చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తలైవీ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో జయలలితకు సంబంధించిన ప్రధానపాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే జయలలిత జీవితంలో ముఖ్య వ్యక్తి శశికళ. ఆమె పాత్ర కోసం నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణిని ఎంపిక చేసినట్టు సమాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కంగనా ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో కంగనా లుక్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. తలైవీ చిత్రానికి హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ మేకప్‌మెన్ జోసన్ కాలిన్స్ పని చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాను విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో జయలలిత సినీ పరిశ్రమకి రాకముందు, సినీ పరిశ్రమలో మంచి నటిగా రాణిస్తున్న సమయంలో, రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలా నాలుగు గెటప్స్‌లో కంగనా సందడి చేయనున్నారు. ఈ చిత్రం కోసం కంగనా రూ.20 కోట్లు పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా.. ఈ సినిమాలో అరవిందస్వామి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, లెజెండరీ ఎంజీ రామచంద్రన్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే మరో లెజెండరీ పొలిటీషియన్, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment