నేనా... విలన్‌గానా : వెంకటేశ్
వెంకటేశ్ లవ్, యాక్షన్, మాస్ తరహా సినిమాలు ఎన్ని చేసినా, ‘కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్’ అనే ఇమేజ్ ఆయనకు స్థిరపడిపోయింది. తాజాగా ఆయన చేసిన ‘దృశ్యం’ థ్రిల్లర్ మిళితమైన పక్కా కుటుంబ కథ. ఈ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఇలాంటి కొత్త తరహా కథలు ఎప్పుడో కానీ దొరకవు. అందుకే ఈ అవకాశాన్ని వదిలిపెట్టలేదు’’ అంటోన్న వెంకటేశ్‌తో ‘సాక్షి’ జరిపిన సంభాషణ.
టాప్ టూ బాటమ్ బ్రాండెడ్ దుస్తులు, చెప్పులూ వేసుకునే మీరు రాంబాబు (‘దృశ్యం’లో వెంకటేశ్ పాత్ర పేరు) కోసం కాటన్ ప్యాంట్లు, షర్టులు వేసుకోవడం ఎలా అనిపించింది?
నేనెక్కువగా జీన్స్ ప్యాంట్లు వేసుకుంటాను. ఈ మధ్య కాలంలో అయితే దాదాపు అవే వాడుతున్నాను. కాటన్ ప్యాంట్లేసుకుని చాలా రోజులైపోయింది. చివరిసారిగా కాటన్ ప్యాంట్స్ ఎప్పుడు వేసుకున్నానో గుర్తు లేదు. కాబట్టి, నాకు నేనే కొత్తగా అనిపించాను. ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుందనే నమ్మకంతోనే ఈ పాత్ర చేశాను.
మలయాళ ‘దృశ్యం’లో మీకు ఏయే సన్నివేశాలు నచ్చి, ఈ రీమేక్ అంగీకరించారు?
రాంబాబుది ఆనందమైన కుటుంబం. ఆ ఆనందాన్ని ఓ పది, పదిహేను నిమిషాలు ఆస్వాదిస్తాం. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలకు కనురెప్ప వాల్చడం మర్చిపోతాం. ఇది కథ కాదు.. నిజంగా జరుగుతుందేమో అనుకుంటాం. మొత్తం కథ నచ్చి, ఈ సినిమా ఒప్పుకున్నాను.
టీనేజ్ అమ్మాయికి తండ్రిగా చేయాలంటే వెంటనే ‘ఓకే’ చెప్పేశారా?
ఈ కథ కాకుండా వేరే కథల్లో టీనేజ్ గాళ్‌కి ఫాదర్ అంటే అంత బాగుండదు. రెగ్యులర్ సినిమాల్లో నేనీ పాత్ర చేస్తే ‘అవసరమా నీకు’ అనడానికి చాలామంది ఉన్నారు. కానీ, ఈ సినిమా వరకూ ఈ పాత్ర వంద శాతం బాగుంటుంది. ఒకవేళ రొటీన్ సినిమాలైతే, ఇలా టీనేజ్ గాళ్ ఫాదర్ పాత్రలను చాలా వరకు తప్పించడానికే ప్రయత్నిస్తాను. ఈ సినిమాలో నేను ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. ‘గోపాల.. గోపాల’లో కూడా నాకో కొడుకు ఉంటాడు. తండ్రి పాత్రలు చేయడం నాకేం అభ్యంతరం కాదు. కానీ, అన్ని సినిమాల్లోనూ నాకు పిల్లలుండాలని అనుకోవడం లేదు (నవ్వుతూ).
మీరిప్పటివరకు ఎన్నో రీమేక్ చిత్రాల్లో నటించినా, ఓ మలయాళ రీమేక్‌లో నటించడం మాత్రం ఇదే తొలిసారి కదా?
అవును. అది కూడా మోహన్‌లాల్ వంటి మంచి నటుడు చేసిన పాత్ర చేయడం అంటే అంత సులువు కాదు. మోహన్‌లాల్ అద్భుతమైన నటుడు. ఆయన బాడీ లాంగ్వేజ్, వాయిస్ అన్నీ బాగుంటాయి. ఆయన చేసిన ఇతర సినిమాలైతే నేను ఒప్పుకునేవాణ్ణి కాదు. కానీ, ఈ సినిమాలో మోహన్‌లాల్ చేసిన పాత్రలో నేను బ్రహ్మాండంగా ఒదిగిపోగలుగుతాననే నమ్మకం కలిగింది. అందుకే చేశాను. ఈ చిత్రం చేయాలనుకున్న తర్వాత మోహన్‌లాల్‌తో మాట్లాడాను. ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
తెలుగు ‘దృశ్యం’లో మీరైతే బాగుంటుందని కమల్‌హాసన్ అన్నారట..?
కమల్‌హసన్ చేసినన్ని పాత్రలు ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేదు. ఆయన నా పేరు సూచించడం ఆనందమే. ఆ మధ్య గోవా ఫిలిం ఫెస్టివల్‌లో ఆయన్ను కలిశాను. కమల్ ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. అవన్నీ తీసుకోదగ్గవే.
మీరు కూడా ఆడపిల్లల తండ్రి కాబట్టే, ఈ సినిమాలో బాగా లీనం కాగలిగారా?
అలా ఏం కాదు. ఈ కథను ఎవరైనా సరే ఓన్ చేసుకుంటారు. మన కుటుంబాల్లో ఎవరికైనా ఇలాంటి సంఘటనలు జరగొచ్చు. ఏ మగాడైనా తన భార్యా, పిల్లల రక్షణ గురించి ఆలోచిస్తాడు. ఈ సినిమాలో తన కుటుంబానికి వచ్చిన సమస్యను రాంబాబు ఎలా పరిష్కరించుకున్నాడు? అనేది చాలా టచింగ్‌గా ఉంటుంది.
ఈ సినిమా చూసిన తర్వాత రాంబాబులా మంచి మొగుడిలా, మంచి మగాడిలా ఉండాలని మగాళ్లందరూ అనుకుంటారని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. మరి.. నిజజీవితంలో మీ గురించి?
సందేహం లేదు. రాంబాబు మంచి భర్త, తండ్రి. నిజజీవితంలో ఓ భర్తగా, తండ్రిగా నేనెలా? అనే విషయాన్ని నా కన్నా, నా భార్యాపిల్లలు చెబితే బాగుంటుంది. కానీ, ఒకటి చెప్పగలను. నేను ఆడవాళ్లను గౌరవిస్తాను. పిల్లలంటే ఇష్టం. కాలేజ్ డేస్ అప్పుడు అమ్మాయిలను ఎవరైనా ఏడిపిస్తే, ఎదిరించేవాణ్ణి.
సినిమాలో మీ భార్య మీనా, పిల్లలు రెచ్చిపోయి షాపింగ్ చేస్తుంటే మీరు డబ్బులు ఖర్చయిపోతున్నాయని ఫీల్ కావడం ట్రైలర్‌లో కనిపించింది.. రియల్‌గా కూడా అలా జాగ్రత్తపడిన సందర్భాలున్నాయా?
చాలా ఉన్నాయి. చదువుకునే రోజుల్లో నాక్కొంత పాకెట్ మనీ ఇచ్చేవారు. అప్పుడు ఐస్‌క్రీమ్‌కి ఇంత, చాక్లెట్స్‌కి ఇంత, సినిమా చూడ్డానికి ఇంత, బస్ టిక్కెట్‌కి ఇంత కావాలి.. అని లెక్కలేసుకుని ఖర్చుపెట్టుకునేవాణ్ణి.
మంచి ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న మీకు, ఒకవేళ విలన్‌గా చేసే అవకాశం వస్తే అంగీకరిస్తారా?
నేనా విలన్‌గానా? అసలు డెరైక్టర్స్ అలాంటి పాత్రతో నా దగ్గరకు వస్తారా? ఒకవేళ వచ్చినా ప్రేక్షకులు చూస్తారా?
హిందీ ‘ఓ మై గాడ్’ ఆధారంగా చేస్తున్న ‘గోపాల.. గోపాల’ ఏ దశలో ఉంది?
ఒక షెడ్యూల్ పూర్తయ్యింది. తదుపరి షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్ జాయిన్ అవుతాడు.
దేవుడంటే నమ్మకం ఉన్న మీరు.. ఈ సినిమాలో దేవుడిపై కేసు పెట్టడం గురించి...?
అందుకే ఈ సినిమా నాకు సవాల్ లాంటిది. ఇది చాలా మంచి చిత్రం. సంభాషణలు అద్భుతంగా కుదిరాయి. ఈ కథాంశం ఏ భాషలో అయినా బాగుంటుంది.
మారుతితో ‘రాధ’ సినిమా ఏమైంది?
అది లేనట్లే.
అంటే.. భవిష్యత్తులో మారుతితో ఉంటుందా?
ఈ కథ కుదరలేదు. ఒకవేళ మంచి కథతో వస్తే అప్పుడే చేస్తా.
ఏయన్నార్ కుటుంబంలో మూడు తరాల నటులు నటించినట్లుగా, మీ దగ్గుబాటి కుటుంబం సినిమా చేసే అవకాశం ఉందా?
మాకు చేయాలనే ఉంది. కానీ, ఇప్పటివరకు వచ్చిన కథలన్నీ మామూలుగా ఉన్నాయి. ‘మనం’ కథ అంతకు ముందు చాలామందికి వినిపించారట. చివరికి అక్కినేని గారి కుటుంబానికి సెట్ అయ్యింది. అది అద్భుతమైన సినిమా.