజకీయాలకు దూరంగా ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో జాలీగా, కలర్‌ఫుల్‌గా ఉండే కథా చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో విజయ్‌ అభిమానులు భలే ఖుషీ అవుతున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో విజయ్‌కు జంటగా అగ్రనటి నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌లో ఈ బ్యూటీ ఇటీవలనే పాల్గొంది. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement