
తమిళ్‌కు నో
నటి ప్రియమణి తమిళచిత్ర పరిశ్రమపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. కారాణాలేమయినా ఈ అమ్మడు తమిళచిత్ర అవకాశాలను నిరాకరిస్తోందట. కోలీవుడ్‌లో తొలి రోజుల్లోనే పరుత్తివీరన్ చిత్రంలో గ్రామీణ యువతి పాత్రలో ఒదిగి పోయి ఆ పాత్రకు గానూ జాతీయ అవార్డును గెలుచుకున్న నటి ప్రియమణి.
అలాంటిది తమిళ చిత్రాలకు నో చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కన్నడంలో అతిథి పాత్రలకు కూడా ఓకే అంటున్న ఈ మలయాళ భామ తమిళంలో అవకాశాలను తిరస్కరించడానికి కారణం ఏమిటో ఎవరికీ అర్థం కావడంలేదు. పరుత్తివీరన్ చిత్రం తరువాత గ్లామర్ వైపు మొగ్గు చూపిన ఈ బ్యూటీకి ఇలాంటి మరిన్ని అవకాశాలు రాలేదు. దీంతో టాలీవుడ్‌పై కన్నేసింది. అక్కడ అందాలారబోతలో విజృంభించింది. దీంతో కొందరు ప్రముఖ హీరోలను ఆకర్షించింది కూడా.
అయినా అది కొన్ని చిత్రాలకే పరిమితం అవ్వడంతో మళ్లీ మాతృభాషపై దృష్టి సారించింది. ప్రస్తుతం కన్నడ చిత్రంలో ఒక గెస్ట్ రోల్‌ను పోషించడానికి రెడీ అయ్యిందట. ఇందుకు కారణం కూడా సిద్ధం చేసుకుంది. కన్నడ దర్శకుడు పట్నాయక్ తనకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చింది. అందువల్లే ఆయన దర్శకత్వంలో గెస్ట్ రోల్ చేయడానికి అంగీకరించానంది. అంతేకాకుండా తానింత వరకు సీబీఐ అధికారిగా నటించలేదని ఈ చిత్రంలో అలాంటి పాత్ర కావడంతో నటిస్తున్నట్లు చెప్పింది. తెలుగులో నటించే విషయమై కథలు వింటున్నట్లు తెలిపింది.
అదేవిధంగా కన్నడ, మలయాళ భాషల్లో బిజిగా ఉండటం వల్ల ఇతర భాషల చిత్రాలను అంగీకరించడంలేదని ప్రియమణి తెలిపింది.