NTR Mahanayakudu Review, In Telugu | ‘యన్‌టిఆర్‌ మహానాయకుడు’ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

‘యన్‌టిఆర్‌ మహానాయకుడు’ మూవీ రివ్యూ

Published Thu, Feb 21 2019 11:04 PM | Last Updated on Fri, Feb 22 2019 2:33 PM

NTR Mahanayakudu Telugu Movie Review - Sakshi

టైటిల్ : యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు
జానర్ : పొలిటికల్‌ డ్రామా
తారాగణం : నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి రానా, విద్యాబాలన్‌, సచిన్‌ కేద్కర్‌ తదితరులు
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
దర్శకత్వం : క్రిష్‌ జాగర్లమూడి
నిర్మాత : బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి నటించిన ‘యన్‌టిఆర్‌ కథానాయకుడు’ దారుణ పరాజయం కావడంతో.. రెండో భాగం ‘మహానాయకుడు’పై ఆ ప్రభావం పడింది. భారీ తారాగణం, టాప్‌ టెక్నీషియన్స్‌ ఉన్నా.. ఈ మూవీపై అంచనాలు మాత్రం క్రియేట్‌ చేయలేకపోయారు. ప్రస్తుతం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌, అడ్వాన్స్‌ బుకింగ్స్‌ను పరిశీలిస్తే .. ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో సైతం ఆసక్తి లేనట్టు కనబడుతోంది. మరి ఇలాంటి పరిస్థితిలో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యన్‌టిఆర్‌ మహానాయకుడు’ ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ 
మొదటి భాగంలో చూపించని ఎన్టీఆర్‌ బాల్యం, బసవ తారకంతో వివాహాన్ని చూపిస్తూ.. మళ్లీ కథానాయకుడు సినిమాను గుర్తు చేస్తూ.. తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టే చోట మొదటి భాగాన్ని ముగించగా అక్కడి నుంచే మహానాయకుడు మొదలవుతుంది. (సాక్షి రివ్యూస్‌) తన పార్టీకి సంబంధించిన చిహ్నాన్ని రూపొందిస్తూ.. రెండో భాగం ప్రారంభం కాగా.. తన రాజకీయ ప్రచారం.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం.. నాదెండ్ల భాస్కర్‌ రావు ఘటనతో ఫస్ట్‌ హాఫ్‌ను ముగించగా.. ఎన్టీఆర్‌ ఢిల్లీ వెళ్లడం.. రాష్ట్రపతిని కలవడం.. మళ్లీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం.. ఇక చివరగా బసవ తారకం మరణించడంతో.. సినిమాను ముగించేశారు.

నటీనటులు
తొలిభాగంలోనే ఎన్టీఆర్‌గా నటించిన బాలయ్యపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ సారి పూర్తి రాజకీయ నేపథ్యంలో సాగగా.. బాలయ్య వయసుకు తగ్గ పాత్ర కావడంతో.. ‘ఎన్టీఆర్‌’లా బాగానే నటించాడు. మరీ ఎన్టీఆర్‌ను మరిపించేంతగా కాకపోయినా.. అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను అవమానపరిచే సన్నివేశాల్లో బాలయ్య తన నటనతో మెప్పించాడు. (సాక్షి రివ్యూస్‌) ఇక బాలయ్య తరువాత చెప్పుకోవాల్సిన పాత్ర విద్యాబాలన్‌దే అవుతుంది. బసవతారకం పాత్రలో ఆమె నటించిన తీరు కథానాయకుడు సినిమాలో చూసేశాం. మహానాయకుడులో కూడా బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ మరోసారి మెప్పించారు. ఇక వీరిద్దరిని మినహాయిస్తే.. చంద్రబాబు పాత్రలో రానా, నాదెండ్ల భాస్కర్‌రావు పాత్రలో సచిన్‌ కేద్కర్‌లు ఆకట్టుకున్నారు. మిగతా పాత్రలు తమ పరిధి మేరకు నటించారు. 

విశ్లేషణ
యన్‌టిఆర్‌ సినీ జీవితం పూల పాన్పులా గడిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన రాజకీయ అరంగేట్రం.. సాధించిన విజయం.. అటుపై నాదేండ్ల వ్యవహారం.. మళ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి రావడం.. మళ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం.. అటుపై ‘వెన్నుపోటు’  ఘటన చోటుచేసుకోవడం.. ఇక చివరి క్షణాల్లో ఎన్టీఆర్‌ క్షోభ పడటం.. ఎన్టీఆర్‌ స్వర్గస్తులు కావడం.. స్థూలంగా చెప్పాలంటే ఇదే ఎన్టీఆర్‌ జీవితం. (సాక్షి రివ్యూస్‌) అయితే ఇవన్నీ ఉన్నది ఉన్నట్లు తీసే సాహసం బాలయ్య ఎలాగూ చేయలేడు. అలా చేయలేకే బయోపిక్‌ ముసుగులో తమకు నచ్చింది.. మెచ్చింది మాత్రమే తీసి.. కథానాయకుడుతో చేతులు కాల్చుకున్నారు. ఇక ఎన్టీఆర్‌ రాజ​కీయ జీవితానికి సంబంధించిన మహానాయకుడు మీద సగటు ప్రేక్షకుడికి కూడా ఎలాంటి ఆసక్తి  లేదంటేనే.. ఈ చిత్రాన్ని బాలయ్య ఏవిధంగా తీసి ఉంటాడో ఓ అంచనాకు వచ్చేశారని అర్థమవుతోంది. 

అందరూ అనుకున్నట్లే.. ఎన్టీఆర్‌ జీవితాన్ని మొత్తం చూపించకుండా అసంపూర్తిగా వదిలేశారు. బసవతారకం పాత్రతో సినిమాను చెప్పిస్తూ.. ఆమె మరణంతో మహానాయకుడును ముగించారు. అయితే ఎన్టీఆర్‌ చివరి ఘట్టం జోలికి పోకుండా నాదెండ్లను విలన్‌గా చూపెట్టి మహానాయకుడు సినిమాను చుట్టేశారు. నాదెండ్ల వ్యవహారంలో బాబు కీలకపాత్ర పోషించి ప్రజాస్వామ్యాన్ని, ఎన్టీఆర్‌ను, టీడీపీని రక్షించినట్లు.. చంద్రబాబే అసలు హీరో అన్నట్లు చూపించారు. ఇక సినిమాలో అక్కడక్కడా భావోద్వేగాలు బాగానే పండాయి. (సాక్షి రివ్యూస్‌) కీరవాణి తన నేపథ్య సంగీతంతోనే కొన్ని సన్నివేశాలు ఎలివేట్‌ చేశారు. మాటల రచయితగా సాయి మాధమ్‌ బుర్రా మరోసారి తన కలానికి పదును పెట్టారు. దారి కొత్తదే అయినా.. ఒక్కసారి అడుగు వేశాక.. దారి మన కిందే ఉండాలిగా లాంటి మాటలు ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్ని బాగానే కుదిరాయి. ప్రస్తుతం చంద్రబాబు వెన్నుపోటు అంశంపై చర్చలు జరుగుతుండటంతో.. మహానాయకుడులో చూపిన కథ ప్రేక్షకులను అంతగా మెప్పించడం కష్టమే. అయితే ఎన్టీఆర్‌ మిగిలిన జీవితాన్ని కూడా తెలుసుకోవాలంటే.. వర్మ తీసిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను చూడాల్సిందే. మహానాయకుడులో నాదెండ్ల వ్యవహారం కీ రోల్‌ కాగా.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో చంద్రబాబు వెన్నుపోటు అంశం కీలకం కానుంది. ఈ మూడు చిత్రాలతో తెరపై ఎన్టీఆర్‌ జీవితగాథ సంపూర్ణంగా చూసినట్టవుతుంది. 

ప్లస్‌ పాయింట్స్‌ :
కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌
సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ :
సెకండాఫ్‌ సాగదీత
అసంపూర్తి కథ

బండ కళ్యాణ్‌, ఇంటర్‌నెట్‌ డెస్క్‌

చదవండి : ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు‌’ మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement