టైటిల్ : యన్.టి.ఆర్ కథానాయకుడు
జానర్ : బయోపిక్
తారాగణం : బాలకృష్ణ, విద్యాబాలన్, దగ్గుబాటి రాజా, కల్యాణ్ రామ్, రానా, సుమంత్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి
నిర్మాత : బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి సినిమా ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు మరో మహానటుడి జీవిత కథ వెండితెర మీద అలంరించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు సినీరంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన నందమూరి తారక రామారావు జీవితకథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తండ్రి పాత్రలో నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న యన్.టి.ఆర్ కథానాయకుడు, ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో బాలయ్య తొలిసారిగా నిర్మాతగానూ మారుతుండటంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలు యన్.టి.ఆర్ కథానాయకుడు అందుకుందా.? తండ్రి పాత్రలో బాలయ్య మెప్పించాడా..? క్రిష్ దర్శకుడిగా మరోసారి సత్తా చాటాడా..?
కథ :
ఎన్టీఆర్ సినీ జీవితం తెరచిన పుస్తకం అందుకే దర్శకుడు దశాబ్దాలుగా జనాలకు తెలిసిన విషయాలే సినిమాటిక్‌గా వెండితెర మీద చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ కు ఆయన భార్యతో ఉన్న అనుబంధం ఆమె మాటకు ఎంత విలువ ఇస్తారన్న విషయాలను చూపించారు. ఎన్టీఆర్ బాల్యానికి సంబంధించిన అంశాల జోలికి పోకుండా డైరెక్ట్‌గా సినీ జీవితంతో కథను మొదలుపెట్టాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న బసవ రామ తారకం(విద్యాబాలన్) పరిచయంతో సినిమా ప్రారంభమవుతుంది. ఆమె ఎన్టీఆర్ ఆల్బమ్‌ను చూస్తుండగా అసలు కథ స్టార్ట్ అవుతుంది.
రామారావు (బాలకృష్ణ) రిజిస్టర్ ఆఫీస్‌లో మంచి ఉద్యోగం వచ్చినా అక్కడి పరిస్థితులు లంచాలకు అలవాటు పడిన అక్కడి ఉద్యోగుల పద్దతులు నచ్చక చేరిన మూడు వారాల్లోనే ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. గతంలో రామారావు వేసిన నాటకం చూసిన ఎల్వీ ప్రసాద్ (జిష్షు) సినిమా అవకాశం ఇస్తాననటంతో ఆయన్ను కలిసేందుకు మద్రాస్ బయల్దేరుతాడు. అలా మద్రాసు చేరిన రామారావు సినీ ప్రయాణం ఎలా మొదలైంది. మొదట్లో నటుడిగా ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులేంటి. అక్కినేని నాగేశ్వర్రావు (సుమంత్)తో ఆయన అనుబంధం. వెండితెర వేల్పుగా ఎన్టీఆర్ ఎదిగిన తీరు. ఆయన్ను రాజకీయాలవైపు నడిపించిన పరిస్థితులే సినిమా కథ. చివరగా ఎన్టీఆర్ రాజకీయ పార్టీని ప్రకటించటంతో తొలి భాగాన్ని ముగించారు.
నటీనటులు :
సినిమా అంతా ఒక్క ఎన్టీఆర్ పాత్ర చుట్టూనే తిరగటంతో ప్రతీ ఫ్రేమ్‌లో బాలయ్యే తెర మీద కనిపిస్తారు. ఒక రకంగా నందమూరి అభిమానులకు ఇది పండగలాంటి సినిమా. అయితే ఎన్టీఆర్ యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో బాలయ్య లుక్ అంతగా ఆకట్టుకునేలా లేదు. నటన పరంగా మాత్రం బాలకృష్ణ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. కాస్త వయసైన పాత్రలో బాలయ్య లుక్, పర్ఫామెన్స్ బాగుంది. సినిమాలో మరో కీలక పాత్ర ఎన్టీఆర్ సతీమణి బసవ రామ తారకం. ఆ పాత్రకు విద్యాబాలన్ లాంటి నటిని ఎందుకు తీసుకున్నారో సినిమా చూస్తే అర్ధమవుతుంది. తన పర్ఫామెన్స్‌తో ఆ పాత్ర స్థాయిని ఎంతో పెంచారు విద్యాబాలన్. సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. సినిమాలో కాస్త ఎక్కువ సేపు కనిపించే మరో పాత్ర ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమ్ రావుది. ఈ పాత్రలో చాలా కాలం తరువాత దగ్గుబాటి రాజా వెండితెర మీద కనిపించాడు. లక్ష్మణుడి లాంటి తమ్ముడిగా రాజా నటన మెప్పిస్తుంది. అక్కినేని పాత్రలో ఆయన మనవడు సుమంత్ జీవించాడనే చెప్పాలి. ఆ పాత్రకు మరొకరిని ఊహించుకోలేనంత స్థాయిలో ఆ పాత్రలో ఒదిగిపోయాడు సుమంత్. ఇతర పాత్రల్లో ఎంతో మంది హేమా హేమీల్లాంటి నటులు కనిపించారు. ప్రతీ ఒక్కరు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అయితే ఏ పాత్ర ఒకటి రెండు నిమిషాలకు మించి తెర మీద కనిపించదు.
విశ్లేషణ :
యన్.టి.ఆర్ లాంటి మహానటుడి జీవిత కథను వెండితెర మీద ఆవిష్కరించే బృహత్తర బాధ్యతను తీసుకున్న దర్శకుడు క్రిష్, నందమూరి అభిమానులను దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కించాడు. కథా కథనాల మీద కన్నా బాలయ్య అభిమానులను అలరించే ఎలివేషన్ షాట్స్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఎన్టీఆర్ కథను తెలుసుకోవాలనుకున్న ప్రేక్షకులను నిరాశపరిచినా.. ఫ్యాన్స్‌ను మాత్రం మెప్పించాడు. ముఖ్యంగా కృష్ణుడిగా ఎన్టీఆర్ తెరమీద కనిపించే సన్నివేశానికి థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎన్టీఆర్, బసవ రామ తారకంల మధ్య వచ్చే సన్నివేశాలను తన స్టైల్‌లో ఎంతో ఎమోషనల్‌గా చూపించాడు దర్శకుడు. అక్కడక్కడా కథను కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాకు ప్రధాన బలం కీరావాణి సంగీతం. పాటలతో పాటు నేపథ్యం సంగీతంతో సన్నివేశాల స్థాయిని పెంచారు కీరవాణి. రచయిత సాయి మాధవ్ బుర్రా మనసును తాకే మాటలతో మెప్పించారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫి సినమాకు రిచ్ లుక్ తీసుకువచ్చింది. బాలయ్య హీరోగానే కాక నిర్మాతగాను మంచి మార్కులు సాధించారు. ఎన్టీఆర్ కథను అభిమానులకు అందించేందుకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు.
ప్లస్ పాయింట్స్ :
బాలయ్య, విద్యాబాలన్ నటన
ఎన్టీఆర్, బసవ రామ తారకంల మధ్య వచ్చే సన్నివేశాలు
సంగీతం
మాటలు
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్‌లో బాలకృష్ణ లుక్
సాగదీత సన్నివేశాలు
సినిమా లెంగ్త్
సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment