మిస్ వరల్డ్ తర్వాతే బాలీవుడ్.. | Now Miss World and Bollywood on Koyal Rana's wish list | Sakshi
Sakshi News home page

మిస్ వరల్డ్ తర్వాతే బాలీవుడ్..

Published Sun, Apr 6 2014 10:42 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మిస్ వరల్డ్ తర్వాతే బాలీవుడ్.. - Sakshi

మిస్ వరల్డ్ తర్వాతే బాలీవుడ్..

ముంబై: ‘నాకేం కావాలో నాకు బాగా తెలుసు.. నా తదుపరి టార్గెట్ మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకోవడం.. ఈ మధ్యలో బాలీవుడ్ నుంచి మంచి అవకాశాలు వచ్చినా వాటిపై దృష్టిపెట్టను..’ అని స్పష్టం చేసింది ఫెమినా మిస్ ఇండియా -2014  టైటిల్ గెలుచుకున్న  జైపూర్ అందాలభామ కోయల్ రాణా. ‘నేను ప్రపంచంలోనే అత్యున్నతస్థానంలో ఉన్నానని భావిస్తున్నా. నాకు జీవితంలో ఏం కావాలనేది స్పష్టమైన అవగాహన ఉంది.. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తర్వాత ఇప్పుడు నా దృష్టి మొత్తం మిస్ వరల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంపైనే కేంద్రీకరించా..’ అని ఆమె పేర్కొన్నారు. గత శనివారం జరిగిన 51వ ఎడిషన్ ఫెమినా మిస్ ఇండియా-2014 అందాల పోటీల్లో ఈ జైపూర్ భామ కిరీటాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 
 కాగా, తనకు మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఆదర్శమని రాణా తెలిపింది. ‘మెదడును ఉపయోగించే అందాల సుందరీమణిగా సుస్మితా సేన్‌ను చెప్పవచ్చు. 
 
ఆమె మిస్ ఇండియా, మిస్ యూనివర్స్‌గా కీర్తి గడించినా అంతకన్న ఎక్కువ సమాజ సేవ చేయడంలో ముందుంది. ఆమె జీవితాన్ని నేను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా..’ అని కోయల్ రాణా వివరించింది.‘నా జీవితంలో ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉంది.. చాలా విజయాలను సొంతం చేసుకోవడానికి ఇంకా కష్టపడాల్సి ఉంది..’ అని ఆమె అంది. సినిమాల్లో నటించడం గురించి ప్రశ్నిస్తే ‘ప్రస్తుతం నా దృష్టి మొత్తం మిస్ వరల్డ్ టైటిల్ పైనే ఉంది.. భవిష్యత్తులో బాలీవుడ్‌లో  మంచి అవకాశాలు వస్తే నటిస్తానేమో.. ఇప్పుడే ఆ విషయాలు చెప్పేంత వయస్సు, అనుభవం నాకు లేవు..’ అని ముద్దుగా చెప్పింది. జైపూర్‌లో పుట్టా.. ఢిల్లీలో పెరిగానని, మిస్ ఇండియా కన్నా తనకు చదువు ఎక్కువ ఇష్టమని కోయల్ వివరించింది. మున్ముందు తాను ఇంకా చదువుకుంటానని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో డిగ్రీ చదువుతున్నానని చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement