తగ్గించాక బాగుందంటున్నారు
‘‘మనకు తెలిసిన సూపర్ హిట్ సినిమాల్లో కూడా తప్పులు, లోపాలు ఉంటాయి. ఒక సినిమాను వంద శాతం అందరికీ నచ్చేలా రూపొందించడం సాధ్యం కాదు. ‘ఒక మనసు’ కొందరికి బాగా నచ్చింది. మరికొందరు ఫర్వాలేదంటున్నారు’’ అని నిర్మాత ‘మధుర’ శ్రీధర్ అన్నారు. నాగశౌర్య, నీహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘ఒక మనసు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం సంతృప్తినిచ్చిందని సోమవారం విలేకరుల సమావేశంలో ‘మధుర’ శ్రీధర్ అన్నారు. మరిన్ని విశేషాలను ఆయన ఈ విధంగా చెప్పారు.
‘ఒక మనసు’కి తొలుత మిశ్రమ స్పందన వచ్చినా... ఇప్పుడు కలెక్షన్లు బాగున్నాయి. సినిమా మొదటి అర్ధ భాగంలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువయ్యాయని అనిపించింది. వాటిలో 14 నిమిషాల నిడివి కత్తిరించాక సినిమా బాగుందంటున్నారు. మల్టీప్లెక్స్‌లో హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. నీహారిక, నాగశౌర్యల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
నీహారికతో మంచి సినిమా చేశారనే ప్రశంసలు మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నాయి. దర్శకుడిగా రామరాజు శక్తివంచన లేకుండా ఈ సినిమా రూపొందించారు. నా తదుపరి చిత్రం కూడా ఆయన దర్శకత్వంలోనే ఉంటుంది. విషాదాంత కథలు మన ప్రేక్షకులకు నచ్చవనే అభిప్రాయం ఉంది. వేరే నిర్మాతలైతే ధైర్యం చేసేవారు కాదేమో. కథే మాకు ఈ సినిమా తీసేందుకు స్ఫూర్తినిచ్చింది.
విడుదలకు ముందు ‘ఒక మనసు’ను ‘మరో చరిత్ర’, ‘గీతాంజలి’ లాంటి సినిమాలతో పోల్చడం నాకు తప్పేమీ అనిపించలేదు. ఎందుకంటే మేము ఆ సినిమాలను ఆదర్శంగా తీసుకున్నాం. మిగతా భాషల్లో భిన్నమైన సినిమాలను ఆదరిస్తున్నప్పుడు మనమెందుకు అలాంటివి చేయకూడదని అనిపించింది. నచ్చిన కథలు దొరక్కే దర్శకత్వానికి దూరంగా ఉంటున్నా. నా దర్శకత్వంలో ఈ ఏడాది చివర్లో ఒక సినిమా ప్రారంభిస్తా.